అంగస్తంభన సమస్య చికిత్సకు వాడే టాడలఫిల్ మందును దీర్ఘకాలం వాడితే కంట్లోని ఆప్టిక్ నరం దెబ్బతిని చూపు కోల్పోయే (గ్లకోమా) ముప్పు పెరిగే అవకాశం ఉందని తైవాన్ పరిశోధకులు గుర్తించారు. అలాగే వృద్ధుల్లో ప్రోస్టేట్ గ్రంథి సమస్యల చికిత్సలో భాగంగా వాడే టాడలఫిల్ మందు వల్ల కొందరిలో మూత్రం తరచుగా రావడం, అకస్మాత్తుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని అధ్యయనంలో తెలుసుకున్నారు.
టాడలఫిల్‌ను దీర్ఘకాలంపాటు వాడటం వల్ల గ్లకోమా ముప్పు పెరుగుతుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పరిశోధకులు 40 ఏళ్లు పైబడిన 78,364 మంది పురుషుల హెల్త్ రిపోర్టులను విశ్లేషించారు. వారిలో సగం మందికి మూత్ర సంబంధిత సమస్యల చికిత్స కోసం ఐదేళ్ల వరకు టాడలఫిల్ లేదా ఇతర పీడీఈ5 ఇన్‌హిబిటర్ మందులను వాడాలని వైద్యులు సూచించారు. ఈ మందులు వాడని వారితో పోలిస్తే టాడలఫిల్ వాడిన వారిలో గ్లకోమా ముప్పు 22 శాతం ఎక్కువగా, కంట్లో ఒత్తిడి పెరగడం (ఆక్యులర్ హైపర్‌టెన్షన్) 32 శాతం అధికంగా, ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా 33 శాతం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు తైవాన్ పరిశోధకులు గుర్తించారు.
అలాగే అంగస్తంభన సమస్యకు మందులు వాడుతున్న వారిలో గ్లకోమా చికిత్స మొదలుపెట్టాల్సిన అవసరం ఏర్పడే అవకాశం కూడా 33 శాతం ఎక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఇప్పటికే గ్లకోమా లేదా కంట్లోని ద్రవంలో ఒత్తిడి సమస్యలు ఉన్నవారు, కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉన్నవారు, మయోపియా (దగ్గరివి స్పష్టంగా కనిపిస్తూ దూరాన ఉన్నవి అంత స్పష్టంగా కనిపించని నియర్‌సైటెడ్ సమస్య) ఎక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలం ఈ మందులు వాడాల్సిన వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. ఈ మందులు వాడేవారు ముందుగానే కంటి పరీక్షలు చేయించుకోవడంతోపాటు వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరమని కూడా తెలిపారు. ఈ అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీలో ప్రచురితమైంది.


