పాక్‌ గుండెల్లో గుబులు.. భారత్‌ గెలుపులో మనోడే కీలకం! | india u19 asia cup final telugu cricketer chigurupati venkat | Sakshi
Sakshi News home page

పాక్‌ గుండెల్లో గుబులు.. భారత్‌ గెలుపులో మనోడే కీలకం!

Nov 16 2026 8:04 AM | Updated on Nov 16 2026 8:04 AM

india u19 asia cup final telugu cricketer chigurupati venkat

గుంటూరు: క్రికెట్‌ అండర్‌–19 ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌.. అది కూడా దాయాది పాక్‌తో పోరు.. మొదట బ్యాటింగ్‌ చేసిన ప్రత్యర్థి జట్టు ఏకంగా 338 పరుగులు చేసింది.. ఛేజింగ్‌లో బరిలో దిగిన భారత జట్టు 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.. అయినప్పటికీ విశేషంగా పోరాడిన జట్టు చివరి బంతికి ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది. 

ఈ ఉత్కంఠ పోరులో ఓ తెలుగు కుర్రోడి పేరు మార్మోగింది. అదే చిగురుపాటి వెంకట్‌. తొలుత బౌలింగ్‌లో సత్తా చాటడంతో పాటు చివరి వరకూ క్రీజ్‌లో నిలిచి టీం ఇండియా విజయం సాధించడంలో కీలకభూమిక పోషించిన వెంకట్‌.. దివసీమకు చెందిన నాగాయలంక మాజీ ఉపసర్పంచ్‌ దివంగత తలశిల మోహన్‌కుమార్‌ మనుమడు. ఈ యువ కిశోరం తల్లి తలశిల పార్వతి స్వగ్రామం ఇది. కాగా తండ్రి చిగురుపాటి పూర్ణచంద్రరావుది గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు కావడం విశేషం. 

బౌలింగ్‌లో పదును.. బ్యాటింగ్‌లో మెరుపు.. 
ఒమెన్‌లోని అల్‌ అమెరాత్‌ మైదానంలో శనివారం జరిగిన ఏసీసీ మెన్స్‌ అండర్‌–19 ఆసియా కప్‌ 2026 ఫైనల్‌లో భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఒక వికెట్‌ తేడాతో ఓడించి తొమ్మిదో సారి ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా చివరిలో క్రీజ్‌లోకి వచ్చిన మన తెలుగోడు వెంకట్‌ ఒత్తిడిని తట్టుకుని 11పరుగులతో నాటౌట్‌గా నిలిచి మోహిత్‌లో కలసి జట్టును విజయతీరానికి చేర్చడంలో కీలకంగా వ్యవహరించాడు. అంతకుముందు బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. పాకిస్తాన్‌ చివరి 10ఓవర్‌లలో కేవలం 63పరుగులకే ఆరు వికెట్లు కోల్పోవడంలో తెలుగు తేజం తీసిన మూడు వికెట్లే కీలకం అయ్యాయి.

క్రికెటే ధ్యాసే: వెంకట్‌ తల్లి పార్వతి  
వెంకట్‌ తండ్రి చిగురుపాటి పూర్ణచంద్రరావు ఉద్యోగ రీత్యా తొలుత విజయవాడ, ఆ తర్వాత గోవా వెళ్లారు. వెంకట్‌ తల్లి తలశిల పార్వతి గోవా నుంచి ‘సాక్షి’తో మాట్లాడుతూ వెంకట్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే పిచ్చని చెప్పారు. మొదట్లో తాము వద్దని వారించామని, అయితే వెంకట్‌ నాలుగో తరగతిలో ఉన్నప్పుడు తన భర్త ఉద్యోగ రీత్యా తామంతా మస్కట్‌ వెళ్లిపోయామని, అక్కడ కూడా క్రికెట్‌ అంటే పిచ్చి కొనసాగడంతో తానే ప్రోత్సహించి కోచింగ్‌ ఇప్పించానని చెప్పారు. 

అయితే కోవిడ్‌–19 సమయంలో తాము ఇండియాకి తిరిగి వచ్చామన్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ అదే దృష్టితో నెట్‌ ప్రాక్టీస్‌లో గడిపేవాడని వివరించారు. నాగాయలంకలోని అమ్మమ్మ ఇంటికి వచ్చినా, అటు గుంటూరు జిల్లా వట్టి చెరుకూరులో నాయనమ్మ ఇంటికి వెళ్లినా నిరంతరం క్రికెట్‌ ప్రాక్టీస్‌నే పరమావధిగా భావించే వాడని చెప్పుకొచ్చారు. కోవిడ్‌ తర్వాత మళ్లీ గోవాకు వచ్చేయగా.. గోవా క్రికెట్‌ బోర్డ్‌ శిక్షణలో ఆటలో రాణించడం ఆరంభించాడని పార్వతి వివరించారు. 

తొలుత వరుసగా రెండు పర్యాయాలు అండర్‌–16 క్రికెట్‌కు ఎంపికై రాణించడంతో అండర్‌–19టీమ్‌లోకి ప్రవేశించి రెండేళ్ల రాణించడంతో మూడో ఏడాది గత మే నెలలో ఇండియా జూనియర్‌ టీమ్‌లో అడుగుపెట్టాడని చెప్పారు. శ్రీలంక, ఆస్ట్రేలియా టీమ్‌లతో ఆడి ఇప్పటికే ఫ్రూవ్‌ చేసుకున్నాడని.. నేడు టీమిండియా టీమ్‌తో పాకిస్తాన్‌లో తలపడి జట్టులో కీలక ఆటగాడిగా గుర్తింపు సాధించడం ఆనందాన్నిస్తోందని వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement