వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లెలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు వెంకటరెడ్డిని నామినేషన్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్న టీడీపీ నాయకులు
నామినేషన్ల పరిశీలన వేళా అవే దారుణాలు
అధికారులపై ఒత్తిళ్లు.. అభ్యర్థులపై దాడులు
కావలి నుంచి రాప్తాడు వరకు టీడీపీ నేతల అరాచకాలు
నామినేషన్ పత్రాలు చించివేత.. అభ్యర్థుల అడ్డగింత
ఏ కారణం లేకుండా పొన్నూరు చైర్‌పర్సన్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: పంచాయతీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజూ పచ్చ మూకలు రాష్ట్రాన్ని రక్తసిక్తం చేశాయి. ఎన్నికల్లో ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేని అధికారపక్షం ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షంతో తలపడలేక నామినేషన్ల దశలోనే నడిరోడ్డుపై దౌర్జన్యాలకు దిగింది. అధికారులను బెదిరించడం.. ప్రత్యర్థి అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించేయడం.. నామినేషన్లు వేయకుండా దాడులకు దిగడం.. చివరకు పరిశీలన ప్రక్రియలోనూ అభ్యంతరాలు, ఒత్తిళ్లతో వారిని పోటీకి దూరం చేయాలనే దారుణాలకు ఒడిగట్టింది.
కావలిలో అధికారులకే హెచ్చరికలు
నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించాలంటూ ఆర్వో కార్యాలయం వద్ద టీడీపీ మూకలు అధికారులపై తీవ్ర వత్తిడి తెచ్చారు. అధికారులనే హెచ్చరిస్తూ, అసభ్య పదజాలంతో దూషణలకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ అభ్యర్థి నామినేషన్లను తిరస్కరించడంపై అధికారులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై పచ్చ మూకలు దాడికి యత్నించాయి.
ఈలోగా టీడీపీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి రావడంతో టీడీపీ మూకలు మరోసారి దాడికి యత్నించాయి. 18వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మక్కే కిరణ్‌కుమార్ నామినేషన్ పత్రంలో తప్పులు ఉన్నాయంటూ ఆ వార్డు టీడీపీ నేతలు రచ్చ చేశారు. కిరణ్ సతీమణి దుర్గాభవాని నామినేషన్ వేసిన 6వ వార్డు ఆర్వో దగ్గరకు వెళ్లి తిరస్కరించాలంటూ రభస చేశారు.

పల్నాడు జిల్లాలో నామినేషన్లు అడ్డుకున్న పచ్చ మూకలు
పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పంచాయతీలకు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా పచ్చమూకలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చిన్నతురకపాలెం పంచాయతీకి నామినేషన్ వేసేందుకు వచ్చిన ముస్లిం అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడి చేశారు. ఇస్సపాలెం సర్పంచ్ పదవికి వైఎస్సార్‌సీపీ బలపరిచిన జల్లి సరోజినితో పాటు వార్డు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు రాగా పచ్చమూకలు అడ్డగించాయి.
నామినేషన్ కేంద్రంలో తిష్టవేసిన కిరాయి మూకలతోపాటు టీడీపీ గూండాలు వారిపై దాడికి పాల్పడ్డారు. అధికారుల ఎదుటే నామినేషన్ పత్రాలు లాక్కుని చించివేశారు. ఈ దాడిలో పలువురు మహిళా అభ్యర్థులకు గాయాలయ్యాయి. వారి చీరలు, జాకెట్లు చినిగిపోయాయి. వినుకొండ మండలం దొండపాడులో నామినేషన్ వేసేందుకు వెళ్లిన వార్డు అభ్యర్థి కరవు కొండలు, వీరాంజనేయులుపై టీడీపీ గూండాలు దాడిచేసి నామినేషన్ పత్రాలను చించివేశారు. ఎండ్రపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో 50 మంది దాడికి పాల్పడ్డారు.
అధికారులు, పోలీసుల ముందే నామినేషన్ చించివేత
పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం రాయలపేట పంచాయతీకి వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చిన మహేంద్రను పోలీసుల ముందే అక్కడున్న టీడీపీ నేతలు అడ్డుకొని, అతని నామినేషన్‌ను చించేశారు. మరో సెట్‌తో మహేంద్ర ఆర్వో వద్దకు రాగా, టీడీపీ నేతలు లోనికే వచ్చి ఆర్వో ముందే వాటిని చించేశారు.
కొలమాసనపల్లి పంచాయతీ ఏడో వార్డుకు నామినేషన్ వేయడానికి వచ్చిన ధనుంజయ నామినేషన్ పత్రాలను ఆర్వో స్వీకరించి, డిపాజిట్ కట్టించుకుని రసీదు ఇవ్వగా.. టీడీపీ నేత తిప్పయ్య శెట్టి వచ్చి ప్రతిపాదకుడు సెల్వరాజ్‌ని బెదిరించాడు. అధికార పార్టీ నేతకు తలొగ్గిన ఆర్వో డిపాజిట్ డబ్బుతో పాటు నామినేషన్ పత్రాలను తిరిగి ఇచ్చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన అభ్యర్థులు 85 పంచాయతీల్లో 60 పంచాయతీల్లో అభ్యర్థులు నామినేషన్లను వేయనివ్వకుండా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి.
కుప్పంలోనూ దాడులు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని మహ్మద్‌పురం పంచాయతీలో నామినేషన్ వేయటానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ నియోజకవర్గ నాయకుడు మునిరత్నం ఆధ్వర్యంలో టీడీపీ గూండాలు దాడి చేశారు. దాడిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నాగరాజు, పాండ్య, నాసిర్‌తో పాటు పలువురికి గాయాలయ్యాయి. కంగుంది నామినేషన్ కేంద్రంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్లను టీడీపీ గూండాలు చించేశారు.
నాయనూరు, దేవరాజపురం, బ్రహ్మదేవరచేన్లు పంచాయతీలకు నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీ నాలుగు, ఐదు వార్డులకు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన కవిత, ఎల్లమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. వీరి భర్తలు సుబ్రమణ్యం, సోమశేఖర్‌లను టీడీపీ నాయకులు బెదిరించి విత్‌డ్రా చేసుకోవాలని హెచ్చరించారు. సుబ్రమణ్యంపై దాడికి యత్నించారు. గంటలోగా విత్‌డ్రా చేసుకోవాలని హెచ్చరించారు. పోటీ నుండి తప్పుకోకపోతే చంపేస్తామంటూ కవితను ఫోన్లో దుర్భాషలాడారు.
టీడీపీ దళిత మహిళా అభ్యర్థిపైనా దాడి
తమ మాట వినని సొంత పార్టీ అభ్యర్థులను కూడా టీడీపీలోని ప్రత్యర్థి వర్గాలు వదల్లేదు. నెల్లూరు జిల్లా బోగోలులో సర్పంచ్‌గా పోటీ చేయడానికి సిద్ధమైన టీడీపీ దళిత మహిళా కార్యకర్తను కూడా బెదిరించి, దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం ప్రకా‹Ùనగర్ కాలనీలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన టీడీపీ నేత గోళ్లపల్లి సుబ్బారెడ్డిపైనా మరో వర్గం టీడీపీ గూండాలు దాడి చేశారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఎవ్వరినీ నామినేషన్ వేయనివ్వొద్దని చెప్పారంటూ ఆయన వద్ద నుంచి నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారు.
ఓటు లేకున్నా టీడీపీ అభ్యర్థి నామినేషన్
పోటీచేసే చోట ఓటు లేకపోయినా నగర పంచాయతీ టీడీపీ చైర్మన్ అభ్యర్థి నామినేషన్ వేసిన ఉదంతం మార్కాపురం జిల్లా పొదిలిలో చోటుచేసుకుంది. పొదిలి నగర పంచాయతీలో ఓటు హక్కు లేకున్నా టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వరికుంట్ల అనిల్‌కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నగర పంచాయతీలో ఓటు హక్కు లేకపోయినా.. నామినేషన్లు ఎలా వేస్తారని వైఎస్సార్‌సీపీ నాయకులు, పార్టీ అనుబంధ విభాగం న్యాయవాదులు ఎన్నికల అధికారులను ప్రశి్నంచారు.
ఉడవగండ్లలో మహిళలపై దాడి
పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం ఉడవగండ్ల గ్రామంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, పుల్లారెడ్డి, మరో కార్యకర్త ఇళ్లపై పచ్చ గూండాలు మంగళవారం రాత్రి రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఇళ్లలో మహిళల పైనా దాడి చేశారు. రేపు నామినేషన్‌కి వస్తే చంపుతామని కేకలు వేస్తూ గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేశారు.

తొట్టంబేడులో దాడులపై ఫిర్యాదు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో నామినేషన్ల సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులపై కూటమి నేతలు దాడులకు పాల్పడటంపై వైఎస్సార్‌సీపీ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనల్లో గాయపడిన సర్పంచ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్‌రెడ్డి తదితరులు కలెక్టర్‌ను కలిసి బాధితులకు న్యాయం చేయాలని, రక్షణ కలి్పంచాలని కోరారు.
అకారణంగా పొన్నూరు చైర్‌పర్సన్ అభ్యర్థిని నామినేషన్ తిరస్కరణ
గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిని షేక్ బీబీజాన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు మంగళవారం అకారణంగా తిరస్కరించారు. ఈ విషయం తెలుసుకుని మున్సిపల్ కార్యాలయానికి వచి్చన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయం బయట నిరసన తెలుపుతున్న మురళీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు.
మాజీ మంత్రి సురేష్ హౌస్ అరెస్టు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కాకర్ల నామినేషన్ కేంద్రంలో సోమవారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తీసుకోవడం లేదని నిరసన తెలిపిన మాజీ మంత్రి ఆదిమూలపు సురే‹Ùపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఆయన్ను హౌస్ అరెస్టు చేస్తున్నట్లు ఎస్సై ఎల్ సుధీర్‌కుమార్ 41 నోటీసు ఇచ్చారు.
వైఎస్సార్ జిల్లాలో ఎస్సై దాష్టికం
రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ గూండాలు దాడులు చేశారు. ఆ తర్వాత టీడీపీ నేతల ఒత్తిడితో గ్రామానికి వచి్చన ఎస్సై వైఎస్సార్‌సీపీ శ్రేణులపై విరుచుకుపడి, కనిపించిన ప్రతి ఒక్కరినీ లాఠీలతో చితకబాదారు. బద్వేలు నియోజకరవర్గం బి.కోడూరు మండలంలోని మేకవారిపల్లె సర్పంచి అభ్యర్థి, వైఎస్సార్‌సీపీ మద్దతుదారు మాచిరెడ్డి వెంకటరెడ్డిని నామినేషన్ కేంద్రానికి వెళ్లకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. ఆయనపై దౌర్జన్యం చేసి నామినేషన్ పత్రాలను లాక్కొని, వెనక్కి పంపేశారు.
వైఎస్సార్‌సీపీ నుంచి నామినేషన్లు రాకూడదని సీఎంఓ ఆదేశాలు!
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో బుధవారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. పులివెందుల పరిధిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవాలంటూ సీఎంఓ నుంచి ఆదేశాలు వచి్చనట్లు సమాచారం. దీంతో మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ డీఎస్పీ, సీఐలతో హడావుడిగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ముందే పులివెందుల డీఎస్పీతో బీటెక్ రవి మంతనాలు సాగించినట్లు సమాచారం.


