షర్మిలకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్న
మీ తాత రాజారెడ్డి హత్య వెనుక చంద్రబాబు పాత్రను మరిచారా?
మీ వ్యక్తిత్వాన్ని హననం చేసిన చంద్రబాబు, లోకేశ్‌ను ఎలా నమ్ముతున్నారు?
జగన్‌ను అక్రమంగా నిర్బంధించిన చంద్రబాబుతో రాజకీయ స్నేహం దేనికి?
జగన్ ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు వ్యూహంలో మీరు భాగస్వామి కాలేదా?
మీకూ, జగన్‌కూ మధ్య లేఖలు టీడీపీకి ఎలా చేరాయి?
మీపై అసభ్య దూషణలు చేసిన వారిపై చర్యలు కోరలేదెందుకు?
ఒకరికి మద్దతుగా ఇంకొకరు పనిచేస్తున్నప్పుడు ‘చెట్టపట్టాల్’ అని రాయడం సహజమే..
బాబుతో రాజకీయ చెట్టాపట్టాల్‌కు కారణం వ్యక్తిగత ప్రయోజనాలేగా?
సాక్షి,అమరావతి: వైఎస్సార్ కుటుంబాన్ని రాజకీయంగా, వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు దశాబ్దాలుగా కుట్రలు చేసిన చంద్రబాబుతోనే నేడు షర్మిల చెట్టాపట్టాలేసుకుని తిరగడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్ రాజారెడ్డి హత్య మొదలు వైఎస్సార్ కుటుంబంపై జరిగిన రాజకీయ, వ్యక్తిత్వ దాడుల వరకు చంద్రబాబు పాత్రను గుర్తుచేస్తూ షర్మిలకు సూటిగా ప్రశ్నలు సంధించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు చేతిలో పావుగా మారి, వైఎస్సార్ కుటుంబానికి ద్రోహం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సాక్షి కథనంపై షర్మిల ట్వీట్, దానికి మద్దతుగా లోకేశ్ చేసిన ట్వీట్‌లోని అంశాలు ప్రస్తావిస్తూ మంగళవారం రాచమల్లు ఎక్స్‌లో పోస్టు చేశారు. అందులో ఏమన్నారంటే..
చంద్రబాబుతోనూ, ఆయన ముఠాతోనూ వైఎస్సార్ 30 ఏళ్లపాటు పోరాటం..
‘షర్మిలమ్మా.. మీ కుటుంబాన్ని అథఃపాతాళానికి తొక్కేయడానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశాడో ప్రజలందరికీ తెలుసు. చివరకు మీ తాతగారు రాజారెడ్డి దారుణమైన హత్య వెనుక ఉన్నదీ చంద్రబాబు పన్నాగమే. బాబుతోనూ, ఆయన ముఠాతోనూ వైఎస్సార్ 30 ఏళ్లపాటు పోరాటం చేశారు.
ఆ కుట్రలను తట్టుకుంటూ, ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందిస్తూ, జననాయకుడిగా, మహానాయకుడిగా ఎలా ఎదిగారో, ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో తెలియంది కాదు. వైఎస్సార్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిక్షణం కూడా ఆయన్ని దించేయడానికి ఇదే బాబు, ఆయన ముఠా చేయని ప్రయత్నం లేదు. చివరకు ఆయన ఆకస్మిక మరణం, ఈ మొత్తం ఘటనపై ఉన్న ప్రశ్నలకు నేటికీ సమాధానాలు దొరకలేదు.
మీ వ్యక్తిత్వంపై దారుణంగా దాడి చేసినా...
ఆ తర్వాత కూడా ఇదే చంద్రబాబు, ఆయన ముఠా మీ కుటుంబాన్ని ఎలా కష్టాలపాలు చేశారో, స్వయంగా మీ అన్నని అన్యాయంగా ఎలా నిర్బంధానికి గురిచేశారో, చివరకు మీ వ్యక్తిత్వంపై దారుణమైన దాడి ఎలా చేశారో ప్రజలందరికీ గుర్తే. అదే చంద్రబాబు ముఠాపై మీరు ఫిర్యాదు కూడా చేశారు. అలాంటి చంద్రబాబు, ఆయన ముఠాతో ఇవాళ మీ మైత్రి, చెలిమిని కళ్లారా చూస్తున్న వైఎస్సార్ అభిమాని దిగ్భ్రాంతి చెందుతున్నాడు. మీ తండ్రిని దారుణంగా మాట్లాడుతున్నా, మీ తాత రాజారెడ్డిని అవహేళన చేస్తున్నా, ఆయనకు తప్పుడు ఉద్దేశాలు అంటగట్టి ఒక ముద్ర వేస్తున్నా మీ కుటుంబాన్ని గొడ్డలి కుటుంబం అన్నా, మీరు ఖండించట్లేదు. పైగా అదే ముఠాతో మీరు నిత్యం భేటీ అవుతున్నారు.
చెట్టాపట్టాల్ అని అనడం, రాయడం సాధారణంగా జరిగేదే...
మీ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబుతో మీ సమావేశాలపై పత్రికల్లో వచ్చిన కథనాలకు మీరు సొంత భాష్యాలను, నిర్వచనాలను ఇచ్చుకుంటున్నారు. ఒకరికి మద్దతుగా ఇంకొకరు పనిచేస్తున్నప్పుడు, కలిసి ముందుకు సాగుతున్నప్పుడు ‘చెట్టాపట్టాల్’ అని అనడం, రాయడం సాధారణంగా జరిగేదే. రాజకీయ కథనాల్లో దీన్ని విస్తృతంగా వాడుతారు. అనేక తెలుగు పత్రికలు ఇవే పదాలను కొన్ని లక్షలసార్లు రాశాయి. కానీ, ఇవాళ మీరు ఈ వార్తా కథనాన్ని వక్రీకరించి వాటికి మీ పొలిటికల్ ఆలోచనలు, చంద్రబాబు కుట్ర వ్యూహాలను అద్ది, ప్రజలకు తప్పుడు అభిప్రాయాలు పంపే ప్రయత్నం చేస్తున్నారని అందరికీ అర్థమవుతోంది.
జగన్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రయత్నంలో చంద్రబాబుకు తోడ్పాటు..
తెలంగాణలో పార్టీ పెట్టిన మీరు, తెలంగాణ నా గడ్డ అని నినదించిన మీరు అక్కడ పార్టీని మూసేసి, కాంగ్రెస్ తరఫున ఏపీకి వచ్చిన నాటినుంచీ చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేస్తున్నారు. బహిరంగంగా బీజేపీతో, అంతర్గతంగా కాంగ్రెస్‌తో చంద్రబాబు స్నేహం, చెట్టాపట్టాలేసుకోవడం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా, చంద్రబాబు ఎలా చేయమంటే మీరు అలా చేశారు. ఎవర్ని నిలబెట్టమంటే వారిని నిలబెట్టారు. జగన్ విజయావకాశాలను దెబ్బతీసేందుకు బాబు చేసే కుట్రలకు మీరు తోడ్పాటు అందించారు.
బాబుతో కలిసి రాజకీయ కుట్రలు చేస్తారా..
మీ కుటుంబంలో మీ అన్నకి, మీకూ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఆ లేఖలు, నేరుగా టీడీపీ అధికారిక హేండిల్‌లో ఏరకంగా బయటకు వచ్చాయి? మొన్న బెంగళూరు ఇంటి విషయంలో మీకూ, మీ అన్నకి అంతర్గతంగా జరిగిన విషయాలు ఎల్లో వీుడియా ద్వారా, అదీ స్థానిక ఎన్నికలకు ఒక్కరోజుముందు ఎలా బయటకు వచ్చాయి? మీరు ఆరోజు చేసిన ట్వీట్ ఎవరికి ఉపయోగపడాలని చేశారు? మరి ఇవన్నీ మీరు, చంద్రబాబుతో రాజకీయంగా చేస్తున్న రాజకీయ కుట్రలు కావా? చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగుతున్నట్టా? కాదా?
ఎక్స్‌లో అంతగా తిడితే మీరెందుకు స్పందిచలేదు?
బాధతోనైనా ఈ సందర్భంలో మరొక దారుణమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. గతవారం జనసేన, టీడీపీ కార్యకర్తలు 350 మంది ట్విట్టర్ (ఎక్స్) స్పేస్ ద్వారా మీ గురించి, మీ వదిన గురించి, మహిళల గురించి నీచమైన భాషలో, సభ్యసమాజం తలదించుకునే భాషలో తిడితే, దానివీుద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళాలోకం ఆగ్రహం వ్యక్తం చేస్తే, అనేక జిల్లాల్లో ఫిర్యాదులు చేస్తే, మీరు గొప్పగా భావిస్తున్న చంద్రబాబు, ఇవాళ మీకు మద్దతు పలుకుతున్న లోకేశ్ ఇద్దరూ ఎవరిమీదా చర్యలు తీసుకోలేదు.
