● సీఎం డీకే శివకుమార్
దొడ్డబళ్లాపురం: ప్రభుత్వ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 13న మెట్రో ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారని, అయితే బీజేపీ వారు మాత్రం తామే ప్రధానిని రప్పిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారని, అసలు బీజేపీకి, మెట్రో ప్రారంభానికి సంబంధం ఏంటో తనకు అర్థం కావడం లేదని సీఎం డీకే శివకుమార్ ప్రశ్నించారు. శుక్రవారం కనకపురలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇది ప్రజల డబ్బు, అప్పులు చేసి తాము మెట్రోను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొన్ని విషయాలను ప్రధాని ముందు వెల్లడిస్తామని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ, పార్టీ పెద్దలతో సమావేశం ఉన్నందున ఢిల్లీ వెళ్తున్నానన్నారు. చక్కెర ధరపై ప్రధానికి లేఖ రాశామన్నారు.
హాస్టల్‌పై నుంచి పడి
విద్యార్థి మృతి
దొడ్డబళ్లాపురం: హాస్టల్ భవనం పైనుంచి కిందపడి విద్యార్థి మృతి చెందిన ఘటన కలబుర్గి నగరంలోని రాజాపుర కాలనీలోని అంబేడ్కర్ ప్రభుత్వ హాస్టల్‌లో జరిగింది. ముజాహిద్ పటేల్(25) మృతి చెందిన విద్యార్థి. మృతుడు కలబుర్గి పట్టణంలోని కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. గురువారం రాత్రి హాస్టల్ నాలుగో అంతస్తుపై నుంచి కిందపడి మృతి చెందాడు. గత వారం ఇదే హాస్టల్‌లో ఒక విద్యార్థిని నగ్నంగా చేసి దాడి చేశారు. ముజాహిద్‌ది ఆత్మహత్యా లేక హత్యా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. బ్రహ్మపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడుకు మళ్లీ
3 వేల క్యూసెక్కులు
● కావేరి నీరు వదలాలని
సీడబ్ల్యూఆర్‌సీ సూచన
బనశంకరి: కావేరినది నీటిని తమిళనాడుకు రానున్న 15 రోజుల పాటు ప్రతిరోజు 3 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని కావేరి నీటి నియంత్రణ సమితి(సీడబ్ల్యూఆర్‌సీ) కర్ణాటక ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన సీడబ్ల్యూఆర్‌సీ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే తాగునీటి కొరత ఎదురుకానున్న సమయంలో సీడబ్ల్యూఆర్‌సీ ఈ నిర్ణయం తీసుకోవడం కర్ణాటకకు తీవ్ర భంగపాటు ఎదురైంది. గతనెల 23 నుంచి కర్ణాటక కావేరి నది ద్వారా నీటిని విడుదల చేయలేదని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రతిరోజు 3 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని సీడబ్ల్యూఆర్‌సీ సూచించినా కర్ణాటక నీటిని విడుదల చేయలేదని తమిళనాడు ఆరోపించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టుకు అత్యవసర పిటిషన్ సమర్పించింది. దీంతో కావేరి నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సీడబ్ల్యూఆర్‌సీకి సూచించింది.
గృహలక్ష్మి లబ్ధిదారులతో
సీఎం మాటామంతీ
బనశంకరి: గృహలక్ష్మి పథకం నిధులు విడుదల చేయడం ద్వారా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కానుక ఇచ్చింది. ఇలాంటి తరుణంలో సీఎం డీకే.శివకుమార్ శుక్రవారం అధికారిక కార్యాలయం కృష్ణాలో గృహలక్ష్మి లబ్ధిదారులతో సదస్సు నిర్వహించి వారి కష్టసుఖాలను ఆలకించారు. ప్రభుత్వం రెండు రోజుల క్రితం మూడునెలల గృహలక్ష్మి బకాయి నిధులు విడుదల చేయడం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందించింది. ఇక గృహలక్ష్మి పథకం లబ్ధి గురించి సదస్సులో మహిళళలతో సీఎం చర్చించి సమాచారం సేకరించారు. లబ్ధిదారురాలు మాట్లాడుతూ గృహలక్ష్మి డబ్బుతో పిల్లలను చదివిస్తున్నానన్నారు. ద్వితీయ పీయూసీలో తన కుమారుడు 98 శాతం మార్కులు సాధించాడని, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ఆశీర్వదించారు. మరో అర్హురాలు మాట్లాడుతూ గృహలక్ష్మి సొమ్ము మాకు ఆర్ధిక సాయంగా మారిందన్నారు. ఈ డబ్బుతో చిన్నపాటి వ్యాపారం ప్రారంభించానన్నారు. రాష్ట్రంతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నానని తెలపడంతో తనకు కూడా ఇవ్వాలని సీఎం అన్నారు. సీఎం మాట్లాడుతూ మహిళలకు సాయం చేయాలనే గృహలక్ష్మి పథకం అమల్లోకి తెచ్చామని, 36 నెలలు ఇచ్చామని, ఇకపై ఎవరూ ఈ పథకాన్ని ఆపడం సాధ్యం కాదన్నారు. కర్ణాటకను చూసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కూడా పథకం అమలు చేశారన్నారు.
మనవరాలికి బొమ్మలు కొన్న సీఎం
కలబురిగి శివనగరకు చెందిన ఎంఎస్ సువర్ణ గృహలక్ష్మి పథకం సొమ్ముతో తయారు చేసి విక్రయిస్తున్న బొమ్మలు, ఊయలను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ బొమ్మలను కొనుగోలు చేశారు. ఊయల ఊగడానికి చాలా బాగుంది. తన మనవరాలికి ఇస్తాను అని సీఎం తెలిపారు.


