హ్యాట్రిక్‌తో చెలరేగిన అఫ్రిది | Shaheen Shah Afridi Hat Trick Guides Pakistan Gold To National Champions Cup Title | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌తో చెలరేగిన అఫ్రిది

Aug 19 2026 11:57 AM | Updated on Aug 19 2026 12:19 PM

Shaheen Shah Afridi Hat Trick Guides Pakistan Gold To National Champions Cup Title

source: X

పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. హ్యాట్రిక్ సహా ఏకంగా 7 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ గోల్డ్‌ జట్టుకు National Champions Cup 2026-27 టైటిల్ అందించాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ గోల్డ్.. పాకిస్తాన్ గ్రీన్స్‌పై 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ ఎగరేసుకుపోయింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గోల్డ్ నిర్ణీత 50 ఓవర్లలో 340 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు షమైల్ హుస్సేన్ (111), సాద్ ఖాన్ (112) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ 103 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరుకు పునాది వేశారు. మహ్మద్ అఖ్లాక్ 31 పరుగులు చేయగా, అబ్దుల్ సమద్, ముబాషిర్ ఖాన్ కూడా కీలక పరుగులు జోడించారు.

341 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ గ్రీన్స్‌కు మంచి ఆరంభమే లభించింది. 20.4 ఓవర్లలో 143/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. సాద్ బేగ్ 51 బంతుల్లో 67 పరుగులు చేయగా, ఒమైర్ బిన్ యూసుఫ్ 50 బంతుల్లో 44 పరుగులు చేశాడు. వీరిద్దరూ 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అయితే ఆ తర్వాత షాహీన్ అఫ్రిది మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ గ్రీన్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఫహీమ్ అష్రఫ్.. నసీమ్ షా కలిసి 61 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేసినా షాహీన్ ఆ భాగస్వామ్యాన్ని కూడా విడదీశాడు.

హ్యాట్రిక్‌తో ముగింపు
38వ ఓవర్‌లో షాహీన్ అఫ్రిది హ్యాట్రిక్ నమోదు చేశాడు. మొదటి బంతికి మెహ్రాన్ ముంతాజ్‌ను ఇన్‌స్వింగర్‌తో ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన అతడు.. ఆతర్వాతి బంతికి సల్మాన్ మిర్జాను, మూడో బంతికి మొహమ్మద్ హస్నైన్‌ను క్లీన్‌ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

దీంతో గ్రీన్స్ 37.3 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. అఫ్రిది 8.3 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

ఇది షాహీన్ అఫ్రిది List A క్రికెట్ కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. అంతకుముందు అతని అత్యుత్తమ గణాంకాలు 6/35గా ఉండేవి. 2019లో లార్డ్స్‌లో బంగ్లాదేశ్‌పై ఆ ప్రదర్శన చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement