source: X
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో బౌలర్ల హవా కొనసాగింది. బ్యాటర్లు తేలిపోయారు. భారత్ సిరీస్ కైవసం చేసుకున్నప్పటికీ.. విరాట్ కోహ్లి మినహా సిరీస్ మొత్తంలో ఒక్క భారత బ్యాటర్ కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేదు.
కోహ్లి కూడా ఆ హాఫ్ సెంచరీని (51 బంతుల్లోనే 74 పరుగులు) తొలి మ్యాచ్‌లోనే చేశాడు. ఆతర్వాత ఘోరంగా విఫలమయ్యాడు. 2, 4, 5 వన్డేల్లో వరుసగా 7, 0, 5 పరుగులే చేసి నిరాశపరిచాడు.
ఈ సిరీస్‌లో విరాట్ తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించింది ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్. వీరిద్దరు చివరి వన్డేలో తలో 46 పరుగులు చేశారు. ఈ సిరీస్‌లో స్టార్ బ్యాటర్లైన రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కూడా దారుణంగా విఫలమయ్యారు. గిల్‌కు తొలి వన్డేలో చేసిన 37 పరుగులే అత్యధికం కాగా.. శ్రేయస్‌కు రెండో వన్డేలో చేసిన 30 పరుగులే టాప్ స్కోర్.
రోహిత్ విషయానికొస్తే.. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ అందరికంటే దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 30 పరుగులే చేశాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో భారత బ్యాటర్ల ప్రదర్శన చూస్తే, విరాట్ కోహ్లి ఒక్కడే గుడ్డిలో మెల్ల అన్న చందంగా పర్వాలేదనిపించాడు.
బౌలర్లు.. ముఖ్యంగా పేసర్ల పుణ్యమా అని భారత్ న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. తొలి వన్డేలో అన్షుల్ కంబోజ్, రెండో వన్డేలో గుర్నూర్ బ్రార్, ఐదో వన్డేలో అర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లుగా నిలిచారు. సిరీస్ మొత్తంలో నిలకడగా రాణించిన బ్రార్‌కు (9 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇదే తొలిసారి


