ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఉడుకుతున్న నగరం
అసాధారణంగా పెరిగిన విద్యుత్ వాడకం
తెగవాడేస్తున్న ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు
పగలూ రాత్రి అదే స్థాయి డిమాండ్
ఈ నెల 1న ఏకంగా 4114 మెగావాట్ల వినియోగం
ఒత్తిడిలో సబ్‌స్టేషన్లు..ట్రిప్పవుతున్న ఫీడర్లు
విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో మరింత కష్టం
సాక్షి, హైదరాబాద్: ఎల్‌నినో కారణంగా గ్రేటర్ ఉడికి పోతోంది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సాధారణంగా 28 నుంచి 30 డిగ్రీలలోపు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఈ సారి 34 డిగ్రీలకుపైగా నమోదవుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా ఉక్కపోత గ్రేటర్ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడుతుండడంతో ఇంట్లోని కరెంట్ మీటర్ గిర్రున తిరుగుతోంది. సాధారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువ. ఈ సమయంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమో దు కావడం సర్వసాధారణమే.
అయితే ఇందుకు భిన్నంగా ప్రస్తుతం అర్ధరాత్రి అత్యధిక డిమాండ్ నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమయంలో లైట్లు ఆఫ్ చేసినప్పటికీ ఏసీలు ఆన్‌లో ఉండటంతో ఫీక్ డిమాండ్ నమోదవుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా సబ్‌స్టేషన్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.ఓవర్‌లోడు కారణంగా అర్ధరాత్రి ఫీడర్లు ట్రిప్పవుతూ సరఫరాలో అంతరాయాలకు కారణమవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎలా ఉంటుందో ఊహించడం కష్ట మవుతోంది.
రికార్డుస్థాయిలో డిమాండ్..
గత ఏడాది సెపె్టంబర్ 25న ఉదయం 9.41 గంటలకు గ్రేటర్‌లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 3,281 మెగావాట్లు నమోదు కాగా, అదే 2026 సెపె్టంబర్ 25న ఏకంగా 3,783 మెగావాట్లు నమోదైంది. అదే విధంగా గత ఏడాది 26న 3,200 మెగావాట్లు నమోదు కాగా, ఈ ఏడాది ఇదే రోజున 3,904 మెగావాట్లు నమోదైంది. 2025 అక్టోబర్ 1న 3,069 మెగావాట్లు నమోదు కాగా, ఈ ఏడాది ఏకంగా 4,114 మెగా వాట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఏకంగా వెయ్యి మెగావాట్లకుపైగా విద్యుత్ డిమాండ్ నమోదవడం విశేషం.
సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో మాత్రమే ఈ తరహా విద్యుత్ డిమాండ్ నమోదువుతుంది. కానీ ఎల్‌నినో కారణంగా ఈ సారి సెపె్టంబర్, అక్టోబర్‌లోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిరంతరాయ విద్యుత్ సరఫరాలో భాగంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గ్రేటర్ పరిధిలో ఏటా లైన్ల పునరుద్ధరణ పనులు సహా ఏటా పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఓవర్‌లోడుతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచారు.
అయితే ట్రాన్స్‌కో తన పరిధిలోని 132 కేవీ, 200 కేవీ,400 కేవీ సబ్‌స్టేషన్ల నిర్వహణ బాధ్యతను విస్మరించింది. దీంతో ఆ సంస్థ పరిధిలోని కీలకమైన సబ్‌స్టేషన్లన్నీ తీవ్ర ఒత్తిడికి లోనై.. ట్రిప్పవుతున్నాయి. ట్రాన్స్‌కో పరిధిలోని ఒక సబ్‌స్టేషన్/డెడికేటెడ్ ఫీడర్‌లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే దాని పరిధిలోని 5 నుంచి పది 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు సరఫరా నిలిచిపోతోంది.


