మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలపై బీఆర్‌ఎస్ సమీకరణాలు
వరంగల్–ఖమ్మం–నల్లగొండ నుంచి ఏనుగు రాకేశ్ రెడ్డి ఖరారు!
హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ నుంచి బీసీకి చాన్స్
బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ.. ఆశావహుల పేర్లపై చర్చ
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో పట్టభద్రుల కోటాలో ఖాళీ అవుతున్న రెండు స్థానాలకు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ కూడా ‘మండలి గ్రాడ్యుయేట్’ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేస్తోంది.
హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్‌తోపాటు వరంగల్– ఖమ్మం– నల్లగొండ మండలి గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. కాంగ్రెస్, బీజేపీ నుంచి బరిలోకి దిగే వారిని కూడా దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఒక స్థానాన్ని ఓసీ, రెండో సీటును బీసీ సామాజికవర్గానికి కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ఆయా సామాజికవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం అంతర్గతంగా పార్టీ నాయకత్వం అన్వేషిస్తోంది.
ఇప్పటికే రాకేశ్‌రెడ్డికి గ్రీన్ సిగ్నల్
వరంగల్– ఖమ్మం– నల్లగొండ మండలి గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి 2024 మేలో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసిన ఏనుగుల రాకేశ్‌రెడ్డిని మరోమారు బరిలోకి దించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. లక్షకు పైగా పట్టభద్రుల ఓట్లు సాధించి చివరి నిమిషం వరకు గట్టిపోటీ ఇచ్చినందునే రాకేశ్‌రెడ్డికి మరోమారు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఇటీవల ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లా ముఖ్య నేతలతో జరిగిన భేటీలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు రాకేశ్‌రెడ్డి అభ్యర్థిత్వంపై సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది తేలిన తర్వాతే అధికారికంగా ఇద్దరి అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.
ఇదిలా ఉంటే హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్ స్థానం నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన అభ్యర్థిని దించాలని పార్టీ నిర్ణయించింది. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు వీరేశ్, ఉద్యమ సమయం నుంచి పార్టీలో కొనసాగుతున్న నాగేందర్ గౌడ్‌తోపాటు షాద్‌నగర్ మాజీ ఎ మ్మెల్యే కుమారుడు కూడా టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అయితే మహబూబ్‌నగర్ జిల్లాలో బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను బరిలోకి దించితే ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది.
ఓటరు నమోదు కోసం క్షేత్రస్థాయికి..
హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్‌నగర్, వరంగల్– ఖమ్మం– నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలోని మూడింట రెండు వంతు స్థానాల్లో ఎన్నికల సందడి నెలకొంది. 119 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను 78 సెగ్మెంట్ల పరిధిలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్నికలు జరిగే ఆరు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో ఇటీవల కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రతీ వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జీలను నియమించి ఓటరు నమోదుపై దృష్టి సారించాలని ఆదేశించారు. దసరా తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ కూడా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
ఖైరతాబాద్ పరిణామాలపై నజర్
ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను బీఆర్‌ఎస్ నిశితంగా గమనిస్తోంది. న్యాయపరమైన అంశాలు అడ్డుగా ఉన్నందున ఖైరతాబాద్‌కు ఇప్పట్లో ఉప ఎన్నిక నిర్వహించలేమని ఎన్నికల సంఘం చెప్పింది. అయితే, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కు పార్టీ కేడర్‌ను సమన్వయం చేసే బాధ్యతను ప్రస్తుతానికి అప్పగించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడు సాయికిరణ్‌ను ఈ స్థానంలో పోటీ చేయించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.


