ఊరు తూగుతోంది! | Alcohol consumption is higher in rural areas compared to urban areas | Sakshi
Sakshi News home page

ఊరు తూగుతోంది!

Oct 4 2026 5:16 AM | Updated on Oct 4 2026 5:16 AM

Alcohol consumption is higher in rural areas compared to urban areas

పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లోనే మద్యం వినియోగం అధికం 

గ్రామీణ పురుషుల్లో 46.6 శాతం,పట్టణ పురుషుల్లో 36.3 శాతం మందికి అలవాటు 

స్త్రీల విషయంలోనూ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ 

గ్రామీణ స్త్రీలలో 8.6 శాతం మందికి అలవాటు...పట్టణ స్త్రీలలో 2.8 శాతానికే పరిమితం 

స్పష్టం చేస్తున్న 2023–24 గణాంకాలు... వెల్లడిస్తున్న ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–6 నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ తెలంగాణ తాగి ఊగుతోంది... దేశంలోని పలు రాష్ట్రాలు, తెలంగాణలోని పట్టణ ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం ఎక్కువగా ఉందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–6 నివేదిక వెల్లడించింది. ఇటీవల విడుదలైన ఈ నివేదిక ప్రకారం 2023–24 సంవత్సరాలకుగాను దేశంలోని ఎంపిక చేసిన రాష్ట్రాల్లో పలు ఆరోగ్య సూచీలు ఎలా ఉన్నాయన్న వివరాలు వెల్లడయ్యాయి. అందులో మద్యం వినియోగానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఉండడం గమనార్హం. ముఖ్యంగా దేశంలోనే సగటున అత్యధికంగా మద్యం సేవిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. అదే పెద్ద రాష్ట్రాల జాబితాలో మనమే ముందుండం విశేషం. 

అరుణాచల్‌ ప్రదేశ్‌లో మద్యం వినియోగం 50 శాతానికి మించగా, ఆ తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా 43.9 శాతం నమోదైంది. అంటే తెలంగాణలోని ప్రతి 100 మందిలో దాదాపు 44 మంది మద్యం వినియోగిస్తున్నారన్న మాట. ఈ గణాంకాలు గత ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–5 సర్వేతో పోల్చినా కొంత మేరకు పెరిగాయి. 2019–21 సంవత్సరాల కాలంలో తెలంగాణలో 43.4శాతం మందికి మద్యం అలవాటు ఉండగా, ఆ తర్వాతి కాలంలో మరో 0.5 శాతానికి పెరిగింది. అదే జాతీయ సగటును పరిశీలిస్తే 2019–21లో 18.7 శాతం మందికి మద్యం అలవాటు ఉండగా, 2023–24 సంవత్సరాల కాలంలో అది కేవలం 0.2 శాతం మాత్రమే పెరిగి 18.9 శాతానికి చేరుకుంది. అంటే గతంతో పోలిస్తే మద్యం వినియోగం పెరగడంలోనూ జాతీయ సగటు కంటే రెట్టింపు కంటే ఎక్కువగా తెలంగాణ రికార్డు సృష్టించడం గమనార్హం.

పట్టణ ప్రాంతాల్లోనే తక్కువ 
పట్టణ ప్రాంతాల్లో కంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం మంది మద్యం సేవిస్తున్నారని ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–6 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లోని 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పురుషుల్లో 36.3 శాతం మందికి ఈ అలవాటు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లోని 46.6 శాతం మంది మద్యం వినియోగిస్తున్నారు. అంటే దాదాపు 10 శాతం కంటే ఎక్కువ మంది గ్రామీణ పురుషులు పట్టణ ప్రాంతాల్లోని పురుషుల కంటే ఎక్కువగా మందు తాగుతున్నారన్నమాట. 

ఇక స్త్రీల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 8.6శాతం మంది మద్యం తీసుకుంటుంటే, పట్టణ ప్రాంతాల్లో కేవలం 2.8 శాతం మంది మహిళలు మాత్రమే మద్యం అలవాటు చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, అనూహ్యంగా తెలంగాణలో హైదరాబాద్‌ దిగువ నుంచి మూడో స్థానంలో నిలిచింది. అంటే హైదరాబాద్‌ కంటే మరో రెండు జిల్లాల్లో మాత్రమే తక్కువగా మద్యం తాగుతున్నారని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. ఆ జాబితాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement