పచ్చమూకల పైశాచికత్వం | Actress Chandini Chowdhury expresses her grief over the natural disaster in Visakhapatnam | Sakshi
Sakshi News home page

పచ్చమూకల పైశాచికత్వం

Nov 16 2026 3:56 AM | Updated on Nov 16 2026 3:56 AM

Actress Chandini Chowdhury expresses her grief over the natural disaster in Visakhapatnam

విశాఖ ప్రకృతి విధ్వంసంపై నటి చాందినీ చౌదరి ఆవేదన 

కొండల తవ్వకాలపై సోషల్‌ మీడియాలో ఆందోళన 

పర్యావరణ పరిరక్షణకు మద్దతుగా నిలిచిన ప్రకృతి ప్రేమికులు 

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుగా ముద్ర వేస్తూ పచ్చపార్టీ ట్రోలింగ్‌ 

తన అభిప్రాయానికి రాజకీయాలను ఆపాదించడంపై నటి ఆవేదన 

ప్రజాస్వామ్యంలో అభిప్రాయం వెల్లడించే స్వేచ్ఛ ఉండాలన్న చాందినీ  

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తప్పా
విశాఖపట్నంలో కొండలను తవ్వేస్తూ, పచ్చదనాన్ని కనుమరుగు చేస్తున్న తీరుపై నటి చాందినీ చౌదరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన చాందినీ చౌదరి.. తన నగరంలో చోటుచేసుకుంటున్న మార్పులపై ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. నగరంలోని పచ్చదనం, సహజసిద్ధమైన కొండలు కనుమరుగవుతుండటం తనను తీవ్రంగా కలచివేస్తోందని పేర్కొంటూ కొండల తవ్వకాలకు సంబంధించిన దృశ్యాన్ని జతచేస్తూ ‘సేవ్‌ వైజాగ్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో ఓ పోస్టు చేశారు. 

దీంతో ఆమెపై రాజకీయ ముద్ర వేస్తూ సోషల్‌ మీడియాలో పచ్చ మూకలు చెలరేగిపోయాయి. ఆమెను వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా అభివర్ణిస్తూ వ్యతిరేక కామెంట్లు, వ్యక్తిగత విమర్శలతో విపరీతంగా ట్రోల్‌ చేశారు.  దీంతో ఆమె మరోసారి సోషల్‌మీడియాలో స్పందించారు.  ప్రజాస్వామ్యంలో  అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని, దానికి రాజకీయ రంగు పులమడం సరికాదని ఓ వీడియో విడుదల చేశారు. తనకు ఎప్పటికీ దేశ ప్రయోజనాలే ప్రాధాన్యమని పేర్కొన్నారు. 

చాందినీకి మద్దతుగా నెటిజన్లు
చాందినీ చౌదరి వ్యాఖ్యలకు సోషల్‌ మీడియాలో పలువురు మద్దతు తెలుపుతున్నారు. విశాఖలో పుట్టి పెరిగిన వ్యక్తిగా సొంత నగరంలోని ప్రకృతి విధ్వంసంపై ఆమె ఆవేదన వ్యక్తం చేయడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పేరుతో పచ్చని కొండలను తవ్వేయడం సమర్థనీయం కాదని అభిప్రాయపడుతున్నారు. ‘పర్యావరణానికి పార్టీలు ఉండవు. ప్రకృతి విధ్వంసం ఏ ప్రభుత్వం హయాంలో జరిగినా ప్రశ్నించాల్సిందే. ఒక సమస్యను లేవనెత్తినందుకు వ్యక్తిని రాజకీయ పార్టీకి అంటగట్టడం ఎందుకు?’ అని కొందరు నిలదీస్తున్నారు. మరికొందరు నెటిజన్లు చాందినీపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తప్పుబడుతున్నా­రు.  ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను, భిన్నాభిప్రాయాలను గౌరవించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అందరి బాధ్యతని పేర్కొంటూ పచ్చమూకల పైశాచికత్వాన్ని ఛీదరించుకుంటున్నారు.  – సాక్షి, అమరావతి

చాందినీ చౌదరి పోస్ట్‌–1
‘నా సొంత ఊరు విశాఖపట్నం పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. పట్టణీకరణ, అభివృద్ధి పేరుతో ఎక్కడ చూసినా కొండలను, పర్వతాలను నిర్దాక్షిణ్యంగా తవ్వేస్తున్నారు.’

చాందినీ చౌదరి పోస్ట్‌–2
‘ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉండాలి. మనకు బాధ కలిగించే విషయం ఏదైనా జరిగినప్పుడు మర్యాదపూర్వకంగా, గౌరవంగా మన ఆలోచనలను, భావోద్వేగాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండాలి. ఒక సాధారణ పౌరురాలిగా అభిప్రాయాన్ని వెల్లడిస్తే దానికి రాజకీయ రంగు పులమడం సరికాదు. గతంలో జరిగినా.. ప్రస్తుతం జరుగుతున్నా.. ఏ విషయంపైనైనా పౌరులుగా స్పందించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఒకరి అభిప్రాయాలను తమకు అనుకూలంగా మార్చుకుని, రాజకీయ అనుబంధాలు అంటగడుతూ విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement