అమెరికా–ఇరాన్ డీల్ జరగబోయేది ఇక్కడే..! | US-Iran Peace Deal Set at James Bond Goldfinger’ Resort | Sakshi
Sakshi News home page

అమెరికా–ఇరాన్ డీల్ జరగబోయేది ఇక్కడే..!

Jun 17 2026 1:19 PM | Updated on Jun 17 2026 1:34 PM

US-Iran Peace Deal Set at James Bond Goldfinger’ Resort

స్విట్జర్లాండ్‌లోని ఓ ప్రశాంత పర్వత ప్రాంతం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా లగ్జరీ రిసార్ట్‌గా, పర్యాటక వేదికగా మాత్రమే గుర్తింపు పొందిన ఈ ప్రదేశం… ఇప్పుడు యూఎస్–ఇరాన్ శాంతి ఒప్పంద సంతకానికి వేదికగా మారనుండటంతో అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. కానీ ఈ ప్రదేశానికి ఉన్న చరిత్ర, అక్కడ జరిగిన గత కీలక పరిణామాలు చూస్తే… ఇది కేవలం ఒక రిసార్ట్ మాత్రమే కాదనే ఫీలింగ్‌ కలగకమానదు.

స్విట్జర్లాండ్‌లోని బుర్గెన్‌స్టాక్ (Bürgenstock) రిసార్ట్ ప్రపంచ రాజకీయాలకు మరోసారి కేంద్రబిందువుగా మారింది. నాలుగు నెలలుగా కొనసాగిన యుద్ధాన్ని ముగించేందుకు యూఎస్–ఇరాన్ మధ్య కుదిరిన మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్‌పై సంతకాలు ఈ శుక్రవారం ఇక్కడే జరగనున్నట్లు సమాచారం. అయితే.. పర్వత శిఖరంపై, సరస్సును చుట్టుముట్టినట్లుగా ఉన్న ఈ రిసార్ట్‌ను సమావేశానికి ఎంపిక చేయడం వెనుక భద్రతా కారణాలు ప్రధానంగా ఉన్నాయని స్విస్ అధికారులు తెలిపారు. యూఎస్, ఇరాన్‌తో పాటు పాకిస్తాన్ మరియు ఖతర్ మధ్యవర్తుల సూచనల మేరకు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. 

ఈ లగ్జరీ హోటల్ సముదాయం 150 ఏళ్ల చరిత్ర కలిగినది. ప్రపంచ నేతలు, రాజ కుటుంబాలు, హాలీవుడ్ ప్రముఖులు తరచూ ఇక్కడి అతిథులుగా వచ్చారు. ప్రశాంత వాతావరణం, బహుముఖ భద్రతా ఏర్పాట్లు, చేరుకోవడం కష్టమైన భౌగోళిక స్థానం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇక్కడి చరిత్రలో ప్రముఖ ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. 1950లలో ప్రపంచ నాయకులు, కళాకారులు ఈ రిసార్ట్‌ను కలుసుకునే వేదికగా ఉపయోగించారు. 

బ్రిటిష్ నటుడు సీన్ కానరీ జేమ్స్ బాండ్ సినిమా “గోల్డ్‌ఫింగర్” షూటింగ్ సమయంలో ఇక్కడే నెలరోజులు ఇక్కడే బస చేశారు. ఈ రిసార్ట్‌లోని నిర్మాణం కూడా విశిష్టంగా ఉంటుంది. పర్వత అంచున 450 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సముదాయం నాలుగు ప్రధాన హోటల్ భవనాలు, విలాసవంతమైన సూట్లు, విల్లాలతో కూడి ఉంటుంది. కొన్ని సూట్ల ధరలు ఒక్క రాత్రికి వేల డాలర్ల వరకు ఉంటాయి. ప్రత్యేక రైల్వే మార్గాలు, లిఫ్టులు, సరస్సు ద్వారా రాకపోకలు ఈ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.

హాలీవుడ్ క్లాసిక్ జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్‌కు వేదికైన ఈ లగ్జరీ ప్రదేశం… ఇప్పుడు యుద్ధం ముగింపు చర్చలు అక్కడే ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నకు ప్రపంచం సమాధానం వెతుకుతోంది. అయితే.. 

ప్రపంచ రాజకీయ చర్చలు, శాంతి ఒప్పందాలు కూడా ఇదే ప్రదేశంలో జరిగిన సందర్భాలు ఉన్నాయట.  గతంలో కూడా ఇక్కడ ప్రపంచ స్థాయి రాజకీయ సమావేశాలు జరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు, సుడాన్ శాంతి ఒప్పందం, సైప్రస్ సమస్యపై చర్చలు వంటి కీలక సమావేశాలకు ఇది వేదికగా నిలిచింది. అంతేకాదు, బిల్డర్‌బర్గ్ వంటి అత్యంత రహస్య గ్లోబల్ మీటింగ్స్ కూడా ఇక్కడే జరిగిన చరిత్ర ఉంది. మొత్తానికి, సినిమాల్లో కనిపించే లాంటి ఆ లగ్జరీ పర్వత రిసార్ట్ ఇప్పుడు మరోసారి ప్రపంచ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారుతోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement