దోహాలో కలుద్దాం! | 20th Asian Games conclude in Japan with great success | Sakshi
Sakshi News home page

దోహాలో కలుద్దాం!

Oct 5 2026 2:36 AM | Updated on Oct 5 2026 2:36 AM

20th Asian Games conclude in Japan with great success

జపాన్‌లో ఘనంగా ముగిసిన 20వ ఆసియా క్రీడలు

ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా నీరూ ధండా

తదుపరి 2030 ఆసియా క్రీడలకు ఖతర్‌ రాజధాని ఆతిథ్యం  

రెండు వారాలుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. మొత్తం 45 దేశాల అథ్లెట్లు పాల్గొన్న ఈ క్రీడల్లో 50కి పైగా ప్రపంచ రికార్డులు బద్దలు కాగా... 350 పైచిలుకు నయా ఆసియా రికార్డులు నమోదయ్యాయి. ఆరంభ వేడుకల్లో లవ్‌ థీమ్‌తో ఆకట్టుకున్న నిర్వాహకులు... ముగింపు వేడుకల్లో జసాన్‌ సంస్కృతి, సంప్రదాయాలను సంగీత ప్రదర్శనతో ప్రపంచానికి చాటారు. 

గంటన్నరకు పైగా సాగిన వేడుకల్లో అధునాతన సాంకేతికత సాయంతో నిర్వహించిన లేజర్‌ షో ఆహుతులను ఆకట్టుకుంది. ఏషియన్‌ గేమ్స్‌ ప్రారంభానికి ముందు అథ్లెట్ల వసతి ఏర్పాట్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా... క్రీడల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండానే 20వ ఆసియా క్రీడలు ముగిశాయి. ఇక తదుపరి 21వ ఆసియా క్రీడలకు 2030లో ఖతర్‌ రాజధాని దోహా ఆతిథ్యం ఇస్తుంది.  

నగోయా: నాలుగేళ్లకోసారి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల సంబరం ముగిసింది. జపాన్‌ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆదివారం నిర్వహించిన ముగింపు వేడుకలు ప్రతి ఒక్కరినీ కట్టిపడేశాయి. ఏషియన్‌ గేమ్స్‌ ఆరంభానికి ముందు వసతి ఏర్పాట్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా... క్రీడల సమయంలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్న నిర్వాహకులు అదే స్థాయిలో ముగింపు వేడుకలు నిర్వహించారు. 20వ ఆసియా క్రీడల్లో భారత్‌ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 

2023లో హాంగ్జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడలతో పోల్చుకుంటే భారత బృందం మెరుగైన ప్రదర్శన చేయలేకపోయినా... పట్టికలో నాలుగో స్థానాన్ని మాత్రం కాపాడుకుంది. ఇక వరుసగా 12వసారి ఆసియా క్రీడల్లో చైనా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 169 స్వర్ణాలు, 89 రజతాలు, 83 కాంస్యాలతో మొత్తంగా 341 పతకాలు ఖాతాలో వేసుకుంది. విదేశాల్లో జరిగిన ఆసియా క్రీడల్లో చైనాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఆతిథ్య జపాన్‌ 269 పతకాలు (83 స్వర్ణాలు, 95 రజతాలు, 91 కాంస్యాలు), దక్షిణ కొరియా 150 పతకాలు (39 స్వర్ణాలు, 43 రజతాలు, 68 కాంస్యాలు) సాధించి వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి.  

కట్టిపడేసిన లేజర్‌ షో.. 
జపాన్‌ రాజ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ముగింపు వేడుకల్లో ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) అధ్యక్షుడు షేక్‌ జోవాన్‌ బిన్‌ హమద్‌ అల్‌ థానీ క్రీడలు ముగిసినట్లు ప్రకటించారు. సెపె్టంబర్‌ 19న క్రీడల ఆరంభోత్సవంలో... విభిన్న దేశాల క్రీడాకారులకు ప్రాతినిధ్యమిస్తూ ఇంద్రధనస్సు, హృదయాకారాలను పలు పొరలుగా ప్రదర్శించారు. ఇప్పుడు ముగింపు వేడుకలకొచ్చేసరికి ఆ హృదయం మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని భావోద్వేగాలు, ఐక్యత భావంతో అందంగా నింపారు. 