కనీసం ఎఫ్‌ఐఆర్‌కూడా నమోదు చేయలేదు. మరి మీరెందుకు స్పందించలేదు? అంటే చంద్రబాబుకు వ్యతిరేకంగా మీరు వ్యవహరించరని ఇక్కడే తేలిపోయింది. మరి రాజకీయంగా చెట్టాపట్టాలేసుకుని ముందుకు సాగుతున్నట్టా? కాదా? చంద్రబాబు రాజకీయంగా ఏం చెప్తే అది చేస్తున్నారు కాబట్టి, దీనికి ప్రతిఫలంగా ఇవాళ మీకు కావాల్సిన పనులన్నీ చంద్రబాబు చేస్తున్నారు. మీ మనుషులకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటున్నారు. మైనింగ్ లీజులు ఇప్పించుకుంటున్నారు. ఇవన్నీ జగమెరిగిన సత్యమే.
మీ వ్యక్తిత్వాన్ని హననం చేసింది ఇదే చంద్రబాబు, లోకేశ్ అని మరచిపోయారా?
మీరు ట్వీట్ చేయగానే, చంద్రబాబు సుపుత్రుడు, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, లోకేశ్ వెంటనే మీకు మద్దతు పలకడం, గొర్రె తోలు కప్పుకున్న తోడేలు మాదిరిగా మానవ సంబంధాల గురించి లెక్చర్లు ఇవ్వడం వెనుక ఉద్దేశాలేంటో, ప్రజలందరికీ అర్థంకానిది కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా మీ కుటుంబాన్ని కూల్చేయడానికి వాళ్లు వేసే ఎత్తులు ఇవన్నీ.
నిజమైన సైతాన్‌లు వాళ్లంతా. ఇవాళ వాళ్లు మీకు పలికే మద్దతు అంతా వైఎస్సార్ కుటుంబం కూలిపోవాలన్న ఉద్దేశంతో చేసిందే. తన మామ బాలకృష్ణ భవనంలోనే సోషల్ సైకోలను పెట్టి మీ వ్యక్తిత్వాన్ని హననం చేసింది ఇదే చంద్రబాబు, లోకేశ్ అని మీరు మరిచిపోవడం ఆశ్చర్యకరం.
చంద్రబాబు, ఆయన ముఠాతో మీ చెలిమి వ్యక్తిగత లాభంకోసమేగా!
పైగా వైఎస్సార్‌కీ, చంద్రబాబుకీ ఎలాంటి విభేదాలు లేవని ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం మీరు చేయడం అత్యంత శోచనీయం. 1998 మేలో రాజారెడ్డి హత్యకు గురైన తర్వాత, వైఎస్సార్ ఏరోజూ బాబు గడపతొక్కలేదు. పైగా రాజారెడ్డిని హత్య చేసిన వారికి చంద్రబాబు ఆశ్రయం కల్పించారని, వారితో ఫొటోలు కూడా దిగారని వైఎస్సార్ ఆ రోజుల్లోనే ప్రజల సాక్షిగా చెప్పారు. అధికారంలో ఉన్న చంద్రబాబు దోషులను కాపాడే ప్రయత్నంలో భాగంగా వారందరికీ ట్రయల్ కోర్టులో ఊరట దక్కడం, మళ్లీ హైకోర్టులో శిక్ష పడ్డం, దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించడం, ఇదే సందర్భంలో టీడీపీతో హంతకులకున్న సంబంధాలు కూడా సుప్రీంకోర్టులో నమోదుకావడం ఇవన్నీ చారిత్రక సత్యాలు. చంద్రబాబు, ఆయన ముఠాతో మీ చెలిమి నిస్సందేహంగా వ్యక్తిగత లాభం కోసమే అని అందరికీ తెలుసు.
చంద్రబాబు చేతిలో మీరు పావుగా మారారన్నది వాస్తవం. వైఎస్సార్ పైన, ఆయన కుటుంబంపైనా ఎన్నో కుట్రలు చేసిన చంద్రబాబుతో, ఆయన ముఠాతో మీ మైత్రిని వైఎస్సార్ అభిమానులెవరూ సహించరు. భరించరు. అంగీకరించరనేది మరోసారి స్పష్టం చేస్తున్నాం’ అంటూ రాచమల్లు పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: అమరావతి ఔటర్.. మళ్లీ టెండర్?


