PC: X
జొహన్నెస్‌బర్గ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ఘనవిజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ముగిసిన తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1–0తో ముందంజ వేసింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా తమ టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకుంది.
ఓవర్‌నైట్ స్కోరు 100/5తో గురువారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 55.3 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (39; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. సఫారీ బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ హార్మర్ 51 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... రబాడ మూడు వికెట్లు తీశాడు.
చివరి రోజు పడ్డ ఐదు వికెట్లలో నాలుగు హార్మర్ ఖాతాలోకే వెళ్లాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టులో అదరగొట్టిన హార్మర్ అచ్చం అదే తరహాలో చెలరేగిపోగా... అతడి బంతులను అంచనావేయడంలో విఫలమైన బంగ్లాదేశ్ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుసకట్టారు.
అనంతరం 12 పరుగుల లక్ష్యఛేదనకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 1.3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 12 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేయగా... దక్షిణాఫ్రికా 557 పరుగులు చేసి భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం మూటగట్టుకుంది.
రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిసి 8 వికెట్లు పడగొట్టడంతో పాటు 72 పరుగులు చేసిన సఫారీ పేసర్ కగిసో రబాడకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి సెంచూరియన్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది.
అగ్రస్ధానానికి సౌతాఫ్రికా
ఈ విజయంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా 75.00 విజయాల శాతంతో అగ్రస్థానానికి చేరింది. బంగ్లాదేశ్ (40.74 విజయాల శాతం) ఐదో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా తర్వాత స్దానాల్లో న్యూజిలాండ్(72.22 విజయాల శాతం), ఆస్ట్రేలియా(69.23%) ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే 51.52 విజయాల శాతంతో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.
ఫైనల్‌కు చేరాలంటే భారత్ కనీసం 63 నుంచి 65 విజయాల శాతం సాధించాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కనీసం 1-0 లేదా 2-0తో సిరీస్ గెలవాలి. కివీస్ చేతిలో సిరీస్ ఓడిపోతే భారత్ ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతవుతాయి.
అదేవిధంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 5 టెస్టుల సిరీస్‌ను భారత్ కనీసం 4-1 తేడాతో గెలుచుకోవాలి. అప్పుడే భారత్ న్యూజిలాండ్, ఆసీస్‌ను వెనక్కి నెట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


