మంచి కంటే చెడు త్వరగా ఆకర్షిస్తుంది. అందుకే సినిమాల్లోనూ హీరోలను గ్యాంగ్‌స్టర్లుగా, మాఫియా డాన్‌లుగా చూపించే ట్రెండ్ పెరుగుతోంది. తెరపై చూపించే క్రైమ్ సన్నివేశాలు, వాటి ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందనే చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే సందేశాత్మక చిత్రాల నుంచి కూడా చెడునే స్వీకరిస్తుండడం.. ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కేరళలో వెలుగుచూసిన ఓ హత్య కేసు ఈ అంశంపై మరోసారి చర్చకు తెరలేపింది. తెలుగు సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ఓ సినిమా.. అక్కడ ఓ దారుణ హత్యకు స్ఫూర్తినివ్వడమే అందుకు కారణం.
కేరళలోని అలప్పుజ జిల్లాలో జరిగిన 65 ఏళ్ల వృద్ధుడి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ దొంగతనం కేసుగా మొదలైన ఈ ఘటన వెనుక.. మొదట ప్రొఫెషనల్ హంతకుల ప్రమేయం ఉందేమోనని పోలీసులు అనుమానించారు. ఆ తర్వాత లోతుగా దర్యాప్తు చేస్తే మైనర్లు, అందునా పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా నిర్ధారించుకున్నారు. అయితే తన తాత హత్యకు 13 ఏళ్ల మనవరాలే సహకరించడం.. ఈ కేసులో మరో కీలక అంశంగా వెల్లడైంది.

కరువత్తలో శివన్‌కుట్టి(65) హత్య కేసులో మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. హత్యకు 2017లో విడుదలైన ‘స్పైడర్’ చిత్ర స్ఫూర్తిగా నిలిచిందని మైనర్ నిందితుడు పోలీసులకు చెప్పడం గమనార్హం. మహేష్ బాబు నటించిన ఈ బైలింగువల్ చిత్రంలో దర్శకనటుడు ఎస్‌జే సూర్య.. సైకో విలన్ పాత్ర భైరవలో అలరించాడు. మురగదాస్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రం కమర్షియల్‌గా ఫెయిల్యూర్‌గా నిలిచింది. అయితే సూర్య విలనిజానికి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. అదుగో ఆ క్యారెక్టర్ నుంచి.. అందునా ఓ సీన్ నుంచి ఇన్‌స్పిరేషన్ తీసుకుని.. ఈ దారుణానికి ప్రణాళిక రచించినట్లు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.

సినిమా చూసి హత్యకు ప్లాన్?
పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు తొలుత శివన్‌కుట్టి ఇంటి పైకప్పు పెంకులు తొలగించి లోపలికి ప్రవేశించాలని భావించారు. నిద్రలో ఉన్న సమయంలో పెద్ద రాయితో దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఈ ఆలోచనకు 2017లో వచ్చిన తమిళ సినిమా ‘స్పైడర్’లోని ఓ హత్య సన్నివేశమే ప్రేరణగా నిలిచిందని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అయితే ఇంటి పైకప్పు కింద చెక్కతో నిర్మించిన సీలింగ్ ఉండటంతో వారి మొదటి ప్రయత్నం విఫలమైంది. దీంతో మరో మార్గంలో ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

వాట్సాప్ చాట్లే కీలక ఆధారం
ఈ కేసులో కీలక ఆధారాలు నిందితుల వాట్సాప్ సంభాషణల ద్వారా లభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి మనవరాలు, ఆమె స్నేహితుడి మధ్య జరిగిన చాట్లలో హత్యకు సంబంధించిన పలు ప్రణాళికలు చర్చించినట్లు గుర్తించారు. విషం పెట్టడం, వాహనంతో ఢీకొట్టడం వంటి పద్ధతుల గురించి కూడా వారు మాట్లాడుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా కరునాగప్పల్లి ప్రాంతానికి చెందిన ఓ కిరాయి ముఠాను సంప్రదించి హత్య చేయించేందుకు ప్రయత్నించారని.. అయితే డబ్బు ఆఫర్ చేసినా ఆ ముఠా అంగీకరించలేదని దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు.
రాత్రి రైల్లో వచ్చి.. దాడి
పోలీసుల ప్రకారం.. నిందితులు శనివారం రాత్రి కొల్లం నుంచి రైలులో కరువట్టకు చేరుకున్నారు. శివన్‌కుట్టి నిద్రపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పైకప్పు నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం విఫలమైన తర్వాత.. వెంటిలేటర్ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశం ద్వారా లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒకరు ఇంట్లోకి వెళ్లి తలుపు తెరవడంతో మిగతావారు లోపలికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. శబ్దం విని శివన్‌కుట్టి లేచి రావడంతో ఆయనపై దాడి చేసి హతమార్చారు. ఆ తర్వాత లైవ్ మర్డర్ ఫొటోలను బాలికకు నిందితుడు పంపించాడు.
ఐఫోన్, బైక్‌ల కోసం దొంగతనం?
హత్య తర్వాత ఇంట్లో ఉన్న ఆరు సవర్ల బంగారాన్ని నిందితులు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బంగారాన్ని అమ్మి బాలికకు ఐఫోన్, ఇతర నిందితులకు బైక్‌లు కొనుగోలు చేయాలనుకున్నాడు. ఇంతలో పోలీసులకు దొరికిపోయాడు.
తప్పుడు కథనం సృష్టించారా?
కేసు దర్యాప్తులో మరో కోణం కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. శివన్‌కుట్టి తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక ఆరోపించినట్లు సమాచారం. అయితే అది నిజమైన కారణమా? లేదంటే శిక్ష నుంచి తప్పించుకునేందుకు సృష్టించిన కథనా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.
కుటుంబంతో కలిసి జీవనం..
శివన్‌కుట్టి కుటుంబం రెండేళ్ల క్రితం కొల్లం నుంచి కరువట్టకు మారింది. ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, మనవరాలు తొలుత అద్దె ఇంట్లో ఉండేవారు. అనంతరం శివన్‌కుట్టి అదే ప్రాంతంలో భూమి కొనుగోలు చేసి కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఈ ఘటనలో చిన్న వయసులో ఉన్న నిందితులు ఇంత పక్కా ప్రణాళికతో.. అదీ సినిమా చూసి హత్యకు పాల్పడ్డారన్న విషయం కేరళలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.


