విమానం రద్దు కావడంతో హోటల్ ముందు ప్రయాణికుల క్యూ.. కానీ ఒక్క ప్రకటనతో పాకిస్తానీలకు షాక్!. ‘ఇండియా, అమెరికా పాస్‌పోర్ట్ ఉన్నవారికే వసతి’ అంటూ ప్రకటన. దీంతో, పాకిస్తాన్ మాజీ స్పీకర్ అసద్ ఖైసర్ సంచలన ఆరోపణలు చేశారు. తాను కూడా ఈ పరిస్థితిని స్వయంగా ఎదుర్కొన్నానని పార్లమెంట్‌లో చెప్పడంతో ఈ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. యూఏఈని ‘సోదర దేశం’గా చెప్పుకునే పాకిస్తాన్‌కు.. అక్కడే ఇలాంటి అనుభవం ఎదురైందంటూ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
వివరాల మేరకు.. విమానం రద్దు కావడంతో తాను సహా పలువురు ప్రయాణికులు హోటల్‌లో ఉండేందుకు ప్రయత్నించారని ఖైసర్ తెలిపారు. అయితే పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ఉన్న ప్రయాణికుల పట్ల హోటల్ సిబ్బంది తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియా, అమెరికా పాస్‌పోర్ట్ ఉన్నవారికి మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటన చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే దౌత్యపరంగా స్పందించాలని ఖైసర్ డిమాండ్ చేశారు. యూఏఈతో పాకిస్తాన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ దేశాన్ని తాము సోదర ఇస్లామిక్ దేశంగా భావిస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలు ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేయకుండా పాక్ విదేశాంగ శాఖ, విదేశాంగ మంత్రి యూఏఈ అధికారులతో ఈ విషయాన్ని లేవనెత్తాలని కోరారు.
అంతేకాదు.. యూఏఈ అభివృద్ధిలో పాకిస్తానీల పాత్ర ఎంతో ఉందని ఖైసర్ గుర్తుచేశారు. యూఏఈలో 15 లక్షలకు పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నామని చెప్పారు. కాగా, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ‘సానుకూల పాత్ర’ పోషించిందని చెప్పుకున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని ఖైసర్ ప్రస్తావించారు. దీంతో అసలు యూఏఈలో ఏం జరిగింది? పాకిస్తాన్ ప్రయాణికులకే ఎందుకు వసతి నిరాకరించారన్న ఆరోపణలు వచ్చాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యూఏఈలో 15 లక్షలకు పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారని తాజా నివేదిక పేర్కొంటోంది. అందువల్ల ఇలాంటి ఆరోపణలు పాకిస్తాన్‌కు రాజకీయంగానే కాకుండా ప్రవాసుల భద్రత, ప్రయాణాల విషయంలోనూ ప్రాధాన్యం కలిగిస్తాయి. అయితే, గతంలో కూడా యూఏఈలో పాకిస్తాన్, భారత్ సహా వివిధ దేశాల ప్రయాణికులు ప్రవేశ నిబంధనల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ సందర్భాల్లో యూఏఈ అధికారులు నిబంధనలు జాతీయత ఆధారంగా కాకుండా, హోటల్ బుకింగ్, రిటర్న్ టికెట్, ఆర్థిక సామర్థ్యం వంటి ప్రవేశ నిబంధనల ఆధారంగా వర్తిస్తాయని స్పష్టం చేశారు.


