న్యూస్‌మేకర్
టక్సిడో సూట్, చేతిలో గన్స్ వెనుక సిగ్నేచర్ ట్యూన్స్ కొనసాగింపుగా గన్స్ సౌండ్ కొత్త జేమ్స్‌బాండ్ వచ్చేశాడు. 2021లో ‘నో టైమ్ టు డై’ సినిమాతో ఆఖరైన డేనియల్ క్రెయిగ్ స్థానాన్ని 40 ఏళ్ల రాబర్ట్ ప్యాటిన్సన్స్ తీసుకున్నాడు. అయితే ఈ సెలక్షన్స్ వెనుక పెద్ద కసరత్తు ఉంటుంది. జేమ్స్‌బాండ్ 007 స్టోరీ ఇది.
‘ఈ పాత్ర దక్కడం ఓ కల. చూడబోతే ఆ కల నిజమైనట్టుంది’ అని ఉద్వేగపడ్డాడు రాబర్ట్ ప్యాటిన్సన్. జీవితాంతం కీర్తిని తెచ్చిపెట్టే జేమ్స్‌బాండ్ పాత్ర దక్కడం మాటలు కాదు. అంతరిక్షంలో చంద్రుడిపై నడిచిన వ్యోమగాముల కంటే జేమ్స్‌బాండ్‌గా వేసిన నటుల సంఖ్య తక్కువ. బాండ్‌కు ప్రపంచవ్యాప్తంగా అందుకే అంత క్రేజ్. లండన్, లాస్‌ఏంజిల్స్ మధ్య షూటింగ్స్ కోసం తిరిగే ప్యాటిన్సన్ ప్రస్తుతం సినిమాకు 230 కోట్లు తీసుకుంటున్నాడు. మూడు బాండ్ చిత్రాల కాంట్రాక్ట్ వల్ల సినిమాకు 250 కోట్లు చొప్పున ఫ్రాంచైజీలతో కలిపి దాదాపు 850 కోట్లు సంపాదించబోతున్నాడు. రొట్టె విరిగి బాండ్ టోపీలో పడటం అంటే ఇదే.
మై నేమ్ ఈజ్ బాండ్
‘మై నేమ్ ఈజ్ బాండ్... జేమ్స్ బాండ్’... ఈ ఐకానిక్ డైలాగ్ ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆరు దశాబ్దాలకు పైగా ఉర్రూతలూగిస్తోంది. ఒక్కసారి బాండ్‌గా ప్రపంచమంతా తెలిసిపోవడమే కాదు ఒకవైపు సాహసాలు, మరోవైపు అందగత్తెల మధ్య జీవితాన్ని గడిపేస్తారు. అందుకే బాండ్ పాత్రపై నటులకూ ప్రేక్షకులకూ ఆసక్తి. ఆ ఆసక్తి పోకూడదనే ఐదేళ్ల నిరీక్షణ తర్వాత అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ కొత్త 007ను తెరపైకి తెచ్చింది. హాలీవుడ్ స్టార్ రాబర్ట్ ప్యాటిన్సన్స్ కు వరమాల వేసింది. సీన్ కానరీ నుంచి డేనియల్ క్రెయిగ్ వరకు కేవలం ఆరుగురు నటులు మాత్రమే పోషించిన బాండ్ పాత్రకు ఇప్పుడు ప్యాటిన్సన్ ఏడో కృష్ణుడు.
ప్యాటిన్సన్స్ నే ఎందుకు?
అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మాతలు, దర్శకుడు డెనిస్ విల్లెనెవ్ కొత్త బాండ్ ఎంపిక కోసం సుదీర్ఘ కసరత్తు చేశారు. తుది జాబితాలో కల్లమ్ టర్నర్, జాక్ లోడెన్, జోష్ ఓ కానర్, నికోలస్ హౌల్ట్ వంటి ప్రతిభావంతులైన బ్రిటిష్ నటులతో పాటు ప్యాటిన్సన్ కూడా ఉన్నాడు. పోటీ తీవ్రం. 2026 అక్టోబర్ చివరి వారంలో వీరందరికీ కఠినమైన స్క్రీన్ టెస్టులు, స్టంట్ పరీక్షలు, డైలాగ్ డెలివరీ టెస్టులు నిర్వహించారు.
‘బాండ్ కేవలం గూఢచారి మాత్రమే కాదు, ఒక హంతకుడు కూడా. కళ్లలో ఆ కసి, లోతైన తెలివితేటలు, డార్క్ హ్యూమర్, గదిలోకి అడుగుపెట్టగానే అందరినీ ఆకర్షించే అయస్కాంత శక్తి ఉన్న నటుడు కావాలి’ అంటాడు దర్శకుడు విల్లెనెవ్. ప్యాటిన్సన్ ఆ పరీక్షలన్నింటిలోనూ నూటికి నూరు మార్కులు సాధించి విజేతగా నిలిచాడు.
ముందు ఇమేజ్ తర్వాతి ఇమేజ్
సాధారణంగా బాండ్ నిర్మాతలు బాండ్ పాత్ర కోసం అప్పటి వరకు పెద్దగా స్టార్ ఇమేజ్ లేని నటులను ఎంచుకునేవారు. సీన్ కానరీ, డేనియల్ క్రెయిగ్ లు బాండ్ అయిన తర్వాతే స్టార్లుగా ఎదిగారు. ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి, ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా ఉన్న ప్యాటిన్సన్స్ ను ఎంచుకున్నారు.
ఇయాన్ ఫ్లెమింగ్ నవలల్లోని బాండ్‌లా బ్రిటిష్ యాస, ఠీవి, 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వంటి షరతులన్నింటికీ ప్యాటిన్సన్ సరిగ్గా సరిపోయాడు. అయితే పూర్తిస్థాయి 007గా మారడానికి కఠిన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ వంటి ఆత్మరక్షణ విద్యలు, అత్యాధునిక ఆయుధాల వినియోగం, హై స్పీడ్ కార్ చేజింగ్ డ్రైవింగ్, బ్రిటిష్ రాయల్ నేవీ కమాండో తరహా బాడీ లాంగ్వేజ్‌పై అతను ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది.
అమెజాన్ సంస్థ బాండ్ ఫ్రాంచైజీపై కంట్రోల్ తీసుకున్న తర్వాత వస్తున్న తొలి సినిమా ఇది. ‘పీకీ బ్లైండర్స్’ సృష్టికర్త స్టీవెన్ నైట్ దీనికి అద్భుతమైన కథనాన్ని సిద్ధం చేస్తున్నాడు. 2027లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, 2028 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 1962లో ‘డాక్టర్ నో’తో మొదలైన బాండ్ సినిమాల ప్రయాణం ఎన్ని తరాలు మారినా, ఎంతమంది హీరోలు మారినా చెక్కుచెదరని చరిత్రను సృష్టిస్తూనే ఉంది. ఇప్పుడు ఆ వారసత్వాన్ని రాబర్ట్ ప్యాటిన్సన్ ఏ స్థాయికి తీసుకెళ్తాడో చూడాలి! n
ఎవరీ రాబర్ట్ ప్యాటిన్సన్?
రాబర్ట్ ప్యాటిన్సన్ లండన్ కుర్రాడు. 2005లో ‘హ్యారీ పోటర్’లో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత 2008లో వచ్చిన ‘ట్విలైట్’ సిరీస్‌లో నటించి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్‌కే పరిమితం కాకుండా ‘టెనెట్’, ‘ది లైట్‌హౌస్’, ‘గుడ్ టైమ్’ వంటి విభిన్న చిత్రాలతో తన నటనా ప్రతిభను నిరూపించుకున్నాడు. 2022లో ‘ది బ్యాట్‌మన్’ చిత్రంలో బ్రూస్ వేన్స్ గా నటించి సూపర్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. 2026లో ‘ది ఒడిస్సీ’, ‘ది డ్రామా’, ‘ప్రైమ్‌టైమ్’ చిత్రాలతో పాటు ‘డ్యూన్: పార్ట్ 3’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌లో టాప్ ఫామ్‌లో ఉన్నాడు.