ఆసియా దేశాలన్నీ శాంతి, సౌభ్రాతత్వంతో కలిసి నడుస్తూ ముందుకు సాగాలనే భావనను ఇది ప్రస్ఫుటించింది. ఈ వేడుకల్లో భాగంగా జపాన్‌లో పుట్టి ఆసియా దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ‘బోన్‌–ఒడోరి’ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జపనీయులు బాగా ఇష్టపడే ‘మసుకెన్‌ సాంబా –2’ పాట సందర్భంగా మైదానం హోరెత్తింది. ఇక ముఖ్య అతిథుల రాక అనంతరం నిర్వహించిన లేజర్‌ లైట్‌ షో కట్టిపడేసింది.

నీరూ ముందు నడవగా...
ముగింపు వేడుకల్లో షూటర్‌ నీరూ ధండా భారత బృందానికి పతాకధారిగా వ్యవహరించింది. తాజా ఏషియన్‌ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సహా మూడు పతకాలు సాధించిన నీరూ ధండా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి ముందు 
నడవగా... భారత అథ్లెట్ల బృందం మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంది. ఆరంభ వేడుకల్లో నీలం రంగు ప్రత్యేక దుస్తువుల్లో మెరిసిన భారత అథ్లెట్లు... ముగింపు వేడుకల సందర్భంగా తెలుపు, నీలం వర్ణాల ప్రత్యేక ట్రాక్‌ సూట్‌లు ధరించారు. ఈ పరేడ్‌లో సుమారు 30 మంది భారత అథ్లెట్లు, అధికారులు పాల్గొన్నారు. 

‘వన్‌ ఆసియా’ అనే భావన ప్రస్ఫూటించే విధంగా స్టేడియం మధ్యలో షట్కోణ వేదికను ఏర్పాటు చేసి... లాంతర్లతో దాన్ని అలంకరించారు. ‘ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. కానీ ఈ సందర్భంగా నెలకొల్పిన ప్రమాణాలు అత్యున్నతమైనవి. జ్యోతి ఆరిపోయి ఉండవచ్చు, కానీ అది రగిలించిన ఆశలు మన ఖండమంతటా ప్రకాశవంతంగా వెలుగుతూనే ఉంటాయి. ఎన్నో మరపురాని పోరాటాలకు ఈ క్రీడలు వేదికయ్యాయి.  అద్భుత క్రీడాస్ఫూర్తి, అత్యుత్తమ పోటీతత్వం భవిష్యత్తు తరాలకు ఆదర్శం’ అని ముగింపు వేడుల సందర్భంగా హమద్‌ అల్‌ థానీ అన్నారు.

కుంకుమ్, సుజీత్‌లకు ఐఓఏ అవార్డులు 
ఆసియా క్రీడల్లో భారత ‘ఉత్తమ క్రీడాకారిణి’ అవార్డు కుంకుమ్‌ (ఆర్చరీ)... ‘ఉత్తమ క్రీడాకారుడు’ అవార్డు సుజీత్‌ కల్కాల్‌ (రెజ్లింగ్‌) గెలుచుకున్నారు. ఇటీవల మృతి చెందిన భారత దిగ్గజ షూటర్లు జస్పాల్‌ రాణా, రాజా రణ్‌«దీర్‌ సింగ్‌ స్మారకార్థం భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ) ఈ అవార్డులను నెలకొల్పింది. మహిళల విభాగంలో జస్పాల్‌ రాణా స్మారక పురస్కారం కుంకుమ్‌కు దక్కింది. 

మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల కుంకుమ్‌ మహిళల రికర్వ్‌ వ్యక్తిగత, టీమ్‌ ఈవెంట్‌లలో స్వర్ణ పతకాలు సాధించింది. తద్వారా ఆసియా క్రీడల చరిత్రలో రికర్వ్‌ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ ఆర్చర్‌గా గుర్తింపు పొందింది. రణ్‌ధీర్‌ సింగ్‌ పురస్కారం రెజ్లర్‌ సుజీత్‌ కల్కాల్‌కు దక్కింది. పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన సుజీత్‌ సెమీఫైనల్లో పారిస్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ కియూకా కొటారో (జపాన్‌)పై గెలుపొందాడు.  

దాయాదుల పోరుకే పట్టం
నగోయా: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో భారత్, పాకిస్తాన్‌ టి20 క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను అత్యధిక మంది వీక్షించారని నిర్వాహకులు తెలిపారు. ఇరు దేశాల పురుషుల హాకీ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌కూ రికార్డు స్థాయి వీక్షణలు నమోదయ్యాయి. ఏషియన్‌ గేమ్స్‌ చరిత్రలోనే భారత్, పాకిస్తాన్‌ టి20 ఫైనల్‌ మ్యాచ్‌ను అత్యధిక మంది వీక్షించినట్లు ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) వెల్లడించింది. 

‘ఈసారి ఆసియా క్రీడలకు మునుపెన్నడూ లేనంత అత్యధిక వీక్షణలు లభించాయి. దీనికి ప్రధాన కారణంగా ఆ రెండు పెద్ద మ్యాచ్‌లే. శనివారం భారత్, పాకిస్తాన్‌ మధ్య జరిగిన టి20 ఫైనల్‌ అత్యధిక వీక్షకులను ఆకర్షించగా... అంతకుముందు భారత్, పాకిస్తాన్‌ పురుషుల హాకీ సెమీఫైనల్‌ను కూడా చాలా మంది చూశారు’ అని ఓసీఏ కోఆర్డినేషన్‌ కమిటీ అధ్యక్షుడు తయ్యబ్‌ ఇక్రామ్‌ తెలిపారు.

చివరి స్వర్ణం సౌదీకి
నగోయా: ఆసియా క్రీడల్లో చివరి రోజు ఆఖరి స్వర్ణ పతకం సౌదీ అరేబియా ఖాతాలోకి వెళ్లింది. ఆదివారం ఉదయం ఈక్వె్రస్టియన్‌ (అశ్విక క్రీడలు) ఈవెంట్‌తో మెడల్‌ ఈవెంట్స్‌కు తెరపడింది. జంపింగ్‌లో రెండు వేర్వేరు కేటగిరీల్లో పోటీలు జరిగాయి. ముందుగా జరిగిన జంపింగ్‌ (1.40 నుంచి 1.50 మీటర్లు ఎత్తు) తొలి కేటగిరీలో ఫలే అలాజామి (ఖతర్‌) స్వర్ణం, అబ్దుల్లా అల్‌మెరి (యూఏఈ) రజతం, ఖాలిద్‌ అబ్దుల్‌ రెహమాన్‌ (సౌదీ అరేబియా) కాంస్యం సాధించారు. 

ఆ తర్వాత చివరి ఈవెంట్‌గా జంపింగ్‌ (1.55 మీటర్ల ఎత్తు) రెండో కేటగిరీలో సౌదీ అరేబియాకు చెందిన 54 ఏళ్ల హమాద్‌ రమ్జీ అల్‌దుహామి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. తద్వారా 20వ ఆసియా క్రీడల్లో ఆఖరి స్వర్ణ పతకం సాధించిన ప్లేయర్‌గా హమాద్‌ గుర్తింపు పొందాడు. బదర్‌ అబ్దుల్‌ రెహమాన్‌ అల్‌రాజీ (సౌదీ అరేబియా) రజత పతకం గెల్చుకోగా... బాసెమ్‌ మొహమ్మద్‌ (ఖతర్‌) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement