breaking news
Self-respect
-
తేజస్వీకి ప్రతిష్ట.. నితీశ్‌కు పరీక్ష!
పట్నా గద్దె కోసం జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం రసకందాయంలో పడింది. ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని సర్వ శక్తులు ఒడ్డుతుండగా, విపక్షాల ‘మహాగఠ్‌బంధన్’ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ‘ఉద్యోగాల హామీ’తో దూసుకెళ్తున్నారు. ఈ మహా సంగ్రామంలో కీలక నియోజకవర్గాలు రాష్ట్ర భవిష్యత్తును శాసించనున్నాయి. ఇవి కేవలం అభ్యర్థుల గెలు పోటములను మాత్రమే కాదు తేజస్వీ ప్రతిష్టకు, నితీశ్ కుమార్ ఆత్మగౌరవానికి అసలైన అగ్ని పరీక్షగా నిలుస్తున్నాయి. ఈ 14 కీలక స్థానాల ను ఓసారి పరిశీలిద్దాం. ఈ ఎన్నికల్లో కొందరు అగ్రనే తల భవితవ్యం కొన్ని ప్రత్యేక నియో జకవర్గాలతో ముడిపడి ఉంది. వారి గెలుపు కంటే, వారి ప్రభావం ఎంతమేరకు ఉందనేది ఇక్కడ కీలకం.1.రాఘోపూర్: ఈ నియోజకవర్గం తేజస్వీ యాదవ్‌కు కంచుకోట. గత పదేళ్లుగా ఈయన ఇక్కడి నుంచే భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. దీంతో ఈసారి మెజారిటీ ఎంత? అనే చర్చ సైతం ఇప్పటికే మొదలైంది. ఇక్కడ యాదవ–ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకే. అయితే ఈసారి మెజారిటీ తగ్గొచ్చనే ప్రచారం మొదలైంది. 2020 ఎన్నికల్లో తేజస్వీతో తలపడిన బీజేపీ కీలకనేత సతీష్ కుమార్ యాదవ్ ఈసారి సైతం బరిలో దిగి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈసారి ముచ్చటగా మూడోసారి తేజస్వీ గెలిచినా మెజారిటీ తగ్గితే అది తేజíస్వీకి ఇబ్బందే. 2. నలంద: ఇది ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సొంత జిల్లా. నలంద ఆయన రాజకీయాలకు కేంద్ర స్థానం కూడా. ఇది ఆయన సామాజిక వర్గమైన కుర్మీ జనాభా అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ జేడీయూ అభ్యర్థి, మంత్రి శ్రవణ్ కుమార్ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. ఆయనను మహాగఠ్‌బంధన్ అభ్యర్థి, కాంగ్రెస్ నాయకుడు కౌశలేంద్ర కుమార్ ఢీకొంటున్నారు. నితీశ్ నేరుగా పోటీ చేయకపోయినా, ఇక్కడ జేడీయూ గెలుపు అనేది సీఎం నితీశ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. 3. జముయ్: లోక్‌జనశక్తి( ఎల్జేపీ– రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రాథినిధ్యంవహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో ఈ జముయ్ శాసనసభ నియోజకవర్గం ఉంది. ఇక్కడ పాశ్వాన్(దళిత) వర్గం ఓట్లు కీలకం. అధికార ఎన్డీఏ కూటమిలో సీఎం నితీశ్ కుమార్‌తో విభేదాల తర్వాత కూటమిలో చిరాగ్‌కు ఏ స్థాయిలో పరపతి ఉందనేది ఈ స్థానంలో గెలుపుతో తేలిపోనుంది. ఎన్డీఏ తరపున అంతర్జాతీయ షూటర్, బీజేపీ నేత శ్రేయసి సింగ్ మరోసారి పోటీలో నిలబడ్డారు. ఆర్జేడీ నుంచి షంషాద్ ఆలం బరిలో ఉన్నారు. నితీశ్‌పై కోపంతో చిరాగ్ సొంత కూటమి అభ్యర్థిని ఓడిస్తారా? లేదంటే మిత్రధర్మం పాటించి తమ ఓట్లు కూడా బీజేపీకి పడేలా చేస్తారా? చూడాలి!4. హసన్పూర్: లాలూ కుటుంబం లేకుండా.. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 2020లో ఈస్థానం నుంచి గెలిచారు. అయితే ఈసారి హసన్‌పూర్‌లో సమీకరణాలు పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తేజ్‌ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరించడం, ఆర్జేడీ కొత్తగా మాలా పుష్పంను బరిలోకి దించడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడ తేజ్ ప్రతాప్‌తో సంబంధంలేకుండా ఆర్జేడీ ఏ మేరకు విజయతీరాలను చేరుకుంటుందనేది ఆసక్తికరం. 5. కిషన్‌గంజ్: రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరమైన పోరు కిషన్‌గంజ్‌లో జరుగుతోంది. ఇక్కడ జనాభాలో దాదాపు 70 శాతం మంది ముస్లింలే. ‘లౌకిక’ ఓటు అనేది ఇక్కడ ప్రధానం. ఇక్కడ పోరు ఎన్డీఏ–మహాగఠ్‌బంధన్ మధ్య కాదు. మహాగఠ్‌బంధన్–ఎంఐఎం మధ్యే పోరులా ఉంది. 2020లో కాంగ్రెస్ అభ్యర్థి ఇజాహరుల్ హుస్సేన్ స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఈసారి మహాగఠ్బంధన్కూటమి తరఫున కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ పోటీచేస్తున్నారు. ఎన్డీఏ తరఫున బీజేపీ నేత స్వీటీ సింగ్, ఎంఐఎం తరఫున షామ్స్ ఆగాజ్ పోటీ పడుతున్నారు. ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చితే 2020లో మాదిరిగానే బీజేపీ అనూహ్యంగా లబ్ధి పొందే అవకాశముంది.6.ఆరా: కుల సమీకరణాల యుద్ధభూమి భోజ్‌పూర్ ప్రాంతంలోని ఆరా నియోజకవర్గంలోనూ కుల రాజకీయాలు చాలా ఎక్కువ. ఇక్కడ చాన్నాళ్లుగా ఎన్డీఏ తరఫున రాజ్‌పుత్‌లు, ఆర్జేడీ తరఫున యాదవ్‌లు పోటీపడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గం(ఈబీసీ) ఓటర్లు ఇక్కడ ‘కింగ్‌మేకర్’గా మారనున్నారు.7.అగియావ్ (ఎస్సీ): అగియావ్ (ఎస్సీ) నియోజకవర్గం సీపీఐ–ఎంఎల్(లిబరేషన్) పార్టీకి కంచుకోట. 2020లో ఇక్కడ మనోజ్ మంజిల్ గెలిచారు. దళిత, పేద, భూమిలేని కార్మికులే ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తారు. ఈసారి మహాగఠ్బంధన్కూటమి తరఫున సీపీఎం నేత శివప్రకాశ్ రంజన్ పోటీ చేస్తుండగా ఎన్డీఏ తరఫున బీజేపీ నాయకుడు మహేష్ పాశ్వాన్ నిలబడ్డారు. 8. ముంగేర్: భూమిహార్ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం ముంగేర్. సాంప్రదాయంగా ఎన్డీఏకు మద్దతిచ్చే ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు తేజస్వీయాదవ్ ‘ఏ టు జెడ్’ నినాదమిచ్చారు. ఇక్కడ ఎన్డీఏ తరఫున బీజేపీ నేత కుమార్ ప్రణయ్ బరిలో నిల్చున్నారు. ఆర్జేడీ తరఫున ముఖేష్ యాదవ్ రంగంలోకి దిగారు. ఎంఐఎం అభ్యర్థి హసన్ సైతం ముందడుగు వేయడంతో ఇక్కడ త్రిముఖపోరు అనివార్యమైంది. 9. పట్నా సాహిబ్: రాజధానిలోని పట్నా సాహిబ్ నియోజకవర్గం బీజేపీకి దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఇక్కడ వైశ్యులుసహా అగ్ర వర్ణాల ఓట్లు అధికం. మోదీ ఛరిష్మా, జాతీయవాదం ఇక్క డ చాలా బలంగా పనిచేస్తాయి. 2020లో బీజేపీ నాయకుడు నంద్ కిషోర్ యాదవ్ ఘన విజయం సాధించారు. అయినాసరే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ను మార్చేసి రత్నేష్ కుష్వాహాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. మహాగఠ్‌బంధన్ కూటమి నుంచి కాంగ్రెస్ నేత శశాంత్ శేఖర్ పోటీ చేస్తున్నారు. 10. గయా టౌన్: మగధ్ రాజధాని గయా టౌన్ కూడా బీజేపీకి మరో బలమైన కేంద్రం. ఇక్కడ వైశ్య, అగ్రవర్ణాల ఓట్లు కీలకం. బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ఇక్కడ మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ తరపున మోహన్ శ్రీవాస్తవ బరిలో ఉన్నారు.11. ఝంఝార్పూర్: మిథిలాంచల్‌లోని ఝంఝార్పూర్ నితీశ్ కుమార్ అత్యంత వెనుకబడిన తరగతుల ఓటు బ్యాంకుకు అసలైన పరీక్ష. 2020లో ఇక్కడ బీజేపీ గెలిచింది. ఈసారి కూడా ఎన్డీఏ తరఫున బీజేపీ నేత, మంత్రి నితీశ్ మిశ్రా బరిలో ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ఓడితే, అది నితీశ్ తన ప్రధాన ఓటు బ్యాంక్‌పై పట్టు కోల్పోతున్నారనడానికి సంకేతం.12. భాగల్పూర్: ‘సిల్క్ సిటీ’ భాగల్పూర్లో కాంగ్రెస్ ’స్ట్రైక్ రేట్’ పరీక్షకు నిలుస్తోంది. 