కారు ఢీకొనడంతో గాల్లో ఎగిరిపడిన యువతి.. విషాదం! | Young Woman Ends Life In Road Incident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొనడంతో గాల్లో ఎగిరిపడిన యువతి.. విషాదం!

Oct 4 2026 7:52 AM | Updated on Oct 4 2026 7:54 AM

Young Woman Ends Life In Road Incident

విహారయాత్రలు తీరని విషాదాన్ని పంచాయి. వరుస సెలవులు రావడంతో స్నేహితులతో కలిసి విహారానికి వెళ్లినవారు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. చెన్నపట్టణ వద్ద ఓ యువతి దుర్మరణం చెందగా, జిగణి వద్ద క్వారీ నీటికుంటలో టెక్కీ గల్లంతయ్యాడు. ఇద్దరూ బెంగళూరువాసులే కావడం గమనార్హం.

బెంగళూరు: స్నేహితులతో కలిసి వీకెండ్‌ ట్రిప్‌కు వెళ్లిన యువతి అనూహ్యంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. చెన్నపట్టణ తాలూకా సంకలగెరె వద్ద బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే పై చోటుచేసుకుంది. బెంగళూరులోని కుంబళగోడు సమీపంలోని రామోహళ్లి   నివాసి భూమిక (22) మృతురాలు. వీకెండ్‌ కావడంతో భూమిక, స్నేహితులు కలిసి కారులో విహారయాత్రకు వెళ్లారు. శుక్రవారం రాత్రి 11:48 గంటల సమయంలో అందరూ కారు దిగారు. భూమిక అవతలకు వెళ్లడానికి రహదారి దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆమెను ఢీకొనింది. ఈ తాకిడికి భూమిక కొంతదూరం గాల్లోకి ఎగిరిపడడంతో తీవ్ర గాయాలై క్షణాల్లో మరణించింది. కళ్లముందు జరిగిన ఘోరంతో స్నేహితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది. చెన్నపట్టణ ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు ఆమెను ఢీకొన్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.  

జాడ లేని టెక్కీ
దొడ్డబళ్లాపురం: బెంగళూరు శివారులోని జిగణి వద్ద ఉన్న యల్లమ్మ దొడ్డయ్య రాతి క్వారీలో నీటికుంటలో ఈతకొట్టడానికి దిగిన యువకుడు నీట మునిగి చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన, బెంగళూరులోని హలసూరులో నివసిస్తున్న టెక్కీ వినయ్‌ (30) మృతుడు. వివరాలు.. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం ఆఫీసుకు సెలవు ఉండడంతో 8 మంది స్నేహితులతో కలిసి విహారానికి వచ్చారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో క్వారీ గుంతలో వాననీరు నిండి ఉండడం చూసి ఈత కొట్టడానికి దిగాడు. అది చాలా లోతుగా ఉండడంతో ఈత కొట్టలేక మునిగిపోయాడు. దీంతో స్నేహితుల సమాచారం మేరకు పోలీసులు, ఫైర్‌ సిబ్బంది చేరుకుని గాలింపు చేపట్టారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు పరుగుపరుగున క్వారీ వద్దకు వచ్చారు. వినయ్‌ ఎక్కడున్నావు.., త్వరగా రా అని రోదించడం అందరినీ కలచివేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement