20ల నుంచే గుండె జబ్బుల ముప్పు? | Rising Heart Disease Risk in Young Adults | Sakshi
Sakshi News home page

20ల నుంచే గుండె జబ్బుల ముప్పు?

Oct 4 2026 5:10 AM | Updated on Oct 4 2026 5:10 AM

Rising Heart Disease Risk in Young Adults

ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు రెండు కోట్ల మంది గుండె, రక్తనాళాల సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం కూడా అందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. గుండె జబ్బులు బయటపడటానికి కొన్నేళ్ల ముందు నుంచే దేహంలో వాటికి సంబంధించిన మార్పులు మొదలుకావచ్చని రెండు వేర్వేరు అధ్యయనాలు వెల్లడించాయి. చాలా చిన్నవయసు నుంచే గుండె ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని గట్టిపడి అథెరోస్క్లెరోసిస్ అనే కండిషన్‌ను గుర్తించడానికి గుండె జబ్బులేవీ లేని 16,808 మంది వ్యక్తులకు స్కానింగ్‌ పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల్లో 57 శాతం మందిలో అప్పటికే ఈ సమస్యకు సంబంధించిన తొలిదశ లక్షణాలు కనిపించాయి. 18 నుంచి 29 ఏళ్ల వయసున్న వారిలో సైతం ప్రతి 13 మందిలో ఒకరికి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం మొదలైనట్లు గుర్తించారు. ఇక 60 నుంచి 70 ఏళ్ల వారిలో దాదాపు 90 శాతం మందికి ఈ సమస్య ఉన్నట్లు తేలింది. ఈ సమస్య మొదలయ్యే తీరులో పురుషులు, మహిళల్లో తేడాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పురుషుల్లో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం చాలా ముందే మొదలవుతుండగా మహిళల్లో మాత్రం రుతుక్రమం ఆగిపోయే దశలో ఈ సమస్య వేగంగా పెరుగుతున్నట్లు గుర్తించారు.

ఈ అధ్యయన ఫలితాలు ‘న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌’లో ప్రచురితమయ్యాయి. ఇక సర్క్యులేషన్‌: పాపులేషన్‌ హెల్త్‌ అండ్‌ అవుట్‌కమ్స్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైన మరో అధ్యయనంలో సగటున 23 ఏళ్ల వయసున్న 1,283 మంది యువతీ యువకులను పరిశీలించగా వారిలో దాదాపు 80 శాతం మందిలో గుండె, మూత్రపిండాలు, జీవక్రియలకు సంబంధించిన సమస్యలు తొలిదశలో ఉన్నట్లు బయటపడింది. అలాగే వారిలో దాదాపు మూడు శాతం మందికి అప్పటికే రక్తనాళాలు దెబ్బతిన్నట్లు తెలిపే లక్షణాలు కనిపించాయి. పౌష్టికాహారం, వ్యాయామం, పొగాకు దూరంగా ఉండటం, బరువు నియంత్రణ, తగినంత నిద్ర ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement