● రూ.2 కోట్ల ఆభరణాలు మాయం
దొడ్డబళ్లాపురం: బాగలకోటె నవనగర్‌లో ఉన్న జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ జరిగింది. నవనగర్ సెక్టార్ 31లో ఉన్న ఓం జ్యువెలర్స్ షాప్‌లో శుక్రవారం తెల్లవారు జామున చోరీ జరిగింది. దిగంబర్ కురడేకర్ అనే వ్యాపారికి చెందిన ఈ జ్యువెలరీ షాప్‌కు కారులో వచ్చిన ఇద్దరు దుండగులు గ్యాస్ కట్టర్‌తో షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు, వెండి నగలు దోచుకుని పరారయ్యారు. చోరీ దృశ్యాలు షాప్‌లోని సీసీ టీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. 200 కేజీల వెండి నగలు, బంగారు ఆభరణాలను గోనెసంచిలో నింపుకుని వెళ్లారు. ఘటనపై నవనగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సౌజన్య కేసులో ఇద్దరిపై సిట్‌కు ఫిర్యాదు
దొడ్డబళ్లాపురం: సౌజన్య అనే యువతిపై అత్యాచారం, హత్య కేసులో మహేశ్ శెట్టి తిమరోడి, విఠల్ గౌడలపై హైకోర్టు లాయర్ అమృతేశ్ సిట్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సంతోష్‌రావ్ విడుదలకు సహకరించినందుకు న్యాయమూర్తులకు, పీపీకి, కొందరు లాయర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు అందాయని వీరిద్దరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో లాయర్ అమృతేశ్ ఈమేరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు.
కొడుకు మరణ వేదనతో తండ్రి కన్నుమూత
దొడ్డబళ్లాపురం: ఇటీవల ఉత్తరాఖండ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో హాసన్‌కు చెందిన ప్రతాప్‌గౌడ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కుమారుడి మృతిని తట్టుకోలేక ప్రతాప్‌గౌడ తండ్రి నింగరాజు(84) మానసిక వేదనతో అనారోగ్యం పాలై మరణించారు. హాసన్ తాలూకా కృష్ణాపురకు చెందిన నింగరాజు టైలర్‌గా సకలేశపుర తాలూకా బాజిహళ్లిలో సెటిలయ్యారు. ఈయన కుమారుడు ప్రతాప్‌గౌడ బెంగళూరుకు వచ్చి కాంట్రాక్టర్‌గా, వ్యాపారవేత్తగా ఎదిగాడు. కొడుకు ఎదుగుదల చూసి తండ్రి మురిసిపోతుండగా హెలికాప్టర్ ప్రమాదంలో కుమారుడు దుర్మరణం పాలయ్యాడు. అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యానికి గురైన నింగరాజు గురువారం కన్నుమూశారు.
అధిక లాభాల ఆశతో రూ.14.11 లక్షలు ఫట్
మైసూరు: ఆన్‌లైన్ కేటుగాళ్ల వలలో పడి లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మైసూరులోని గౌరీశంకర్ నగర్‌కు చెందిన వ్యక్తి కేటుగాళ్ల వలకు చిక్కి రూ.14.11 లక్షలు పోగొట్టుకున్నారు. సజన్ అనే వ్యక్తికి ఆన్‌లైన్ వ్యాపారం గురించి టెలిగ్రామ్‌లో సమాచారం అందింది. అప్పుడు కేటుగాడు అతడిని సంప్రదించాడు. ఆ సమయంలో కేటుగాడు ఆ వ్యక్తికి పెట్టుబడి గురించి చెప్పి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చాడు. ఆ తర్వాత ఎక్కువ డబ్బు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు సంపాదించవచ్చని నమ్మించాడు. కేటుగాడి మాటలు నమ్మిన ఆ వ్యక్తి క్రమంగా అతని ఖాతాకు రూ.14,11,920 బదిలీ చేసి చివరకు మోసపోయారు. ఈ విషయంపై సేన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
మట్టిపెళ్లలు విరిగిపడి
రైల్వే ఉద్యోగి మృతి
దొడ్డబళ్లాపురం: రైల్వే అండర్ బ్రిడ్జి పనుల్లో అపశ్రుతి చోటు చేసుఉంది. మట్టిపెళ్లలు విరిగిపడి రైల్వే ఉద్యోగి మృతిచెందగా మరో ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డ సంఘటన ఉత్తరకన్నడ జిల్లా దాండేలి వద్ద చోటుచేసుకుంది. అళ్నావర–అంబేవాడి సెక్షన్ ఎల్‌సీ నం.11లో దాండేలి తాలూకా కర్కా–బర్జి రైల్వే మార్గంలో అండర్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో భారీ మట్టి పెళ్లలు విరిగి మీద పడడంతో రైల్వే ఉద్యోగి మహేశ్ శేఖప్ప తళవార(33)మృతిచెందాడు. మృతుడు గదగ్ జిల్లా ముండరగి తాలూకా జాలవాడగి గ్రామ నివాసి. మరో ఉద్యోగి మక్తుం హుసేన్ మహ్మద్ హుసేణ్ ముల్లా(57) తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు.అంబిగేర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


