బళ్లారి అర్బన్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 50 శాతం నుంచి 56 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీం కోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని కర్ణాటక దళిత సంఘర్ష సమితి బళ్లారి జిల్లా సంచాలకుడు జి.గోవర్దన్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. రిజర్వేషన్ల పెంపునకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి మోదీని కలవాలని సూచించారు. రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లకు చట్టబద్ధమైన రక్షణ కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాలనలో జస్టిస్ హెచ్.ఎన్. నాగమోహన్ దాస్ కమిషన్ సిఫార్సుల మేరకు ఎస్సీల రిజర్వేషన్లను 15 శాతం నుంచి 17 శాతానికి, ఎస్టీల రిజర్వేషన్లను 3 శాతం నుంచి 7 శాతానికి పెంచారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేయాలని కోరారు.


