సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలను నీటి కాలువలోకి నెట్టివేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు బుధవారం వారి మృతదేహాలను వెలికితీసిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులలో తొమ్మిదేళ్ల బాలిక, రెండన్నరేళ్ల బాలుడు ఉన్నారు. ఈ జంట హత్యలకు కారణం తెలిసి పోలీసులు కూడా నివ్వుపోయాడరు.
యాద్గిర్ ఎస్పీ పృథ్వీక్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు శాంతప్పకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు (9,6) ఒక అబ్బాయి ( సుమారు మూడేళ్లు). తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటి నుండి బయలుదేరి, మోటార్‌సైకిల్‌పై బిగుడి వద్ద ఉన్న కాలువకు వెళ్లాడు. తన ఆరేళ్ల కుమార్తెను మాత్రం వదిలి మిగిలిన ఇద్దర్నీ నిర్దాక్షిణ్యంగా కాలువలోకి నెట్టేశాడు. ఆ తరువాత ఆ చిన్నారని తనతో పాటు యాద్గిర్ పట్టణానికి తీసుకెళ్లాడు. అనంతరం బిగుడి (Bigudi) ప్రాంతంలోని తన ఇద్దరు పిల్లలను కాలువలోకి విసిరినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి అక్కడికి రాగా, పోలీసులు కూడా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే రాత్రి కావడంతో, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు అగ్నిమాపక శాఖ సహాయంతో గాలింపు చర్యలు తిరిగిచేపట్టారు. అదే సమయంలో కాలువలోకి నీటి ప్రవాహాన్ని నిలిపివేయాలని కృష్ణ భాగ్య జల నిగమ్ లిమిటెడ్ (KBJNL) అధికారులను కోరారు.
ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం
ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ప్రకారం ఆ ఇద్దరు పిల్లలు తమ తల్లి రేణుకకు దగ్గరగా ఉండేవారని, తనతో అంతగా కలిసి ఉండేవారు కాదని అందుకే చంపేశానని పోలీసులకు తెలిపారు. కిడ్నాప్, హత్య కేసులు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శాంతప్పను అదుపులోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని యాద్గిర్ ఎస్పీ వెల్లడించారు.


