ఏడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ | Cyclone Akvan Red Alert in 7 AP Districts: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

Nov 18 2026 6:32 AM | Updated on Nov 18 2026 6:32 AM

Cyclone Akvan Red Alert in 7 AP Districts: Andhra Pradesh

ఆక్వాన్‌ తుపానుపై వాతావరణ శాఖ హెచ్చరిక

గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గంటకు 145 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు

20న నెల్లూరు–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం

సాక్షి, అమరావతి: కోస్తాలోని ఏడు జిల్లాలకు వా­తా­వరణ శాఖ ‘ఆక్వాన్‌ తుపాను’ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఈ ఏడు జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని అంచనా వేసింది. కాకినాడ–యానాం, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. గురు, శుక్ర వారాల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ రెండురోజులు తీరంవెంట గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 145 కిలోమీటర్ల వరకు పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది. 

దిశ మార్చుకుని ప్రయాణం...
ఆక్వాన్‌ తుపాను దిశ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా శుక్రవారం నెల్లూరు–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొదట నెల్లూరు–తుని మధ్య తీరం దాటుతుందని అంచనా వేసినా, నెల్లూరు–విశాఖపట్నం మధ్యే తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 

మంగళవారం రాత్రి సమయానికి ఆక్వాన్‌ తుపాను గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. మచిలీపట్నానికి, విశాఖపట్నానికి 650 కిలోమీటర్లు, చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇది తీవ్ర తుపానుగా, గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  తుపాను ప్రభావంతో కోస్తాలోని ఏడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు భారీగా జలమయమవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాలు కురిసే జిల్లాలివే ...
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు,ప్రకా­శం, నెల్లూరు జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది. శుక్రవారం అల్లూరి, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలను ఎల్లో నుంచి ఆరెంజ్‌ జాబితాలోకి చేర్చింది.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తిరుపతి జిల్లాలు మాత్రమే ఎల్లోలో ఉన్నాయి. శుక్రవారం ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకు దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement