వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన ఫామ్‌పై విమర్శలు చేస్తున్నవారికి యశస్వి బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఆరంభంలో కివీస్ పేసర్ల నుంచి ఎదురైన సవాళ్లను తట్టుకుని నిలబడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. కేవలం 66 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.
తొలుత రెండు మూడు ఓవర్లు కాస్త ఆచితూచి ఆడిన జైశ్వాల్.. ఆ తర్వాత కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 89 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్, 16 ఫోర్ల సాయంతో 85 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ అద్బుత నాక్‌తో జైశ్వాల్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి (2617 పరుగులు)ని వెనక్కి నెట్టి జైస్వాల్ ఐదో స్థానానికి ఎగబాకాడు. జైస్వాల్ కేవలం 58 డబ్ల్యూటీసీ మ్యాచ్‌లలోనే 2621 పరుగులు సాధించాడు.
డబ్ల్యూటీసీ హిస్టరీలో ఓపెనర్‌గా అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో జాక్ క్రాలీ, దిముత్ కరుణరత్నే సరసన 21 అర్ధశతకాలతో జైస్వాల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ (22) మాత్రమే జైస్వాల్ కంటే ముందున్నాడు.
భారత్ తరఫున డబ్ల్యూటీసీలో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో జైస్వాల్ (21) మూడో స్థానంలో నిలిచాడు. రిషబ్ పంత్ (24), రవీంద్ర జడేజా (23) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
సేనా దేశాల్లో జరిగిన టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన భారత ఓపెనర్ల జాబితాలో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (7)ను వెనక్కి నెట్టి జైస్వాల్ (8) ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. సునీల్ గవాస్కర్ (19) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ తమ తొలిన్నింగ్స్‌లో 368 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. అనంతరం భారత్ కూడా న్యూజిలాండ్‌కు ధీటుగా బదులిస్తోంది. 36 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 141 పరుగులు చేసింది.


