దీపావళి కానుకగా పీఎల్‌ఆర్ బోనస్
రామకృష్ణాపూర్/గోదావరిఖని/రుద్రంపూర్: సింగరేణి కార్మికులకు ఈ ఏడాది దీపావళి కానుకగా రూ.1,10,250 పీఎల్‌ఆర్ బోనస్ అందనుంది. కోల్‌కతాలో శనివారం జరిగిన జేబీసీసీఐ అపెక్స్ జేసీసీ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎల్‌ఆర్ (పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్)పై చర్చించి రూ.1,10,250 చెల్లించేందుకు అంగీకారం కుదిరినట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గతేడాది కోలిండియా, అనుబంధ సంస్థలతోపాటు సింగరేణి కారి్మకులకు రూ.1,03,000 పీఎల్‌ఆర్ అందించారు.
ఈ నేపథ్యంలో ఈసారి కాస్త పెరిగి అంగీకారం కుదరడంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా, కోల్‌కతాలో జరిగిన అపెక్స్ జేసీసీ సమావేశంలో యాజమాన్యం, కార్మిక సంఘాల ప్రతినిధుల మధ్య పీఎల్‌ఆర్ మొత్తంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. వృత్తి, భద్రతా పరమైన, కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. భోజన విరామం అనంతరం పీఎల్‌ఆర్‌పై చర్చలు జరిగాయి. యూనియన్ ప్రతినిధులు రూ.1.20 లక్షల పీఎల్‌ఆర్ డిమాండ్ చేయగా.. యాజమాన్యం ప్రతిపాదనలతో చర్చలు కొనసాగించింది. చివరకు రూ.1,10,250 పీఎల్‌ఆర్‌పై ఏకాభిప్రాయం కుదిరినట్లు కార్మిక సంఘాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా పీఎల్‌ఆర్‌కు సంబంధించి సింగరేణి యాజమాన్యం అధికారిక ఉత్తర్వులు, చెల్లింపు తేదీ ప్రకటించాల్సి ఉంది.