2020లో మహాగఠ్‌బంధన్ ఓటమికి కాంగ్రెస్ పేలవ ప్రదర్శన ఒక కారణం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ శర్మ (కాంగ్రెస్)ను, 2020లో స్వల్ప తేడాతో ఓడిపోయిన బీజేపీ నాయకుడు రోహిత్ పాండే ఢీకొట్టనున్నారు. ఆర్జేడీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ కావడం ఇక్కడ కీలకం.13. పూర్ణియా: సీమాంచల్ రాజధాని పూర్ణియాలో మిశ్రమ జనాభా ఉంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం–యాదవ్ సమీకరణాలు పనిచేస్తాయి. వీరితోపాటు ఈబీసీ ఓటర్ల మద్దతు కూడగడితేనే అభ్యర్థి గెలుపు సాధ్యం. 14. బెట్టియా: పశ్చిమ చంపారన్‌లో ‘చెరకు బెల్ట్’గా పేరొందిన బెట్టియా నియోజకవర్గంలో రైతుల తీర్పు కీలకం కానుంది. చెరకు చెల్లింపుల్లో జాప్యం వంటి సమస్యలు ఇక్కడ ప్రధాన ప్రచారాస్త్రాలు. ఇక్కడ బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవితో కాంగ్రెస్ అభ్యర్థి వాసి అహ్మద్ పోటీ పడుతున్నారు. -
ముదిరాజ్‌ల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముదిరాజ్‌ల ఆత్మగౌరవం దెబ్బతీసేవిధంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ముదిరాజ్‌ల ఆత్మగౌరవసభలో ఈటల మాట్లాడుతూ జనాభానిష్పత్తి ప్రకారం ముదిరాజ్ లు 11 శాతం ఉన్నారని, పదకొండుమందికి ఎమ్మె ల్యేలుగా అవకాశం దక్కాలని, ఇరవై ఏళ్ల నుంచి ఇద్దరు లేక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతం ఉంటే... 9 మంత్రి పదవులు రావాలని, కానీ మూడు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఒకశాతం జనాభా లేని జాతి నుంచి సీఎంతో పాటు నలుగురుæ మంత్రులు ఉన్నారన్నా రు. మేము ఈ రాష్ట్రానికి ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం ఇస్తున్నామని, కానీ మీరు చేపపిల్లల పేరిట రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని, చేపపిల్లలు కాదు నేరుగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో బీసీలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్‌ల ఆత్మగౌరవ సభను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, మీటింగ్‌కు వెళితే ప్రభుత్వ పథకాలు రావని బెదిరించారని ఈటల ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అన్నింటిని ఎదుర్కొని ఆత్మగౌరవసభకు భారీగా తరలివచ్చారన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ తెలుసని తాను ప్రజల మనిషినని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా, గుండాలు చంపుతామని బెదిరించినా వెనక్కి తగ్గలేదని, రాష్ట్రంలో అన్ని కులాల సమస్యలపై గొంతెత్తి పోరాడానని గుర్తు చేశారు. ముదిరాజ్‌లను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని తాను ఎమ్మెల్యే అయిన మొదటిరోజు నుంచే కొట్లాడుతున్నానని, వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జడ్చర్ల సభలో ముదిరాజ్‌లను బీసీడి నుంచి బీసీ ఏలోకి మారుస్తా అని చెప్పారని, అదే సభలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించారన్నారు. అయితే బీసీ ఏ రిజర్వేషన్ ఒక్క సంవత్సరం మాత్రమే అమలైందని, మైనారిటీ వారు ఏడుగురు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, సుప్రీంకోర్టుకు వెళ్లి వారు గెలిచారని, మనకు ఎవరు లేక పట్టించుకోవడం లేదని చెప్పారు. మేం వేరే రాష్ట్రం నుంచి వచ్చామా : నీలం మధు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా మా ముదిరాజ్‌లను గుండెల్లో పెట్టుకొని ఎవరు ఎన్ని సీట్లు కేటాయిస్తారో, వారితోనే పొత్తు పెట్టుకొని వారితోనే ఉంటామని ముది రాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలంమధు చెప్పారు. ఆరోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడామో.. అదే ఆత్మగౌరవం ముదిరాజ్ జాతికి దక్కేలా పోరాడతామన్నా రు. బీసీల్లో 60 లక్షల మంది ఉన్న ముదిరా జ్లకు రాజకీయ గుర్తింపు లేదా..?మేము వేరే రాష్ట్రం నుంచి వచ్చామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ముదిరాజ్‌లందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ సభతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దద్దరిల్లింది. ఈటల రాజేందర్ ప్రసంగిస్తుండగా సభకు హాజరైన పలువురు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట శంకర్, పులుమేడ రాజు, చొప్పారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
తొమ్మిదేళ్లుగా తెలంగాణ ఆత్మగౌరవం కోల్పోతోంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అన్నివర్గాల భాగస్వామ్యంతో ఏర్పడిందని, తొమ్మిదేళ్లుగా ప్రజలు మోసగించబడుతూ, ఆత్మగౌరవం కోల్పోయారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం జలవిహార్‌లో రేపటి తెలంగాణ ఆకాంక్షల వేదిక అధ్యక్షతన జరిగిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేశారని, ప్రైవేట్ వర్సిటీలను ఏర్పాటు చేసి పేదలకు ఉన్నతవిద్య దూరం చేశారని చెప్పారు.ముప్పైమంది విద్యార్థులకు ఒక టీచర్ పేరుతో దాదాపుగా ఎనిమిదివేల స్కూళ్లను మూసివేశారని, పీహెచ్డీ చేసినవారు రూ.5వేలకు పనిచేస్తున్నారని, ఈ పరిస్థితులను చూస్తే రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దళితబంధు, బీసీలకు లక్ష రూపాయల సహాయం ఓట్ల కోసమేనని, కేసీఆర్‌కు కుర్చీ మీద ఉన్న ప్రేమ, ప్రజల మీద లేదని, పుట్టిన పిల్లలమీద రూ.1.25 లక్షల అప్పు చేసిపెట్టారని చెప్పారు. వచ్చే నెల 6న అన్నివర్గాల సమస్యలను పుస్తకం రూపంలో విడుదల చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, జస్టిస్ నరసింహారెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, తేజావత్ రామచంద్రుడు, మాజీ ఐపీఎస్ అధికారులు అరవింద్‌రావు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ప్రతినిధి పేరాల శేఖర్‌రావు, తుర్క నరసింహ, అశ్వథ్వామరెడ్డి, విఠల్, ప్రొఫెసర్ గాలి వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
సంపద.. సమృద్ధి
సన్యసించిన వ్యక్తులు, పరమహంసలు, మఠాధిపతులు, పీఠాధిపతులు... వీరు సర్వసాధారణంగా ఆత్మోద్ధరణకు సంబంధించిన విషయాలమీద అనుగ్రహభాషణలు చేస్తుంటారనీ, వారు తాము తరించి, ఇతరులు తరించడానికి సంబంధించిన మార్గాలను బోధచేయడం వరకే పరిమితం అవుతారని లోకంలో భావన చేస్తుంటారు. కానీ ఈ భావనలకు భిన్నంగా వెళ్ళిన గురువు ఒకరున్నారు. ఆయన సమర్ధ రామదాసు. ఈ దేశం కష్టాల్లో ఉన్నప్పుడు సనాతన ధర్మానికి పూర్వ వైభవం తీసుకురావడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. దేశంలో సమకాలీన పరిస్థితులను బాగా అధ్యయనం చేసారు. ఆ కాలంలో ఉన్న పాలనా వ్యవస్థ, అప్పుడున్న సామాజిక అలజడులు, ప్రజలలో అప్పుడున్న అభద్రతా భావాన్ని దష్టిలో పెట్టుకుని ప్రజలకు మౌలికంగా ఏవి అవసరమో వాటిని బోధించి, ఆచరణలో కూడా మార్గదర్శనం చేసిన గురువు ఆయన. ప్రజలు తమ శారీరక ఆరోగ్యంతోపాటూ, ఆత్మరక్షణకు అవసరమయిన దృఢత్వాన్ని పొందడానికి ఆయన పర్యటించిన ప్రదేశాల్లో వ్యాయామశాలలు నెలకొల్పారు. ఆరోగ్యంతోపాటూ మానసిక పరిణతికి చదువు అవసరమని పాఠశాలలు ఏర్పాటు చేసారు. ఆధ్యాత్మిక క్రమశిక్షణకు, ధర్మంపట్ల అనురక్తి కలగడానికి భక్తి అవసరమని హనుమాన్ మందిర్ లు నిర్మించారు. ప్రజలందరిలో దేశభక్తి నూరిపోసారు. ఆయన ప్రజలకు తరచుగా ఆరు సూత్రాలు బోధిస్తుండేవారు...