సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం | Siddipet Horror: Car Falls into Well Four of Family Killed | Sakshi
Sakshi News home page

సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

Aug 20 2026 6:38 AM | Updated on Aug 20 2026 7:05 AM

Siddipet Horror: Car Falls into Well Four of Family Killed

సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్వంతపూర్‌కు చెందిన రాజు(35), భాగ్య(22) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. సిద్ధిపేటలో బంధువు మృతి చెందడంతో అక్కడికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో కారు అదుపు తప్పింది. వేగంగా వెళ్తున్న సమయంలో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

అర్ధరాత్రి దాటినా కుటుంబం ఇంటికి చేరుకోకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. రాజు, భాగ్యలకు ఫోన్‌ చేయగా రెండూ స్విచ్ఛాప్‌ రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టగా అప్పనపల్లి శివారులోని బావిలో కారు ఉన్నట్లు గుర్తించారు.

సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు కారులో నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మృతులను రాజు, ఆయన భార్య భాగ్య, వారి ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదాలకు నిలయంగా సిద్ధిపేట రోడ్లు..
సిద్ధిపేట జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జాతీయ రహదారులు, ప్రధాన మార్గాల్లో వాహనాల రద్దీ పెరగడం, వేగ నియంత్రణ లేకపోవడం, ప్రమాదకరమైన మలుపులు, రహదారి భద్రతా లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బలవంతపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారులను కోల్పోయిన కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement