హార్మోన్లలో హెచ్చు తగ్గులే అందుకు కారణం | Hormonal fluctuations are a major cause of mood swings | Sakshi
Sakshi News home page

హార్మోన్లలో హెచ్చు తగ్గులే అందుకు కారణం

Nov 19 2026 6:36 AM | Updated on Nov 19 2026 6:36 AM

Hormonal fluctuations are a major cause of mood swings

మన(సు)లో మాట

మా పాపకు 13 సంవత్సరాలు. ఆరు నెలల క్రితం పుష్పవతి అయింది. అంతకుముందు తను చాలా బాగా చదువుకునేది, అందరితోనూ కలివిడిగా ఉండేది. కానీ ఎప్పుడైతే తను మెచ్యూర్‌ అయిందో, అప్పటి నుండి తనలో విపరీతమైన మూడ్‌ స్వింగ్స్‌ వస్తున్నాయి. ఎప్పుడూ బాధగా, దిగులుగా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఉంటోంది, అంతకుముందులాగా ఇప్పుడు చురుగ్గా లేదు. 

క్లాసులు జరుగుతున్నప్పుడు పరధ్యానంగా ఉంటోందని, హోమ్‌వర్క్‌లు సరిగ్గా రాయట్లేదని, మార్కులు కూడా తగ్గుతున్నాయని స్కూల్లో టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి వచ్చాక ఏ కారణం లేకుండానే ఏడుస్తుంది. ‘ఏమైందమ్మా’ అని అడిగితే, ‘నాకేం అర్థం కావట్లేదు, ఊరికే ఏడుపు వస్తోంది’ అని అంటుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోవట్లేదు, తిండి కూడా సరిగ్గా తినడం లేదు. గైనకాలజిస్ట్‌ వద్దకు తీసుకువెళ్తే, వారు హార్మోన్ల మార్పుల వల్ల కావచ్చునని చెబుతూ ఒకసారి సైకియాట్రిస్ట్‌ను కలవమని సలహా ఇచ్చారు. దయచేసి మా పాప పరిస్థితికి తగిన పరిష్కారం చెప్పగలరు.
– సౌజన్య, అనకాపల్లి

ఈ సమస్య నేడు యుక్తవయసులోకి అడుగుపెడుతున్న చాలామంది అమ్మాయిలు ఎదుర్కొంటున్నదే! మీ పాప జీవితంలో ఇప్పుడే ఒక పెద్ద శారీరక, మానసిక పరివర్తన దశ ప్రారంభం కావడం వల్ల ఈ మార్పులు వస్తుంటాయి. పుష్పవతి అయిన సమయంలో వారి శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్‌ వంటి హార్మోన్లు చాలా వేగంగా మారుతుంటాయి. ఈ హార్మోన్ల హెచ్చుతగ్గులు మెదడు లోపల భావోద్వేగాలను నియంత్రించే ‘అమిగ్డల’ వంటి కొన్ని భాగాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

 దానికి తోడు, భావోద్వేగాలను సమతుల్య పరిచే మెదడు ముందు భాగం పూర్తిగా పరిపక్వత చెందడానికి సుమారు 16 నుండి 18 ఏళ్ల వయసు వరకు సమయం పడుతుంది. ఈ రెండు వ్యవస్థల మధ్య అసమతుల్యత వలన ఆ వయసు పిల్లలు తమ భావోద్వేగాలను సరిగ్గా నియంత్రించుకోలేక సతమతమవుతుంటారు. వీటికితోడు, ఇంతవరకు ఎంతో స్వేచ్ఛగా ఉన్న ఆ అమ్మాయికి పుష్పవతి అయిన తర్వాత ఇంటా బయటా ఒక్కసారిగా సమాజం నుండి కొన్ని రకమైన ఆంక్షలు ఎదురవుతుంటాయి. వాటిని ఆ చిన్నారి తట్టుకోలేకపోవచ్చు. 

అలాగే, స్నేహితులతో ఉండే బంధంలో తేడాలు రావడం, తన శరీరంలో వస్తున్న శారీరక మార్పులు ఆందోళనకు గురిచేస్తుంటాయి. ఒకవేళ ఈ చికాకు, మానసిక అశాంతి కేవలం పీరియడ్స్‌కు కొన్ని రోజుల ముందే ఎక్కువగా కనిపిస్తే, దానిని వైద్యపరంగా ‘ప్రీమెన్‌స్ట్రువల్‌ డిస్ఫోరిక్‌ డిజార్డర్‌’అంటారు.  కొంతమంది అమ్మాయిల్లో వంశపారపర్యంగా లేదా జీవసంబంధమైన కారణాల వల్ల ఏదైనా మానసిక సమస్యలొచ్చే అవకాశం ఉంటే, అవి ఈ వయసులోనే బయట పడే అవకాశం ఉంది. కాబట్టి, ఆలస్యం చేయకుండా ఒక సైకియాట్రిస్టును కలవడం చాలా ముఖ్యం. 

వారు పాప పూర్తి ఆరోగ్య చరిత్రను సేకరించి, ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి, ఒక ’మూడ్‌ చార్ట్‌’ ద్వారా సమస్యను విశ్లేషిస్తారు. ఆ తర్వాత అవసరమైన సైకోథెరపీ ద్వారా ఆమె పరిస్థితిని మెరుగుపరుస్తారు. అవసరమైతే  తక్కువ మోతాదులో మందులు వాడి ఆ పరిస్థితిని పూర్తిగా నయం చేయడానికి సహాయం చేస్తారు. ఈ సమయంలో తల్లిదండ్రులుగా మీరు పాపకు పూర్తి భరోసాగా, నైతిక మద్దతుగా ఉండండి.  అవసరం అయితే మీ పాప చదివే స్కూల్లోని టీచర్లకు కూడా ఆమె పరిస్థితి గురించి వివరించి, వారి సాయం కూడా తీసుకోండి. ఆల్‌ ది బెస్ట్‌

డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. 
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement