వారి వల్లే గెలిచాం.. చాలా సంతోషంగా ఉంది: శ్రేయస్‌ అయ్యర్‌ | Shreyas Iyer hails bowlers after historic NZ series win | Sakshi
Sakshi News home page

వారి వల్లే గెలిచాం.. చాలా సంతోషంగా ఉంది: శ్రేయస్‌ అయ్యర్‌

Nov 15 2026 6:20 PM | Updated on Nov 15 2026 6:28 PM

Shreyas Iyer hails bowlers after historic NZ series win

మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో 22 పరుగుల తేడాతో భారత్ అద్భుత విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.  2018-19 సీజన్ తర్వాత కివీస్ గడ్డపై భారత్ వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కివీస్ బౌలర్ల ధాటికి 209 పరుగులకే కుప్పకూలింది.  

అక్షర్ పటేల్ (46), ఇషాన్ కిషన్ (46) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడడంతో మెన్ ఇన్ బ్లూ ఆ మాత్రం స్కోరైనా సాధించిగల్గింది. అనంతరం భారత బౌలర్లు సైతం నిప్పులు చెరిగారు. 210 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు మహ్మద్ సిరాజ్ షాక్ ఇచ్చాడు. డేంజరస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్‌ను అవుట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు.

ఆ తర్వాత విల్ యంగ్, నిక్ కెల్లీ నిలకడగా ఆడి భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశారు. కానీ మిడిల్ ఓవర్లలో మన పేసర్లు అద్భుతంగా రాణించారు. ఫలితంగా కివీస్ లక్ష్య చేధనలో 187 పరుగుల వద్ద ఆలౌటైంది. అర్ష్‌దీప్ సింగ్ మూడు.. అక్షర్, సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టి అతిథ్య జట్టును దెబ్బతీశారు.

ఇక చారిత్రాత్మక సిరీస్ విజయంపై మ్యాచ్ అనంతరం భారత తాత్కాలిక కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు. పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మాట్లాడుతూ బౌలర్ల ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు.

"న్యూజిలాండ్ వంటి కఠిన పరిస్థితుల్లో టీ20, వన్డే సిరీస్‌లు గెలవడం చాలా గొప్ప విషయం. ఈ వన్డే సిరీస్ ఆద్యంతం బ్యాటర్లకు కండిషన్స్ అంతగా అనుకూలించలేదు. ఆఖరి మ్యాచ్‌లోనూ అదే జరిగింది. కానీ తక్కువ స్కోరు చేసినప్పటికీ మ్యాచ్‌ను గెలవగలమనే బలమైన నమ్మకం మాకుంది. ఎందుకంటే మా వద్ద అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును గెలిపించే సత్తా వారికి ఉంది. మరోసారి అది నిజమని నిరూపించారు. ప్రతి ఒక్కరూ చూపించిన పోరాట పటిమ నిజంగా అద్భుతం" అని అయ్యర్ అన్నాడు.

అలాగే ఇక్కడికి వచ్చి తమకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ శ్రేయస్ ధన్యవాదాలు తెలిపాడు. "ఫలితాలతో సంబంధం లేకుండా వారు మద్దతు ఇచ్చిన తీరు అమోఘం. కొన్నిసార్లు ఫలితం మాకు అనుకూలంగా వచ్చింది, మరికొన్నిసార్లు న్యూజిలాండ్‌కు అనుకూలంగా వెళ్లింది. అయినప్పటికీ వారు రెండు జట్లను ప్రోత్సహించడం చాలా సంతోషాన్నిచ్చింది. మాకు కావాల్సింది ఇలాంటి సపోర్టే" అని అయ్యర్ పేర్కొన్నాడు.
చదవండి: నాన్నా.. చాలా టెన్షన్ అనిపించింది: సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement