రాబిన్‌సన్, టంగ్‌కు ఐదేసి వికెట్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 112/2
లీడ్స్: బ్యాటర్లు విఫలమవడంతో ఇంగ్లండ్ పర్యటనను పాకిస్తాన్ జట్టు పేలవంగా ప్రారంభించింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 48.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ జట్టుకు దూరం కాగా... సల్మాన్ ఆఘా పాకిస్తాన్ టీమ్‌ను నడిపించాడు.
భారీ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో అబ్దుల్లా షఫీఖ్ (104 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... ఇమాముల్ హక్ (42; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 91 పరుగులు జోడించారు. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇంగ్లండ్ బౌలింగ్ ధాటిని ఎదుర్కోవడంలో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా తడబడింది. అజాన్ అవైస్ (0), షాన్ మసూద్ (5), సౌద్ షకీల్ (5), సల్మాన్ ఆఘా (21), మొహమ్మద్ రిజ్వాన్ (12), అలీ ఉస్మాన్ (0) పెవిలియన్‌కు క్యూకట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్‌సన్ 51 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... జోష్ టంగ్ 46 పరుగులు ఇచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన రాబిన్‌సన్ నిప్పులు చెరిగే బంతులతో టాపార్డర్‌ను కకావికలం చేయగా... టంగ్ లోయర్ ఆర్డర్ పని పట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు... బుధవారం ఆట ముగిసే సమయానికి 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్ (15), ఎమిలియో గే (33; 7 ఫోర్లు) అవుట్ కాగా... జోర్డాన్‌కాక్స్ (38 బంతుల్లో 23 బ్యాటింగ్; 4 ఫోర్లు), కెప్టెన్ జో రూట్ (53 బంతుల్లో 37 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. పాకిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్, మొహమ్మద్ అలీ చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న ఇంగ్లండ్... తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 59 పరుగుల దూరంలో ఉంది.


