నేడు వరల్డ్ టాయిలెట్ డే
మరుగుదొడ్డి అనేది పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. మహిళా భద్రత నుంచి ఆత్మగౌరవం వరకు ఎన్నో విషయాలతో ముడిపడి ఉన్న అంశం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో గ్రామాలలో బహిరంగ మలవిసర్జనకు స్వప్తి చెప్పేలా, మరుగుదొడ్లను నిర్మించుకునేలా చేయడానికి ప్రజలను ఏకతాటిపై తీసుకురావడంలో సామాన్య మహిళలు అసామాన్య కృషి చేశారు. చేస్తున్నారు...
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన కళావతిదేవి మేస్త్రీ పనిచేసేది. మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో మహిళలు పడే కష్టాలను కళ్లారా చూసింది. పరిష్కారం కోసం నడుం కట్టింది. తమ ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతాలలో నాలుగు వేలకు పైగా మరుగుదొడ్లు నిర్మించింది. ‘ఏడువందల కుటుంబాలు నివసించే చోట ఒక్క కమ్యూనిటీ టాయిలెట్ కూడా ఉండేది కాదు. దీంతో బహిరంగ మల విసర్జన తప్ప వేరే మార్గం ఉండేది కాదు. మహిళలు ఎన్నోరకాలుగా ఇబ్బందులు పడేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే నరకం అంటే ఇలా ఉంటుంది... అని చెప్పేలా ఉండేది పరిస్థితి’ గతాన్ని గుర్తు చేసుకుంది కళావతి.
ఇంటింటికీ ప్రచారం
ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్ల ప్రాముఖ్యత గురించి ప్రచారం చేసేది కళావతి. అయితే ఆమెది నల్లేరు మీద నడకేమీ కాదు. దారి పొడుగునా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కమ్యూనిటీ టాయిలెట్‌ల కోసం భూమిని విరాళంగా ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆర్థిక సహాయం చేయడానికి, శ్రమదానం చేయడానికి స్థానిక ప్రజలు ఎవరూ ముందుకు రాకపోగా కొందరు ‘మరుగుదొడ్డి అవసరమా?’ అని అడగడం కళావతిని ఆశ్చర్య పోయేలా చేసింది!
ఎంత కష్టమైనా సరే..!
అర్బన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ కింద తమకు ఏ పథకాలు వర్తిస్తాయో తెలుసుకోవడానికి కాన్పూర్ మున్సిపల్ కమిషనర్‌ను కలిసింది కళావతి. ఆమె చెప్పింది కమిషనర్‌కు బాగా నచ్చింది. ప్రజల నుంచి లక్ష రూపాయలు సేకరిస్తే, కార్పొరేషన్ రెండు లక్షలు ఇస్తుందని కమిషనర్ చెప్పారు. ఆ రోజుల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి మూడు లక్షల వరకు ఖర్చు అయ్యేది. దాంతో రిక్షాకార్మికులు, భవన నిర్మాణకార్మికులు, రోజువారి కూలి పనులు చేసుకునే వారు కూడా పది నుంచి గరిష్టంగా వందరూపాయల వరకు ఇచ్చారు. అలా మొత్తం యాభై వేల వరకు సేకరించగలిగారు. ఆ తరువాత ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందింది. పనులు ఊపందుకున్నాయి. ‘నా పనులు మానుకొని మరీ మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో భాగం అయ్యాను. ఎందుకంటే... మరుగుదొడ్ల నిర్మాణంతో వాతావరణ పరిశుభ్రత పెరుగుతుంది. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వీలవుతుంది’ అంటుంది కళావతి.
భర్త వ్యతిరేకించారు!
బిహార్‌లోని కలనౌర్ గ్రామానికి చెందిన పూనమ్ దేవి, నగీనాదేవి ‘ఉజ్వల్ గ్రామ సంఘటన్’ అనే మహిళా స్వయం సహాయక బృందంలో పనిచేస్తున్నారు. ‘మా ఇంటి పరిసరాల్లో మరుగుదొడ్డి నిర్మాణం కోసం స్వయం సహాయక సంఘం నుంచి రుణం తీసుకోవాలని అనుకున్నాను. మనది మట్టి ఇల్లు కదా, మనకెందుకు అంటూ నా భర్త అందుకు వ్యతిరేకించగా చివరకు ఆయనను ఎలాగో ఒప్పించి మరుగుదొడ్డి నిర్మించాను’ గతాన్ని గుర్తు చేసుకుంది పూనమ్.
నేర్చుకొని... నేర్పిస్తూ
జార్ఖండ్‌కు చెందిన సునీతాదేవి తన గ్రామం ఉదయపురను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా మార్చాలనుకుంది. ఒక శిక్షణ శిబిరంలో మరుగుదొడ్ల నిర్మాణం గురించి నేర్చుకుంది. మరుగుదొడ్డి నిర్మించడానికి అవసరమైన అన్ని సాంకేతిక అంశాలను తెలుసుకుంది. శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత, ఇంటింటికీ వెళ్లి మరుగుదొడ్ల ప్రాముఖ్యత గురించి ప్రచారం చేసింది. ఎంతోమంది మరుగుదొడ్లు నిర్మించుకునేలా కృషి చేసింది.
వీల్‌చైర్ విత్ టాయిలెట్
‘టాయిలెట్‌కు కూడా వెళ్లే పరిస్థితి లేదు. దీని కంటే చావడం నయం’ అని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఒక పేషెంట్ బాధను కళ్లారా చూసిన బయోమెడికల్ ఇంజినీర్ శ్రుతి తన తండ్రి, మెకానికల్ ఇంజినీర్ అయిన కె.కె. బాబుతో కలిసి పరిశుభ్రమైన, టాయిలెట్ వ్యవస్థతో కూడిన వీల్‌చైర్ తయారు చేసింది. దీనికి ‘సహాయత’ అని పేరు పెట్టారు. దీనిలో వాటర్ ట్యాంక్, జెట్ స్ప్రే, వ్యర్థాల కంటైనర్, సంరక్షకుల శ్రమను తగ్గించే స్ట్రెచర్ ఉంటాయి. ఈ ‘సహాయత’ 140 కి పైగా దేశాలలో పేటెంట్ పొందింది.
– యాకుబ్ పాషా