అవి ఎప్పటికీ ఆచరణ యోగ్యాలే. వాటిలో మొదటిది సంపద, సమృద్ధి. అంటే అందరివద్దా సంపద ఉండాలి, అది కూడా సమృద్ధిగా ఉండాలి. లేకపోతే తను వ్యక్తిగతంగా అనుకున్నది కూడా సాధించలేరు, జీవితంలో అభ్యున్నతిని పొందలేరు. ఒక వయసు వచ్చిన తరువాత, మనిషి కష్టపడి స్వయంగా సంపాదించుకోవడం అవసరం. దీని ప్రాధాన్యతను మన సుభాషితాలు కూడా చక్కగా వివరించాయి. మాతానిందతి/ న అభినందతి పితా / భ్రాతా న సంభాషతే! భృత్యః కృప్యతి/ న అనుగచ్ఛతి సుతః/ కాంతాచ న ఆలింగతే/ అర్థప్రార్థన్ శంకయా న కురుతే స్వాలాపమాత్రం సుహృత్ / తస్మాత్ అర్థముపాశ్రయ శ్రుణు సర్వేహి అర్థేన సర్వే వశాః... అంటాయి. అంటే – నీకంటూ సంపాదన లేకపోతే ఎప్పుడూ నిందించని అమ్మ కూడా నిందిస్తుంది. తండ్రి సంతోషంతో భుజం మీద చెయ్యివేసి ఆప్యాయంగా అభినందించడు. తోడపుట్టినవారు కూడా చులకన చేస్తారు. పలకరించరు.సేవకుడికి ఏదయినా పని చెబితే... పైసా విదల్చడు కానీ పనులు మాత్రం చెబుతుంటాడని ఆగ్రహిస్తాడు. పిల్లల అభ్యున్నతికి ఖర్చుపెట్టనప్పుడు కన్న కుమారుడు సేవలందించడు. ఇల్లు గడవడానికి అవసరమయిన సొమ్ము తీసుకురానప్పుడు కట్టుకున్న భార్య ప్రేమగా కౌగిలించుకోదు. ఎంత మంచి స్నేహితుడయినా ఎదురుపడితే అప్పు అడుగుతాడేమోనని ముఖం చాటేస్తాడు. అందువల్ల ఓ స్నేహితుడా! నీతి తప్పకుండా సంపాదించు. దానితో సమస్తమూ నీకు వశపడుతుంది... అంటారు. ఒక తోటలో అరవిరిసిన పువ్వుల వాసనలకన్నా.... కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ద్రవ్యం ఎంత తక్కువయినా దాని సువాసన ఎక్కువగానే ఉంటుందని కూడా అంటారు. అలా సక్రమ మార్గంలో కష్టపడి మనిషి సంపాదించి బతకగలగాలి. అది ఆత్మగౌరవం. అది మనిషికి సంపూర్ణతను ఇస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
International Mothers Day: ఆలోచింప చేసే అమ్మ కథ
‘అమ్మను మసిగుడ్డలా చూస్తున్నామా?’ అని ప్రశ్నిస్తుందో తెలుగు కథ. ‘ఇంట్లో నుంచి బయటకు పో అని అమ్మను నాన్న ఎందుకు అంటుంటాడు’ అని నిలదీస్తుంది మరో కథ. ‘అమ్మ ఒంటి నిండా మందులు చేరడానికి కారణం ఎవరు?’ అని వేదన చెందుతుంది ఇంకో కథ. ‘అమ్మకు కంటి నిండా నిద్రన్నా ఉంటుందా?’ అని కన్నీరు కారుస్తుంది కథ. ‘మదర్స్ డే’ రోజున అమ్మను తలచుకోవడం, గౌరవించడం అందరూ చేసేదే. కాని ఆమె గురించి ఆలోచించాలి. సరిగా ఆలోచించాలి. ఆమె శ్రమను, గౌరవాన్ని, స్థానాన్ని సమస్థాయిలో ఉంచడం గురించి తెలుగులో వచ్చిన కొన్ని గొప్ప కథల ప్రస్తావన... ఆమె పేరు ఏమిటో ఆమెకు గుర్తు లేదు. భర్త ‘అది’ అంటాడు. ఇంటికి రాగానే ‘అదెక్కడా?’ అని కొడుకును అడుగుతాడు. కొడుక్కు కూడా ‘అది’ అనడం అలవాటే. ‘పిల్లల బాధ నీకెందుకు? అది చూసుకుంటుంది కదా’ అని అంటుంటాడు. ఈ ‘అది’ ఆ ఇంట్లో ఏనాడూ కూచోవడానికి వీల్లేదు. నిలబడి చేస్తూ ఉండాల్సిందే. భర్త రిటైరైనా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు కాబట్టి అతను ఇంట్లో హాయిగా కూచోగలడు. కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తారు. డబ్బు ఉంది. వాళ్లు కూచుంటారు. ఈ ‘అది’కే ఏ సంపాదనా లేదు. ‘నేను తల్లిని కదా’ అనుకుంటుంది. అయితే? ‘నేను అత్తగారిని, నానమ్మని కదా’ అనుకుంటుంది. అయితే? ఇంట్లో ఎవరికీ ఏ విలువా లేదు. ‘అది.. ఇది’ అనడమే. ఒకరోజు ఆమె గేటు దగ్గర నిలబడి ఉంటే ఇద్దరు పనమ్మాయిలు మాట్లాడుకుంటూ వెళుతుంటారు. ఒకమ్మాయి అంటుంటుంది– ‘ఆ ఇంట్లో పని మానేశాను. ఆదివారం కూడా చేయిస్తున్నారు’ అని. విన్న ఆమె దిగ్భ్రమ చెందుతుంది. ఇన్నేళ్లుగా ఇంత చాకిరీ చేస్తున్నా ప్రతిఫలం లేకపోగా చులకనగా చూడటమా? ఉన్నది ఉన్నట్టుగా ఆ పని మనుషుల వెంట నడుస్తుంది. ‘మనలాంటి వాళ్ల కోసం ఒక మేడమ్ మంచి హోమ్ నడుపుతున్నారు. అక్కడ చేర్పిస్తాం. పద’ అని వాళ్లు తీసుకెళ్లి చేర్పిస్తారు. ఆ మేడమ్ ఆమెను పేరు అడుగుతుంది. ఏనాడో మర్చిపోయిన పేరును గుర్తు చేసుకోవడం వల్ల ఆ తల్లి కొత్త అస్తిత్వం, ఆత్మగౌరవం పొందుతుంది. కె.రామలక్ష్మి రాసిన ‘అదెక్కడ’ కథ ఇది. ఇలా ఇంట్లో అమ్మను చూసుకుంటున్నవారు ఉంటే ఈ కథ చెప్పే నీతి ఏమిటో గ్రహించాలి. ఒక ఇంట్లో ఒక తల్లి మరణిస్తుంది. దుప్పటి తీసి చూసిన భర్త అదిరిపోతాడు. ఎందుకంటే ఆమె శరీరం మొత్తం సుద్దముక్కలా తెల్లగా అయిపోయి ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది? ఇదేం వింత జబ్బు? ఆ కాలనీలో ఉన్న ఒక చురుకైన అమ్మాయి ఆ తల్లి ఒంటి నుంచి చిన్న ముక్క తీసి ల్యాబ్‌కు పరిగెత్తి పరీక్ష చేయిస్తే ఆ ముక్క ‘ఆస్ప్రిన్’ టాబ్లెట్ అని తేలుతుంది. అంటే ఆమె శరీరం మొత్తం మందు బిళ్లలతో నిండిపోయిందా? అందుకే సుద్దముక్కలా మారిందా? నిజానికి ఆ చనిపోయినామెకు ‘సూపర్ మామ్’ అని పేరు. పిల్లల్ని బాగా పెంచేది. భర్తను బాగా చూసుకునేది. ఇల్లు బాగా పెట్టుకునేది. పైగా ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేసేది. పిల్లల్ని చదివించి, ప్రయోజకుల్ని చేసి, అమెరికా సంబంధాలు చూసి సెటిల్ చేసి... ఇన్ని చేసి అందరి ప్రశంసలు పొందిన ఆమె కొన్ని విషయాలు దాచింది. ఏమిటవి? ఆఫీసు పని వొత్తిడితో రోజూ ఒక తలనొప్పి మాత్ర వేసుకునేది. ఇంటి పనులకు ఆటంకం రాకుండా ఒళ్లు ఏమాత్రం వెచ్చబడినా ఒక మాత్ర వేసుకునేది. శుభకార్యాలకు అడ్డు రాకుండా నెలసరిని వెనక్కు నెట్టడానికి మాత్రలు వేసుకునేది. గర్భసంచి తీయించేస్తే సప్లిమెంట్లు తెగ మింగింది. హార్మోనల్ ఇంబేలెన్స్ అంటే అందుకు మళ్లీ మందులు. అనారోగ్యం గురించి చెప్పి భర్తను, పిల్లల్ని డిస్ట్రబ్ చేయకుండా ఏ ఇబ్బంది వచ్చినా మాత్రలే మాత్రలు. అందుకే మరణించగానే ఒళ్లు అలా తెల్లబడింది. తేలిపోయింది. ఇది అర్థమయ్యాక, ఆమె సూపర్‌మామ్ సిండ్రోమ్‌తో మరణించిందని అర్థమయ్యాక ఆ కాలనీ అమ్మాయి తన తల్లి దగ్గరకు పరిగెడుతుంది. ‘అమ్మా... నువ్వు గొప్పల కోసం నిన్ను నువ్వు బలిపెట్టుకోకు. కొద్దిగానే పని చెయ్. విశ్రాంతి తీసుకో. ఆరోగ్యం మెరుగు పర్చుకో’ అని చెప్పడానికి. కె.సత్యవతి రాసిన ‘సూపర్‌మామ్ సిండ్రోమ్’ ఇస్తున్న సందేశం అర్థమైందిగా. ఒక భర్త భార్య మీద కోపం వచ్చిన ప్రతిసారీ ‘పో నా ఇంటి నుంచి’ అంటుంటాడు. అది అతని ఊతపదం. ఏ ఇల్లయినా భర్తదే. భార్యది కాదు. తండ్రిదే. తల్లిది కాదు. అందుకే భర్తలు భార్యల్ని ఇంటి నుంచి గెంటేస్తుంటారు. లేదా గెంటేస్తానని బెదిరిస్తుంటారు. పిల్లల్ని కన్నా, పొదుపు చేసి ఆ డబ్బు భర్త చేతిలో పెట్టినా, ఇల్లు దగ్గరుండి కట్టించినా, అందులో సంసారం చేసినా ఆ ఇల్లు మాత్రం ఆమెది కాదు. అతనిదే. ఒకరోజు ఆమెకు చివుక్కుమంటుంది. ఇంటి నుంచి రెండు మూడు చీరలతో బయటపడి దూరంగా ఒక గది అద్దెకు తీసుకుంటుంది. చిన్న ఉద్యోగం వెతుక్కుంటుంది. స్టవ్వు గివ్వు పెట్టుకుని ఇంకెవరూ తనని బెదిరించ లేని తన ఇంట్లో ఉంటుంది. దాంతో ఆ భర్త తెగ కంగారు పడిపోతాడు. కాలనీ కంగారు పడుతుంది. బంధువులు కంగారు పడతారు. కాని ఆమె మాత్రం ‘అతడికి విడాకులు ఇవ్వను. కావాలంటే నా దగ్గరకు వచ్చి నా ఇంట్లో ఉండమనండి‘ అని వర్తమానం పంపుతుంది. ఏం కథ ఇది. ఏ ఇంట్లో అయినా అమ్మ ఈ మూడ్‌లో ఉందేమో ఎవరు గమనించాలి? ఇది కవన శర్మ ‘ఆమె ఇల్లు’ కథ. పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ కథ ఉంటుంది. అందులో ఒకామె అందరూ జేబు రమణమ్మ అని పిలుస్తూ ఉంటారు. దాని కారణం ఆమె తన బాల్యంలో తల్లి ప్రతి రూపాయి కోసం తండ్రి దగ్గర చేయిజాస్తూ ఉండటమే. అలా తాను ఉండకుండా తన రవికకో, చీర కుచ్చిళ్లకో ఒక జేబు ఉండాలని భావిస్తుందామె. అలా జేబులాంటి గుడ్డ సంచిని దోపుకునే బతుకుతుంది. పసుపు కుంకాలుగా కోడలు తెచ్చిన భూమిని భర్త, కొడుకు అమ్మబోతే వారించి ‘అది కోడలి ఆర్థిక భద్రత కోసం ఉండాలి’ అని గట్టిగా నిలబడుతుంది. అమ్మకు ఉండాల్సిన ఆర్థిక స్వాతంత్య్రం గురించి ఆర్థిక గౌరవం గురించి ఆలోచిస్తున్నామా మనం. ‘మసిగుడ్డ’ లేకుండా వంట చేయడం అసాధ్యం. కాని మసిగుడ్డకు ఏ విలుగా ఉండదు. పిల్లల్ని తల్లి పెంచుతుంది. కాని ప్రోగ్రెస్ కార్డ్ మీద తండ్రి సంతకం చేస్తాడు. పిల్లలకు తల్లి ఒండి పెడుతుంది. కాని పిల్లలు వెచ్చాలకు డబ్బులిచ్చే తండ్రినే గౌరవిస్తారు. బంధువులు శుభలేఖ ఇస్తూ దానిపై అతని పేరే రాస్తారు. ఆస్తిపన్ను, కరెంటు బిల్లు, ఇంటి గడపకు నేమ్‌ప్లేట్ అన్నీ అతనివే. ఆమె మసిగుడ్డ. కాని అది లేకపోతే ఏ పనీ జరగదు. కుప్పిలి పద్మ రాసిన ‘మసిగుడ్డ’ కథ ఇది. కిచెన్‌లోకి నేడు వెళ్లి చూసినా అమ్మ పాత జాకెట్టే మసిగుడ్డగా కనిపిస్తుంది. నాన్న పాత చొక్కా కాదు. అమ్మకు గౌరవం ఇవ్వలేమా? బతికినంత కాలం ఇంటి చాకిరీలో పడి, తెల్లవారుజామునే లేస్తూ, రాత్రి లేటుగా వంట గది సర్దుకుని పడుకుంటూ, చంటి పిల్లల వల్ల, వృద్ధులైన అత్తమామల వల్ల, వేరే సవాలక్ష బాధ్యతల వల్ల కంటి నిండుగా నిద్రపోని ఒక తల్లి తనకు నిద్ర కావాలని, కనీసం ఈ వృద్ధాప్యంలో అయినా హాయిగా నిద్రపోవాలని గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. కంటి నిండా నిద్ర పోయే ‘లగ్జరీ’ ఇవాళ్టికీ అమ్మకు ఉందా? అమ్మ గురించి మదర్స్ డే సందర్భంగా ఆలోచిద్దాం. అమ్మను మొదట మనిషిగా చూస్తే, వ్యక్తిగా చూస్తే, పౌరురాలిగా చూస్తే ఆమె హక్కులు అర్థమవుతాయి. ఆ హక్కులు ఆమెకు మిగల్చడమే అందరి విధి. -
స్వయం సమృద్ధి.. స్వావలంబన
సాక్షి, న్యూఢిల్లీ: స్వయం సమృద్ధి, స్వావలంబన సాధించాలనే పెద్ద పాఠాన్ని కరోనా మహమ్మారి మనకు నేర్పించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం లేదని తెలియజేసిందన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో గ్రామీణ భారతం చూపిన పట్టుదల, తెగువ ప్రశంసనీయమన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల ప్రతినిధులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. అన్ని గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు తమ అవసరాలను తామే సమకూర్చుకునే దిశగా స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ‘రెండు గజాల దూరం’మంత్రం ద్వారా ప్రభుత్వం చెప్పిన భౌతిక దూరం నిబంధనను ప్రచారం చేయడం ముదావహమన్నారు. కరోనా కారణంగా చాలా మార్పులు వచ్చాయని, ఇలాంటి కార్యక్రమాలు గతంలో బహిరంగంగా, వ్యక్తిగతంగా కలుస్తూ జరిగేవని, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని నిర్వహిస్తున్నామని వివరించారు. సర్పంచ్‌లు, గ్రామపంచాయతీ సభ్యులు కరోనాను కట్టడి చేయడంలో తాము చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ‘ప్రజలను అనుమానించడం, గౌరవించడం (సస్పెక్ట్.. రెస్పెక్ట్)’విధానాన్ని అవలంబించాలని ప్రధానికి జమ్మూకశ్మీర్‌కు చెందిన ఒక సర్పంచ్ సూచించారు. కరోనా కట్టడికి ఏ చర్యలు తీసుకున్నారని పుణెకు చెందిన యువ మహిళా సర్పంచ్ ప్రియాంకను ప్రధాని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని, గ్రామంలోనే తయారు చేసిన మాస్క్‌లను ప్రజలకు పంపిణీ చేశామని, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ను అందించామని ఆమె వివరించగా, ప్రధాని ఆమెను ప్రశంసించారు. పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా ఏకీకృత ‘ఈ– గ్రామ స్వరాజ్’ పోర్టల్‌ను, మొబైల్ అప్లికేషన్‌ను, స్వమిత్వ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ– ‘గ్రామ స్వరాజ్’పోర్టల్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి, అమలు చేసేందుకు సహాయపడుతుంది. -
ఆడదానిగా పుట్టినందుకు గర్వపడతా!
ఇంటర్వ్యూ మంచి ఒడ్డూ పొడవూ ఫిట్నెస్తో చెక్కిన శిల్పంలా కనిపించే శిల్పాశెట్టికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఆమె తనువు మాత్రమే అందమైనది కాదు. ఆమె మనసూ అందమే. ఆమె భావాలు ఇంకా అందమైనవి. తనలోని ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం, పట్టుదల చూస్తే... ప్రతి అమ్మాయీ ఇలానే ఉండాలి అన్న అభిప్రాయం కలుగుతుంది. శిల్ప గురించి మరిన్ని తెలుసుకుందామా! * ఏం చేసినా పక్కాగా ప్లాన్ చేసుకుని చేయడం నాకు మొదట్నుంచీ అలవాటు. నటన, మోడలింగ్, పెళ్లి, వ్యాపారం... ఏదీ ఓ ప్రణాళిక లేకుండా చేయలేదు. అదే నన్ను ఈ రోజు సెలెబ్రిటీ స్టేటస్‌లో నిలబెట్టిందని కచ్చితంగా చెప్పగలను. * ఎంత మోడ్రన్ ఉమన్‌ని అయినా దేవుడు, విధి వంటి వాటిని నమ్ముతాను. నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మ అష్టకష్టాలు పడిందట. నాలుగో నెల వచ్చేవరకూ అసలు గర్భం నిలుస్తుందని అనుకోలేదట. ఎనిమిదో నెలలో ఉన్నప్పుడు మెట్ల మీది నుంచి పడిపోయిందట. తను, నేను ఇద్దరం చనిపోతామని అందరూ అనుకున్నారట. అయినా తన ప్రాణాలు నిలిచాయి. నాకూ ఏమీ కాలేదు. అంటే మమ్మల్ని ఏదో శక్తి కాపాడిందనే కదా! మా విధి రాత మరోలా రాసుందనేగా! * నా కొడుకు వివాన్ను తొలిసారి చేతుల్లోకి తీసుకున్న క్షణమే నా జీవితంలో అన్నిటికంటే గొప్ప క్షణం. అమ్మ కావడంలో ఉన్న ఆనందమే వేరు. ఇప్పుడు వాడే నా జీవితం అయిపోయాడు. వాడితో ఉన్నంతసేపూ నాకు సమయమే తెలియడం లేదు. * ఈ మధ్య ఆడపిల్లలు కెరీర్‌ను నిర్మించుకోవడంలో మునిగిపోయి ఆలస్యంగా తల్లులవుతున్నారు. అదంత మంచిది కాదు. నేను 37 యేళ్ల వయసులో తల్లినయ్యాను. అదృష్టంకొద్దీ నేను, నా బిడ్డ బాగున్నాం. కానీ అందరి విషయంలో అలా జరగదు. కాబట్టి రిస్క్ తీసుకోవద్దు. * నన్ను ఎప్పుడూ అందరూ అడిగే ప్రశ్న... ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నారు అని! దానికి కారణం మంచి ఆహారం, తగినంత వ్యాయామం. వాటి విషయంలో నేనస్సలు కాంప్రమైజ్ అవ్వను. * యోగా సాధన చేయడం మొదలు పెట్టాక శారీరకంగాను, మానసికంగాను కూడా నాలో మార్పులు వచ్చాయి. ఫిట్నెస్ పెరిగింది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, ప్రతిదీ పాజిటివ్‌గా ఆలోచించడం లాంటివి అలవడ్డాయి. అయితే అందరూ అనుకున్నట్టు నేను అందాన్ని కాపాడుకోవడానికి యోగా మొదలు పెట్టలేదు. నాకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది. అది నయం కాని ఆరోగ్య సమస్య. యోగా చేస్తే కాస్తయినా ఫలితం ఉంటుందన్నారని మొదలెట్టాను. కానీ దానివల్ల ఉన్న ఇంకెన్ని లాభాలు ఉన్నాయో తెలిశాక ఇక వదిలి పెట్టలేకపోయాను. * ఏ వ్యక్తి అయినా సక్సెస్ అవ్వాలి అంటే కావలసినది నిబద్ధత. సంతోషంగా ఉండాలి అంటే ఉండాల్సింది తృప్తిపడే తత్వం. పనిని మనస్ఫూర్తిగా చేస్తే విజయం వరిస్తుంది. ఉన్నది చాలని లేనిదాని కోసం వెంపర్లాడకుండా ఉంటే మనసు సంతోషంగా ఉంటుంది. ఈ రెండు విషయాలూ తెలుసుకుంటే జీవితం సఫలమవుతుంది. ఇదే నా లైఫ్ ఫిలాసఫీ. * నాకు డెరైక్షన్ చేయాలని ఉంది. కాకపోతే అందుకు నేను సూట్ కానేమోనని నా అనుమానం. ఎందుకంటే నేను చాలా హైపర్‌గా ఉంటాను. చాలా త్వరగా ఎమోషనల్ అయిపోతాను. ఈ లక్షణాలు ఉన్నవాళ్లు ఎదుటివాళ్లను డీల్ చేయలేరు. దర్శకులంటే మిగతా టెక్నీషియన్లను, నటీనటులను అందరినీ మేనేజ్ చేయాలి కదా! అది నేను చేయలేనేమోనని ఓ చిన్న డౌట్! * ఏ స్థాయికి వచ్చినా, ఎంత సాధించినా ఆడది అనగానే ఓ చిన్నచూపు ఇప్పటికీ సమాజంలో ఉందని అనిపిస్తుంది నాకు. అమ్మాయి అనగానే ఏదో లోకువగా చూస్తారు. తను ఎంత సాధించినా తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. బయటకు వచ్చి ఏదైనా చేయాలని తపించే అమ్మాయిల గురించి మరీ త్వరగా కామెంట్ చేసేస్తుంటారు. అసలు అలా ధైర్యంగా అన్నీ సాధించగలుగుతున్నందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. అంతేకానీ ఏదో రకంగా నెగిటివ్ కామెంట్లు చేసి, పిచ్చి రాతలు రాసి వాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదు. అసలు నేను ఆడదానిగా పుట్టినందుకే ఎంతో గర్వపడుతూ ఉంటాను. అందుకే ఎవరైనా మహిళలు గడప దాటి బయటకు వచ్చి ఏదైనా సాధిస్తే వాళ్లమీద నాకు ఎంతో గౌరవం కలుగుతుంది!


