సీరియల్ కిల్లర్ ఇందుశేఖర్
అత్తింటి ఆస్తి కోసం ఏడు హత్యలు
భార్యతో సహా.. అత్తింటివారిని హతమార్చిన సీరియల్ కిల్లర్
ఇంటికి పిలిచి రుబ్బురాయితో మోది ఘాతుకాలు
కొండ ప్రాంతాల్లో మృతదేహాలు పడేసి కిరాతకం
కర్ణాటకలో వెలుగు చూసిన మారణకాండ
బనశంకరి (కర్ణాటక): ఇంటి అల్లుడే నరరూప రాక్షసుడిలా మారాడు. ఆస్తికోసం 20 రోజుల వ్యవధిలో భార్యతో సహా అత్తింటివారు ఏడుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మృతదేహాలను కొండప్రాంతాల్లో పడేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ మారణకాండ కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. రాజాజీనగర పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..రాజాజీనగర భాష్యం స్కూల్ సమీపంలోని 59వ క్రాస్‌లో నివాసం ఉంటున్న క్యాబ్‌డ్రైవర్ ఇందుశేఖర్ 20 ఏళ్ల క్రితం శ్రీరామపురకు చెందిన సునీతను పెళ్లి చేసుకున్నాడు.
సునీత(40) తల్లి రూపవతి(65) కుటుంబానికి శ్రీరామపురలో రూ.2.5 కోట్ల విలువ చేసే ఆస్తి ఉంది. ఆ ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతోపాటు భార్య కుటుంబీకులు తన ఇంటికి రావడం ఇష్టం లేని ఇందుశేఖర్ వారిపై ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా వారిని అంతమొందించాలని పన్నాగం పన్నాడు. తొలుత భార్య సునీతను రుబ్బురాయితో మోది హతమార్చిన ఇందుశేఖర్ ఆమె మృతదేహాన్ని మాయం చేశాడు. ఆమె స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిందని అందరినీ నమ్మించాడు. ఆ తర్వాత బావమరుదులు శివకుమార్ (30), మరో బావమరిది శంకర్(44)లను మందు పార్టీ పేరుతో ఇంటికి పిలిచి వారు మత్తులో ఉండగా రుబ్బురాయితో మోది హత్య చేశాడు.
ఆ తర్వాత బావమరుదుల భార్యలు దివ్య(30), నళిని(29)లను భోజనం పేరుతో పిలిచి వారినీ రుబ్బురాయితో కొట్టి హతమార్చాడు. అత్త రూపవతి, బావమరిది శివకుమార్ కొడుకు పునీత్(7)నూ ఇంటికి పిలిచి కిరాతకంగా హత్యచేశాడు. ఒక్కో హత్య అనంతరం మృతదేహాలను కారులో తీసుకెళ్లి నగర శివారులోని నందిబెట్ట, చార్మాడీఘాట్, తమిళనాడులోని సేలం వద్ద యార్కాడ్‌ఘాట్, చాముండిబెట్ట, శిరాడీఘాట్ తదితర కొండ ప్రదేశాల్లో తరలించి పడేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
నళిని తల్లి ఫిర్యాదుతో వెలుగులోకి..
నళిని కనబడకపోవడంతో ఆమె తల్లి తుంగమ్మ ఈనెల 3న శ్రీరామపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజాజీనగర పోలీస్‌స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. రాజాజీనగర పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టగా భాష్యం సర్కిల్ సమీపంలోని ఇంట్లో నళిని హత్యకు గురైనట్లు గుర్తించారు. దీంతో క్యాబ్‌డ్రైవరు ఇందుశేఖర్ హత్యాకాండ వెలుగులోకి వచ్చింది. నిందితుడిని రాజాజీనగర పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నళిని అదృశ్యం గురించి విచారించగా పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఇందుశేఖర్ నోరువిప్పాడు. అందరినీ చంపేసినట్టు అంగీకరించాడు. అక్టోబరు 16 నుంచి 31 వరకు ఈ హత్యలు చేసినట్టు వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుశేఖర్‌ను తీసుకుని వెళ్లి మృతదేహాలు పడేసిన స్థలాల్లో గాలింపు చేపడుతున్నారు.
మొబైల్ లొకేషన్‌తో పట్టుబడిన హంతకుడు
హత్యల అనంతరం భార్యతోపాటు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్లను తన వద్ద పెట్టుకోవడంతో ఇందుశేఖర్ పట్టుబడ్డాడని పోలీసులు చెబుతున్నారు. నళిని అదృశ్యంపై ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన రాజాజీనగర పోలీసులు ముందుగా నళిని వినియోగిస్తున్న మొబైల్‌ను ట్రేస్ చేశారు. లొకేషన్ ఇందుశేఖర్ ఇంటి అడ్రస్ చూపడంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి ఇంట్లో కూర్చుని ఉన్న ఇందుశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నందిబెట్టపొదల్లో బాలుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో లభించింది. మిగిలిన ఆరు మృతదేహాల కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను పోలీసులు నియమించారు.
తండ్రికి కూతురు మద్దతు?
హంతకుడు ఇందుశేఖర్‌కు అతడి మైనర్ కుమార్తె సాయం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగానూ దర్యాప్తు చేస్తున్నారు. ఇందుశేఖర్‌కు పీయూసీ చదువుతున్న 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఏడుగురి హత్యలు ఇంట్లోనే కావడంతో ఆమెకు విషయం తెలిసి ఉండవచ్చని భావిస్తున్నారు.
పక్కాప్లాన్‌తోనే హత్యాకాండ
బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి హత్య కేసు ఆకస్మికంగా జరిగిన ఘటన కాదని, పక్కా ప్లాన్‌తోనే చేసిన హత్యాకాండ అని హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. శుక్రవారం కేసు గురించి ఆయన మాట్లాడారు.
గతంలోనూ ఇంటి ఓనర్‌ను బెదిరించి..
రాజాజీనగరలోని భాష్యం సర్కిల్ వద్ద అద్దె ఇంట్లో ఇందుశేఖర్ నివాసం ఉండేవాడు. ఆ సమయంలో అతను నివాసం ఉండే ఇంటిపై కేసు వేశాడు. నకిలీ సంతకం పెట్టి ఆ భవనం తనకు చెందుతుందని ఇంటి యజమానిని బెదిరించాడని సమాచారం.
విహారయాత్ర పేరుతో నమ్మించేవాడు
ఇంట్లో ప్రతి ఒక్కరిని హత్య చేసిన తర్వాత వారి మొబైల్స్ తన వద్ద పెట్టుకుని ఎవరైనా ఫోన్ చేస్తే లేమని విహారయాత్రల్లో ఉన్నామని మెసేజ్ చేసేవాడు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన అల్లుడు, కూతురు, మనవడు వెనక్కి రాకపోవడంతో వారి మొబైల్స్‌కు అత్త ఫోన్ చేస్తే కేవలం మెసేజ్ మాత్రమే వచ్చేది. మెసేజ్‌లో మేమంతా విహారయాత్రలో ఉన్నామని, ఇక్కడ లొకేషన్ లభించదని మెసేజ్ వచ్చేది. దీంతో కుటుంబ సభ్యులెవరికీ అనుమానం రాలేదు. చివరికి అత్తను కూడా ఇందుశేఖర్ హత్య చేశాడు.
8వ హత్యకు కుట్ర..
ఇందుశేఖర్ అత్త కుటుంబంలో 8వ హత్యకూ కుట్రపన్నినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు ఇందుశేఖర్‌ను అరెస్ట్‌చేయడానికి వెళ్లిన సమయంలో కారులో అత్తింటికి చెందిన ఐదేళ్ల బాలుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలుడిని కారులో తీసుకెళ్లి చంపాలని ఇందుశేఖర్ ప్రణాళిక రచించాడని పోలీసులు గుర్తించి చాకచక్యంగా అతడిని కాపాడారు.


