బిహార్ బరిలో కీలక ఘట్టం
రాష్ట్ర రాజకీయాలను నిర్దేశించనున్న 14 కీలక నియోజకవర్గాలు
సోమన్నగారి రాజశేఖర్ రెడ్డి (బిహార్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
పట్నా గద్దె కోసం జరుగుతున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం రసకందాయంలో పడింది. ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని సర్వ శక్తులు ఒడ్డుతుండగా, విపక్షాల ‘మహాగఠ్‌బంధన్’ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ ‘ఉద్యోగాల హామీ’తో దూసుకెళ్తున్నారు. ఈ మహా సంగ్రామంలో కీలక నియోజకవర్గాలు రాష్ట్ర భవిష్యత్తును శాసించనున్నాయి.
ఇవి కేవలం అభ్యర్థుల గెలు పోటములను మాత్రమే కాదు తేజస్వీ ప్రతిష్టకు, నితీశ్ కుమార్ ఆత్మగౌరవానికి అసలైన అగ్ని పరీక్షగా నిలుస్తున్నాయి. ఈ 14 కీలక స్థానాల ను ఓసారి పరిశీలిద్దాం. ఈ ఎన్నికల్లో కొందరు అగ్రనే తల భవితవ్యం కొన్ని ప్రత్యేక నియో జకవర్గాలతో ముడిపడి ఉంది. వారి గెలుపు కంటే, వారి ప్రభావం ఎంతమేరకు ఉందనేది ఇక్కడ కీలకం.
1.రాఘోపూర్: ఈ నియోజకవర్గం తేజస్వీ యాదవ్‌కు కంచుకోట. గత పదేళ్లుగా ఈయన ఇక్కడి నుంచే భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. దీంతో ఈసారి మెజారిటీ ఎంత? అనే చర్చ సైతం ఇప్పటికే మొదలైంది. ఇక్కడ యాదవ–ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకే. అయితే ఈసారి మెజారిటీ తగ్గొచ్చనే ప్రచారం మొదలైంది. 2020 ఎన్నికల్లో తేజస్వీతో తలపడిన బీజేపీ కీలకనేత సతీష్ కుమార్ యాదవ్ ఈసారి సైతం బరిలో దిగి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈసారి ముచ్చటగా మూడోసారి తేజస్వీ గెలిచినా మెజారిటీ తగ్గితే అది తేజíస్వీకి ఇబ్బందే. 
2. నలంద: ఇది ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సొంత జిల్లా. నలంద ఆయన రాజకీయాలకు కేంద్ర స్థానం కూడా. ఇది ఆయన సామాజిక వర్గమైన కుర్మీ జనాభా అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ జేడీయూ అభ్యర్థి, మంత్రి శ్రవణ్ కుమార్ హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. ఆయనను మహాగఠ్‌బంధన్ అభ్యర్థి, కాంగ్రెస్ నాయకుడు కౌశలేంద్ర కుమార్ ఢీకొంటున్నారు. నితీశ్ నేరుగా పోటీ చేయకపోయినా, ఇక్కడ జేడీయూ గెలుపు అనేది సీఎం నితీశ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. 
3. జముయ్: లోక్‌జనశక్తి( ఎల్‌జేపీ– రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ప్రాథినిధ్యంవహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో ఈ జముయ్ శాసనసభ నియోజకవర్గం ఉంది. ఇక్కడ పాశ్వాన్(దళిత) వర్గం ఓట్లు కీలకం. అధికార ఎన్‌డీఏ కూటమిలో సీఎం నితీశ్ కుమార్‌తో విభేదాల తర్వాత కూటమిలో చిరాగ్‌కు ఏ స్థాయిలో పరపతి ఉందనేది ఈ స్థానంలో గెలుపుతో తేలిపోనుంది. ఎన్‌డీఏ తరపున అంతర్జాతీయ షూటర్, బీజేపీ నేత శ్రేయసి సింగ్ మరోసారి పోటీలో నిలబడ్డారు. ఆర్జేడీ నుంచి షంషాద్ ఆలం బరిలో ఉన్నారు. నితీశ్‌పై కోపంతో చిరాగ్ సొంత కూటమి అభ్యర్థిని ఓడిస్తారా? లేదంటే మిత్రధర్మం పాటించి తమ ఓట్లు కూడా బీజేపీకి 
పడేలా చేస్తారా? చూడాలి!
4. హసన్‌పూర్: లాలూ కుటుంబం లేకుండా.. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ 2020లో ఈస్థానం నుంచి గెలిచారు. అయితే ఈసారి హసన్‌పూర్‌లో సమీకరణాలు పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తేజ్‌ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరించడం, ఆర్జేడీ కొత్తగా మాలా పుష్పంను బరిలోకి దించడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడ తేజ్ ప్రతాప్‌తో సంబంధంలేకుండా ఆర్జేడీ ఏ మేరకు విజయతీరాలను చేరుకుంటుందనేది ఆసక్తికరం. 
5. కిషన్‌గంజ్: రాష్ట్రంలోనే అత్యంత ఆసక్తికరమైన పోరు కిషన్‌గంజ్‌లో జరుగుతోంది. ఇక్కడ జనాభాలో దాదాపు 70 శాతం మంది ముస్లింలే. ‘లౌకిక’ ఓటు అనేది ఇక్కడ ప్రధానం. ఇక్కడ పోరు ఎన్డీఏ–మహాగఠ్‌బంధన్ మధ్య కాదు. మహాగఠ్‌బంధన్–ఎంఐఎం మధ్యే పోరులా ఉంది. 2020లో కాంగ్రెస్ అభ్యర్థి ఇజాహరుల్ హుస్సేన్ స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఈసారి మహాగఠ్‌బంధన్‌కూటమి తరఫున కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ పోటీచేస్తున్నారు. ఎన్‌డీఏ తరఫున బీజేపీ నేత స్వీటీ సింగ్, ఎంఐఎం తరఫున షామ్స్ ఆగాజ్ పోటీ పడుతున్నారు. ముస్లిం ఓట్లను ఎంఐఎం చీల్చితే 2020లో మాదిరిగానే బీజేపీ అనూహ్యంగా లబ్ధి పొందే అవకాశముంది.
6.ఆరా: కుల సమీకరణాల యుద్ధభూమి భోజ్‌పూర్ ప్రాంతంలోని ఆరా నియోజకవర్గంలోనూ కుల రాజకీయాలు చాలా ఎక్కువ. ఇక్కడ చాన్నాళ్లుగా ఎన్‌డీఏ తరఫున రాజ్‌పుత్‌లు, ఆర్జేడీ తరఫున యాదవ్‌లు పోటీపడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గం(ఈబీసీ) ఓటర్లు ఇక్కడ ‘కింగ్‌మేకర్’గా మారనున్నారు.
7.అగియావ్ (ఎస్సీ): అగియావ్ (ఎస్సీ) నియోజకవర్గం సీపీఐ–ఎంఎల్(లిబరేషన్) పార్టీకి కంచుకోట. 2020లో ఇక్కడ మనోజ్ మంజిల్ గెలిచారు. దళిత, పేద, భూమిలేని కార్మికులే ఇక్కడి అభ్యర్థి గెలుపోటములను నిర్ణయిస్తారు. ఈసారి మహాగఠ్‌బంధన్‌కూటమి తరఫున సీపీఎం నేత శివప్రకాశ్ రంజన్ పోటీ చేస్తుండగా ఎన్‌డీఏ తరఫున బీజేపీ నాయకుడు మహేష్ పాశ్వాన్ నిలబడ్డారు. 
8. ముంగేర్:  భూమిహార్ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం ముంగేర్. సాంప్రదాయంగా ఎన్డీఏకు మద్దతిచ్చే ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు తేజస్వీయాదవ్  ‘ఏ టు జెడ్’ నినాదమిచ్చారు. ఇక్కడ ఎన్‌డీఏ తరఫున బీజేపీ నేత కుమార్ ప్రణయ్ బరిలో నిల్చున్నారు. ఆర్జేడీ తరఫున ముఖేష్ యాదవ్ రంగంలోకి దిగారు. ఎంఐఎం అభ్యర్థి హసన్ సైతం ముందడుగు వేయడంతో ఇక్కడ త్రిముఖపోరు అనివార్యమైంది. 
9. పట్నా సాహిబ్: రాజధానిలోని పట్నా సాహిబ్ నియోజకవర్గం బీజేపీకి దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఇక్కడ వైశ్యులుసహా అగ్ర వర్ణాల ఓట్లు అధికం. మోదీ ఛరిష్మా, జాతీయవాదం ఇక్క డ చాలా బలంగా పనిచేస్తాయి. 2020లో బీజేపీ నాయకుడు నంద్ కిషోర్ యాదవ్ ఘన విజయం సాధించారు. అయినాసరే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ను మార్చేసి రత్నేష్ కుష్వాహాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. మహాగఠ్‌బంధన్ కూటమి నుంచి కాంగ్రెస్ నేత శశాంత్ శేఖర్ పోటీ చేస్తున్నారు. 
10. గయా టౌన్: మగధ్ రాజధాని గయా టౌన్ కూడా బీజేపీకి మరో బలమైన కేంద్రం. ఇక్కడ వైశ్య, అగ్రవర్ణాల ఓట్లు కీలకం. బీజేపీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ఇక్కడ మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ తరపున మోహన్ శ్రీవాస్తవ బరిలో ఉన్నారు.
11. ఝంఝార్‌పూర్: మిథిలాంచల్‌లోని ఝంఝార్‌పూర్ నితీశ్ కుమార్ అత్యంత వెనుకబడిన తరగతుల ఓటు బ్యాంకుకు అసలైన పరీక్ష. 2020లో ఇక్కడ బీజేపీ గెలిచింది. ఈసారి కూడా ఎన్‌డీఏ తరఫున బీజేపీ నేత, మంత్రి నితీశ్ మిశ్రా బరిలో ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ఓడితే, అది నితీశ్ తన ప్రధాన ఓటు బ్యాంక్‌పై పట్టు కోల్పోతున్నారనడానికి సంకేతం.
12. భాగల్‌పూర్: ‘సిల్క్ సిటీ’ భాగల్‌పూర్‌లో కాంగ్రెస్ ’స్ట్రైక్ రేట్’ పరీక్షకు నిలుస్తోంది. 2020లో మహాగఠ్‌బంధన్ ఓటమికి కాంగ్రెస్ పేలవ ప్రదర్శన ఒక కారణం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అజిత్ శర్మ (కాంగ్రెస్)ను, 2020లో స్వల్ప తేడాతో ఓడిపోయిన బీజేపీ నాయకుడు రోహిత్ పాండే ఢీకొట్టనున్నారు. ఆర్జేడీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ కావడం ఇక్కడ కీలకం.
13. పూర్ణియా: సీమాంచల్ రాజధాని పూర్ణియాలో మిశ్రమ జనాభా ఉంది. ఈ నియోజకవర్గంలో ముస్లిం–యాదవ్ సమీకరణాలు పనిచేస్తాయి. వీరితోపాటు ఈబీసీ ఓటర్ల మద్దతు కూడగడితేనే అభ్యర్థి గెలుపు సాధ్యం. 
14. బెట్టియా: పశ్చిమ చంపారన్‌లో ‘చెరకు బెల్ట్’గా పేరొందిన బెట్టియా నియోజకవర్గంలో రైతుల తీర్పు కీలకం కానుంది. చెరకు చెల్లింపుల్లో జాప్యం వంటి సమస్యలు ఇక్కడ ప్రధాన ప్రచారాస్త్రాలు. ఇక్కడ బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవితో కాంగ్రెస్ అభ్యర్థి వాసి అహ్మద్ పోటీ పడుతున్నారు.  

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
