సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను ఈ నెల 10 నుంచి 18 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. వేడుకల ఏర్పాట్లపై శనివారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తున్నట్టు సీఎస్ తెలిపారు.
ఆరోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక కేంద్రంనుంచి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా వచ్చి ట్యాంక్‌బండ్ చేరుకుంటారని చెప్పారు. వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని వివరించారు. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసే ప్రత్యేక వేదిక వద్ద జరిగే ఈ బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు సైతం హాజరవుతారన్నారు. పండుగ శోభ సంతరించేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడమే కాకుండా.. పలు జంక్షన్లు, అన్ని ప్రధాన కార్యాలయాల వద్ద విద్యుద్దీపాలతో అలంకరించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.


