రోజంతా టీవీ చూసే మధ్య వయస్కుల్లో జ్ఞాపకశక్తి, ఆలోచనలకు కారణమయ్యే మెదడులోని కొన్ని భాగాల పరిమాణం తక్కువగా ఉంటున్నట్లు అమెరికా పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా సగటున 53 ఏళ్ల వయసున్న 1,712 మందికి చెందిన ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. ఖాళీ సమయాల్లో వారు ఎంత తరచూ టీవీ చూస్తారో, ఉద్యోగ సమయాల్లో ఎంతసేపు కూర్చుంటారో వారిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వారి మెదడులకు మళ్లీ స్కానింగ్ పరీక్షలు చేయగా ఎప్పుడూ టీవీ చూడని లేదా చాలా అరుదుగా చూసే వారితో పోలిస్తే తరచూ టీవీ చూసే వారి మెదడులోని చాలా భాగాల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి.
వారి జ్ఞాపకశక్తి, ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడం, కళ్ల ద్వారా వచ్చే సమాచారాన్ని అర్థం చేసుకోవడం వంటి పనులకు ఉపయోగపడే మెదడులోని కొన్ని భాగాల పరిమాణం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే మెదడులోని వైట్ మ్యాటర్ కొంత దెబ్బతిన్నట్లు తెలిపే సంకేతాలూ ఎక్కువగానే కనిపించాయి. అయితే బద్ధకంగా టీవీ చూస్తూ కూర్చొనేవారితో పోలిస్తే ఉద్యోగాల్లో భాగంగా ఎక్కువసేపు కూర్చొనే వారి మెదడు స్కాన్లలో కొంత మెరుగైన ఫలితాలే కనిపించాయి.
వారి మెదడు పరిమాణం ఎక్కువగా ఉండటంతోపాటు వైట్ మ్యాటర్ దెబ్బతిన్న సూచనలూ తక్కువేగానే ఉన్నాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా వివిధ సమస్యలకు పరిష్కారాల గురించి ఆలోచించడం, ఏకాగ్రతతో పనిచేయడం వంటి మెదడు సంబంధ కారణాల వల్ల ఆ పనులు మెదడుపై టీవీ చూడటం కంటే భిన్నమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. టీవీ చూడటంతో వచ్చే మెదడు మార్పులు పురుషుల్లో మరింత ఎక్కువగా కనిపించినట్లు ఎమ్మారై స్కాన్లలో వెల్లడైంది.


