వాషింగ్టన్: వైట్‌హౌస్ మాజీ కోవిడ్-19 రెస్పాన్స్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆశిష్ ఝా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 మహమ్మారి ప్రకృతి సిద్ధంగా వ్యాపించలేదని, వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ప్రమాదవశాత్తూ వైరస్ లీకై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాలోని సీఎన్ఎన్ వార్తా సంస్థకు తాజాగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను బైడెన్ ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఈ వైరస్ సహజ సిద్ధంగానే పుట్టి ఉంటుందని భావించానని, అయితే ఆ తర్వాత లభించిన సమాచారం ఆధారంగా ఇది ల్యాబ్ లీక్ వల్లే జరిగి ఉంటుందని నిర్ధారణకు వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.
అయితే, ఈ విషయమై ఎలాంటి కచ్చితమైన ఆధారాలు లేవని, చైనా అధికారులకు మాత్రమే దీనికి సంబంధించిన అసలు నిజాలు తెలుసని ఆయన పేర్కొన్నారు. దీనిపై చైనా ప్రభుత్వం మరింత పారదర్శకతను ప్రదర్శించాల్సిన అవసరం ఉందని ఝా నొక్కిచెప్పారు. ఈ వైరస్‌ను ఉద్దేశపూర్వకంగా లేదా ఇంజనీరింగ్ ద్వారా తయారు చేయలేదని, కేవలం ప్రమాదవశాత్తూ జరిగిన లీక్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై అమెరికాలో ఎవరికీ వందశాతం కచ్చితమైన సమాచారం లేదని, ఎవరైనా అలా చెబితే అది నమ్మశక్యం కాదని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ పుట్టుకపై దర్యాప్తు, చర్చల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


