‘ఆంధ్ర’వైభవానికి ‘కూటమి’ గ్రహణం | AU falls in QC Asia university rankings | Sakshi
Sakshi News home page

‘ఆంధ్ర’వైభవానికి ‘కూటమి’ గ్రహణం

Nov 16 2026 4:07 AM | Updated on Nov 16 2026 4:07 AM

AU falls in QC Asia university rankings

రెండేళ్లుగా దిగజారుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రతిష్ట 

అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో వరుస పతనాలు  

క్యూసీ ఏసియా వర్సిటీ ర్యాంకింగ్‌లో 851–900 స్థానాలకు పడిపోయిన ఏయూ 

2023–24లో 501–550 స్థానాల్లో ఉన్న వర్సిటీ రెండేళ్లలో 300 స్థానాల దిగువకి  

వైఎస్సార్‌సీపీ హయాంలో వెలుగొందిన యూనివర్సిటీ  

గీతం ప్రయోజనాల కోసం ఏయూని బలిచేస్తున్నారంటూ ఆరోపణలు 

సాక్షి, విశాఖపట్నం: వందేళ్ల ఘనచరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) నేడు అంతర్జాతీయ వేదికలపై తన పూర్వవైభవాన్ని కోల్పోతోంది. గత ప్రభుత్వ హయాంలో జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో కింగ్‌గా నిలిచిన ఏయూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే క్యూసీ ఆసియా ర్యాంకింగ్స్‌లో 400 బ్యాండ్‌ నుంచి ఏకంగా 900 దిగువకు పడిపోవడం విద్యాసంబంధ వర్గాలను కలవరపెడుతోంది. ఒకవైపు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై పర్యవేక్షణ కొరవడటం, మరోవైపు ప్రైవేట్‌ విద్యాసంస్థలకు అయాచిత లబ్ధి చేకూర్చే విధానాలు అనుసరించడమే ఈ పతనానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

ప్రభుత్వ వైఫల్యానికి ర్యాంకుల పతనమే నిదర్శనం  
ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల ప్రమాణాల­ను కొలిచే క్యూసీ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థానం ఏటికేడాది దిగజారుతోంది. 2022–23లో 401–450 బ్యాండ్‌లో ఉన్న ఏయూ ర్యాంక్‌.. 2024–25లో 601–650కి పడిపోయింది. తాజాగా విడుదలైన 2026–2027 ఎడిషన్లలో ఈ ర్యాంక్‌ మరింత దారుణంగా పడిపోయి 801–850 నుంచి ఏకంగా 851–900 స్థానానికి చేరుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణాసియా ర్యాంకింగ్స్‌ పరంగా చూస్తే.. 2025–26లో 254వ స్థానంలో ఉన్న ఏయూ.. ఏకంగా 16 స్థానాలు దిగువకు పడిపోయి 270కి చేరుకుంది. 

చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిపాలనపై రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయనే విమర్శలున్నాయి. గతంలో ఉన్న పరిపాలన వ్యవస్థలను మార్చడం, కీలక విభాగాల్లో బోధన సిబ్బంది కొరతను భర్తీ చేయకపోవడం, పరిశోధనలకు అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం వంటి కారణాలు ర్యాంకింగ్స్‌ తగ్గడానికి దారితీశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్‌ చేయడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైందనడానికి.. ఈ ర్యాంకుల పతనమే నిదర్శనం.  

‘గీతం’ ప్రయోజనాలకు ఏయూ బలి..  
మంత్రి లోకేశ్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్‌కు చెందిన ప్రైవేట్‌ విద్యాసంస్థ గీతం యూనివర్సిటీకి లబి్ధచేకూర్చేందుకే ప్రభుత్వం ఏయూని బలహీనపరుస్తోందని ఏయూ వర్గాలే ఆరోపిస్తున్నాయి. గతంలో గీతంలో పనిచేసిన వారిని ఏయూలో ఉన్నతస్థానాల్లో నియమించారని, ఫలితంగా ఏయూ మొత్తం భరత్‌ చేతుల్లోకి వెళ్లిపోయిందని పలువురు ఆవేదన చెందుతున్నారు. అందుకే గీతం వర్సిటీ గతేడాది వచ్చిన దక్షిణాసియా ర్యాంకు (254) కంటే ఈసారి 7 స్థానాలు మెరుగు పరచుకుని 247కి చేరుకుంది. 

కానీ.. ఏయూ ర్యాంకు మాత్రం పాతాళానికి పడిపోయింది. శాశ్వత అధ్యాపకుల నియామకాలు జరగకపోవడం వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా రాష్ట్ర విశ్వవిద్యాలయాల ర్యాంకులపై ప్రభావం చూపుతున్నాయని విద్యా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అధ్యాపక పోస్టులను భర్తీచేయాలని, నిధులు కేటాయించి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకురావాలని విద్యార్థి సంఘాల వారు, మేధావులు కోరుతున్నారు.  

అనాలోచిత నిర్ణయాలు  
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏయూ పాలన వ్యవహారాల్లో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు విశ్వవిద్యాలయ ప్రతిష్టను మరింత దెబ్బతీశాయనే విమర్శలున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సుమారు రూ.27 కోట్లతో ఏర్పాటు చేసిన నాస్కామ్‌ స్టార్టప్, ఇంక్యుబేషన్‌ సెంటర్‌ని మూసివేయాలనే నిర్ణయంపై విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 

మరోవైపు క్యాంపస్‌ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. పైకప్పు పెచ్చులూడి పడుతున్నా పట్టించుకోకుండా విద్యార్థుల నుంచి వసూ­లు చేసిన హాస్టల్‌ డెవలప్‌మెంట్‌ నిధులను రోజువారీ వేతనాల చెల్లింపులకు మళ్లించడం వివాదాస్పదమైంది. అంతేగాకుండా క్యాంపస్‌ డిస్పెన్సరీలో కనీస వైద్య సదుపాయాలు, అంబులెన్స్‌ కూడా అందుబాటులో లేక విద్యార్థి మరణించాడు. ఈ సమస్యలపై నిరసన తెలిపిన విద్యార్థి నేతలకు క్రమశిక్షణ నోటీసులు జారీచేయడం వంటి ఏకపక్ష నిర్ణయాలు వర్సిటీలో అశాంతికి కారణమయ్యాయని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.  

వైఎస్సార్‌సీపీ పాలనలో మైలురాళ్లు  
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కీలక మైలురాళ్లను అధిగమించింది. 2022లో క్యూసీ ఆసియా ర్యాంకింగ్స్‌లో 401–450 స్థానంలో నిలవడంతో పాటు, కేంద్ర విద్యాశాఖ ప్రకటించే ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఓవరాల్‌ విభాగంలో 2022లో 71వ ర్యాంకు, 2024లో 41వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటింది. ప్రతిష్టాత్మకమైన న్యాక్‌ నుంచి ఏకంగా 3.74 స్కోరుతో ఏ ప్లస్‌ప్లస్‌ గ్రేడ్‌ సాధించి దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల సరసన నిలిచింది. 

2019–24లో ఏయూలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు పలు సంస్కరణలు అమలు చేశారు. క్యాంపస్‌లో ఆధునిక పరిశోధన కేంద్రాలు, ఇంక్యుబేషన్‌ సెంటర్లతో స్టార్టప్‌లకు పెద్దపీట వేసి విద్యార్థులను ప్రోత్సహించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాయి. ఫలితంగా విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగి అప్పట్లో ఏయూ ప్రకాశించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement