సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితపై కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “సుస్మిత వల్ల సురేఖ తలదించుకోవాల్సి వస్తోంది.. ఆమె వల్లే మంత్రి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొండా సుస్మిత వ్యాఖ్యలపై తాజాగా ఇందిరా శోభన్ స్పందించారు. ఈ సందర్భంగా సుస్మిత ఆలోచనలు “డైపర్ల దగ్గరే ఆగిపోయాయి” అంటూ తీవ్ర విమర్శలు చేసిన ఇందిరా శోభన్.. “సుస్మిత చదువు, సంస్కారం ఇదేనా?” అని ప్రశ్నించారు. కొండా సురేఖ పేరు లేకపోతే సుస్మిత ఎవరో కూడా తెలియదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయడానికి సుస్మితకు ఏం అర్హత ఉందని ప్రశ్నించారు. సుస్మిత వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల ముందు చులకన అవుతోందని ఇందిరా శోభన్ ఆరోపించారు. “సురేఖ పేరును సుస్మిత దిగజారుస్తోంది. సుస్మిత రెచ్చిపోతే పుచ్చిపోతది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు.. సుస్మిత వెనుక బీజేపీ, బీఆర్‌ఎస్ ఉన్నాయన్న అనుమానం కలుగుతోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుస్మిత ఏం చేశారని ప్రశ్నించిన ఇందిరా శోభన్.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడ్డది రేవంత్‌రెడ్డి అని అన్నారు. ఇదే క్రమంలో “చాలా మంది నాయకులకు సన్‌స్ట్రోక్ ఉంటుంది.. కొండా సురేఖకు డాటర్‌స్ట్రోక్ ఉంది” అంటూ ఇందిరా శోభన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారాయి. కుమార్తె వ్యాఖ్యలు, వ్యవహారశైలే సురేఖకు ఇబ్బందులు తెస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.


