నేటి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు ! | Union Minister Amit Shah Scheduled Telangana Visit Canceled | Sakshi
Sakshi News home page

నేటి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రద్దు !

Oct 4 2026 6:12 AM | Updated on Oct 4 2026 6:12 AM

Union Minister Amit Shah Scheduled Telangana Visit Canceled

సీజేపీ నిరసనల నేపథ్యంలో.. ఢిల్లీలో ఆదివారం హైలెవల్‌ మీటింగ్‌  

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన రద్దయింది. మధ్యప్రదేశ్‌లోని భోపా­ల్‌ నుంచి శనివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకుని ఆదివారం మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో డెయిరీ పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలు, కరీంనగర్‌లో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన రద్దయినట్టుగా శనివారం సాయంత్రం రాష్ట్రపార్టీ నేతలకు సమాచారం అందింది.

ఇదిలా ఉంటే భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన తీవ్రతరం చేయడం, కాంగ్రెస్‌–ఇండిపక్షాల మద్దతు ఇవ్వడం వంటి పరిణామాలతో దేశరాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో ఆదివారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశంలో అమిత్‌ షా పాల్గొనాల్సి ఉన్నందున తెలంగాణ పర్యటన రద్దయినట్లుగా చెబుతున్నారు.

దాదాపు రెండున్నరేళ్ల కాలంలో అమిత్‌ షా తెలంగాణ పర్యటన నాలుగుసార్లు ఖరారై ఆ తర్వాత రద్దయింది. 2023 డిసెంబర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక 2024 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం ఆయన రాష్ట్రానికి వచ్చారు. ఆ తర్వాత నాలుగు వివిధ సందర్భాల్లో తెలంగాణకు అమిత్‌ షా రావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రద్దయ్యాయి. వరంగల్‌ జిల్లాలో ఓ కార్యక్రమానికి, ఖమ్మం జిల్లాలో కార్యకర్తలతో సమావేశానికి, కరీంనగర్‌లో ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ రజతోత్సవాల్లో పాల్గొనే కార్యక్రమం రెండుసార్లు ఖరారైనా చివరకు వాటిని రద్దు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement