నకిలీ వైద్యులకు రక్షణ కవచంగా ఏపీఎంసీ! | APMC as a shield against fake doctors | Sakshi
Sakshi News home page

నకిలీ వైద్యులకు రక్షణ కవచంగా ఏపీఎంసీ!

Nov 16 2026 4:04 AM | Updated on Nov 16 2026 4:04 AM

APMC as a shield against fake doctors

మెడికల్‌ కౌన్సిల్‌ను భ్రష్టు పట్టించిన బాబు సర్కార్‌      

కౌన్సిల్‌లో ఎన్నికైన సభ్యుల గొంతు నొక్కేస్తున్న దుస్థితి 

వైద్యుల సమస్యలపై ప్రశ్నించడానికి వీలులేని వాతావరణం 

ఆరు నెలల్లోనే విసిగిపోయి ఎన్నికైన సభ్యుడి రాజీనామా 

అప్రజాస్వామిక నాయకత్వంలో కొనసాగలేనని తప్పుకున్న డాక్టర్‌ వెంకటరమణ  

సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోతున్నాయి. అర్హులైన వైద్యుల ద్వారా, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షించాల్సిన ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ (ఏపీఎంసీ)ను గాడి తప్పించారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారంతా నకిలీ వైద్యులకు రక్షణ కవచంలా నిలుస్తుండటంతో పాటు, సభ్యులకు కౌన్సిల్‌లో గొంతెత్తే పరిస్థితులు లేకుండా చేశారు. ఇక్కడ నెలకొన్న అప్రజాస్వామిక విధానాలు, నియంతృత్వ విధానాలకు విసిగివేసారి.. కొద్ది నెలల కిందట ఎన్నికైన సభ్యుడు డాక్టర్‌ ఎం.వెంకటరమణ రాజీనామా చేశారు. 

‘వైద్యుల సమస్యలపై కౌన్సిల్‌లో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. అధికారిక వాట్సప్‌ గ్రూప్‌లోనూ ఎన్నికైన సభ్యులు తమ వాణిని వినిపించకుండా గొంతు నొక్కేస్తున్నారు. అడ్మిన్‌లు మాత్రమే ఆ గ్రూప్‌లో పోస్ట్‌లు పెట్టేలా ఆంక్షలు పెట్టారు. వైద్య వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. ఎన్నికైన తమకు ప్రశ్నించే అవకాశం ఇవ్వడం లేదు. ఈ అప్రజాస్వామిక నాయకత్వంలో కౌన్సిల్‌లో కొనసాగలేను’ అని ఆయన తన రాజీనామాలో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ ఏడాది జూన్‌లో కౌన్సిల్‌ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ఆరు నెలలు కూడా తిరగకుండా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికైన సభ్యుడు రాజీనామా చేయడం ప్రస్తుతం వైద్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  

చైర్మన్‌ వర్సెస్‌ ఎన్నికైన సభ్యులు 
ప్రస్తుతం మెడికల్‌ కౌన్సిల్‌లో చైర్మన్‌ వర్సెస్‌ ఎన్నికైన సభ్యులన్నట్టుగా వివాదం నడుస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అనైతిక ప్రాక్టీస్‌ చేస్తున్న నకిలీ వైద్యులపై కౌన్సిల్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై నకిలీ వైద్యుల నిరోధక కమిటీ విచారణ సైతం చేపట్టింది. నివేదికలను సమర్పించగా వాటిపై చైర్మన్‌ చర్యలు తీసుకోకుండా తొక్కి పెడుతున్నారని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో నకిలీ వైద్యుడి చేతిలో నరసమ్మ అనే మహిళ బలైపోవడానికి చైర్మన్‌ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చెబుతున్నారు. 

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ వైద్యులపై ఏపీఎంసీ చట్టం ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకునే పూర్తి అధికారం చైర్మన్‌కు మాత్రమే ఉంది. అయినప్పటికీ ఉద్దేశ పూర్వకంగా ఫిర్యాదులను చైర్మన్‌ బుట్టదాఖలు చేస్తున్నారని ఇటీవల నకిలీ వైద్యుల నిరోధక కమిటీ సభ్యుడే తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు ఇతర రాష్ట్రాల వైద్యులు తమ మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్‌వోసీ లేకుండా, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అవ్వకుండానే మన దగ్గర ప్రాక్టీస్‌ చేసుకోవచ్చని బాబు సర్కార్‌ జీవో 81 ఇచ్చింది. ఈ జీవోను ఎన్నికైన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.   

సర్వసభ్య సమావేశంపెట్టకుండా 
మెడికల్‌ కౌన్సిల్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైనప్పటి నుంచే చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వ పోకడలు కొనసాగిస్తోందని ఆరోపణలున్నాయి. కౌన్సిల్‌లో మొత్తం 25 మంది సభ్యులుండగా, వీరిలో వైద్యులు నేరుగా ఎన్నుకున్న 13 మందిలో 9 మంది హెల్త్‌ కేర్‌ రీఫార్మర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌(హెచ్‌ఆర్‌డీఏ) నుంచి ఉన్నారు. అయితే కార్యవర్గం ఎన్నిక సమయంలోనే అధికార బలాన్ని ప్రయోగించిన ప్రభుత్వం తాము చెప్పిన వారికే ఓటేయాలని హెచ్‌ఆర్‌డీఏ సభ్యులను బెదిరింపులకు గురిచేసింది. వీరికి కమిటీల్లో అవకాశం కల్పించకుండా అన్నీ అస్మదీయులకే కట్టబెట్టింది. 

అప్రజాస్వామిక ఎన్నిక విధానాలపై అప్పట్లోనే హెచ్‌ఆర్‌డీఏ సభ్యులు ఆందోళన తెలిపారు. ప్రభుత్వ సర్వీస్‌లో అవినీతి ఆరోపణల్లో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న డాక్టర్‌ను రిజి్రస్టార్‌గా నియమించిన సమయంలోనే వీరంతా తీవ్రంగా వ్యతిరేకించారు. సదరు డాక్టర్‌కు ప్రభుత్వ పెద్దల అండ ఉండటంతో కౌన్సిల్‌ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా రిజి్రస్టార్‌ నియామకానికి ఎన్నిక పెట్టి నామినేటెడ్‌ బలంతో ఆమోదించారు. ఈ సమావేశం అనంతరం తదుపరి సర్వసభ్య సమావేశం పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు. సమావేశం పెడితే కౌన్సిల్‌లో జరిగే అక్రమాలు వెలుగు చూస్తాయనే భయంతో చైర్మన్‌ ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement