నవ రత్నాలు | Nine Indian athletes in TIME100 Next | Sakshi
Sakshi News home page

నవ రత్నాలు

Nov 20 2026 4:11 AM | Updated on Nov 20 2026 4:11 AM

Nine Indian athletes in TIME100 Next

‘టైమ్‌ 100–నెక్స్ట్‌ఇండియా’లో తొమ్మిది మంది భారత క్రీడాకారులు

క్రికెట్‌ నుంచి వైభవ్‌ సూర్యవంశీ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు చోటు

న్యూఢిల్లీ: భారత యువ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీకి అరుదైన గౌరవం దక్కింది. ‘టైమ్‌ 100–నెక్స్ట్ ఇండియా’ జాబితాలో అతడికి చోటు దక్కింది. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడంతో పాటు... జాతీయ స్థాయి టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతిపిన్న వయసు్కడిగా వైభవ్‌ రికార్డు నెలకొల్పాడు. వివిధ రంగాల్లో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వ్యక్తులను ఈ జాబితాలో పొందుపర్చారు. ఇందులో క్రీడా రంగం నుంచి తొమ్మిది మంది అవకాశం దక్కించుకున్నారు. వైభవ్‌ సూర్యవంశీతో పాటు... భారత మహిళల క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, ఒలింపిక్‌ పతక విజేతలు మీరాబాయి చాను, లవ్లీనా బొర్గోహైన్, టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జాకు ఈ జాబితాలో చోటు దక్కింది. 

చెస్‌ ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్, మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌ జాతీయ రికార్డు నెలకొల్పిన విథ్య రామరాజ్, ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన ఆర్చర్‌ కుంకుమ్‌ మొహొద్, మహిళల హాకీ జట్టు గోల్‌ కీపర్‌ సవితా పునియా కూడా ఇందులో ఉన్నారు. మనదేశంలో టైమ్‌ పత్రిక ఈ జాబితాను విడుదల చేయడం ఇదే తొలిసారి కాగా... భవిష్యత్తు అసాధారణ నాయకులు, వర్ధమాన తారలకు ఇది ప్రత్యేక గుర్తింపునిస్తుంది. వైభవ్, మీరాబాయి చాను, కుంకుమ్‌ ‘ఇన్నోవేటర్స్‌’ విభాగంలో చోటు దక్కించుకోగా... లవ్లీనా, గుకేశ్, విథ్య ‘ఫినామ్స్‌’లో నిలిచారు. ‘లీడర్స్‌’ జాబితాలో సవితా పునియా... ‘అడ్వకేట్స్‌’ జాబితాలో సానియా మీర్జా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లకు స్థానం దక్కింది.

వైభవ్‌... పదిహేనేళ్ల వయసులోనే.. 
ఇప్పటికే క్రికెట్‌లో ఎన్నో ఘనతలు తన ఖాతాలో వేసుకున్న వైభవ్‌ సూర్యవంశీ... ఈ జాబితాలో యువత ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన వైభవ్‌ టీమిండియా తరఫున 10 టి20 మ్యాచ్‌లు ఆడి 185.53 స్ట్రయిక్‌రేట్‌తో 295 పరుగులు చేశాడు. 2025 ఐపీఎల్‌లో మెరుపులతో వెలుగులోకి వచ్చిన వైభవ్‌ సూర్యవంశీ... ఆ తర్వాత బరిలోకి దిగిన ప్రతీ టోర్నమెంట్‌లో తనదైన ముద్రవేశాడు. 

ముఖ్యంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో అంతర్జాతీయ స్టార్‌ బౌలర్లను ఊచకోత కోస్తూ అతడు సాగించిన విధ్వంసం మాటలకందనిది. 16 మ్యాచ్‌ల్లో అతడు 237.30 స్ట్రయికరేట్‌తో 776 పరుగులు చేసి మహామహా ప్లేయర్లను వెనక్కినెట్టి ‘ఆరెంజ్‌ క్యాప్‌’ అందుకున్నాడు. దేశవాళీ టి20 టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తాజాగా బిహార్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన వైభవ్‌ సూర్యవంశీ... పురుషుల టి20 క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.

హ్యాట్సాఫ్‌ హర్మన్‌! 
అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా గుర్తింపు సాధించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. 8 టెస్టులు, 167 వన్డేలు, 213 టి20ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌... గతేడాది సారథిగా టీమిండియాకు ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌ అందించింది. ఇటీవల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌ కౌర్‌... మూడు ఫార్మాట్‌లలో కలిపి ఇప్పటి వరకు 388 మ్యాచ్‌లు ఆడింది. 

ఇక మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హర్మన్‌... 2023, 2025లో ఆ జట్టుకు డబ్ల్యూపీఎల్‌ టైటిల్స్‌ అందించింది. ఇటీవల ఆసియా క్రీడల్లో పసిడి పతకం సాధించిన తర్వాత హర్మన్‌ప్రీత్‌... మూడు ఫార్మాట్‌లలో జట్టు సారథ్యం నుంచి తప్పుకోగా... ఇప్పుడు స్మృతి మంధానా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.  

లవ్లీనా... పవర్‌ పంచ్‌... 
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను... వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారత వెయిట్‌ లిఫ్టర్‌గా రికార్డు సృష్టించింది. 

32 ఏళ్ల మీరాబాయి చాను... ఇటీవల ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిసింది. కామన్వెల్త్, ఆసియా క్రీడలు, వరల్డ్‌ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌ ఇలా బరిలోకి దిగిన ప్రతి చోట తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న మీరాబాయి చాను... యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. 

రింగ్‌లో అడుగుపెడితే... పంచ్‌లతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహై... టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. 2023లో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన లవ్లీనా ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడా మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇటీవల ఆసియా క్రీడల్లో 29 ఏళ్ల లవ్లీనా బంగారు పతకం సాధించింది. ఇక భారత మహిళల టెన్నిస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన హైదరాబాదీ స్టార్‌ సానియా మీర్జా... కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించింది. 

మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మూడు టైటిల్స్‌ గెలిచిన 40 ఏళ్ల సానియా... రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఆటతో అనుబంధం కొనసాగిస్తోంది.  అథ్లెటిక్స్‌లో పరుగుల రాణి పీటీ ఉషా పేరిట ఉన్న 42 ఏళ్ల జాతీయ రికార్డును విథ్య రామరాజ్‌ బద్దలు కొట్టింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో చరిత్ర సృష్టించిన విథ్య ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. వీరితో పాటు ప్రపంచ చెస్‌ చాంపియన్‌ 20 ఏళ్ల గుకేశ్, మహిళా ఆర్చర్‌ కుంకుమ్‌ మొహొద్‌ కూడా టైమ్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు సినీ రంగం నుంచి ఆలియా భట్, విక్కీ కౌశల్, దిల్జీత్‌ దొసాంజ్‌ వంటి వారు ఇందులో ఉన్నారు. 

పెట్టని గోడ... సవితా పునియా... 
సుదీర్ఘ కాలంగా భారత మహిళల హాకీ జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్న 36 ఏళ్ల సవితా పునియా... మూడుసార్లు ‘వరల్డ్‌ గోల్‌ కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు గెలుచుకుంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు నాలుగో స్థానంలో నిలవడంలో ప్రధాన పాత్ర పోషించిన సవితా... తాజా జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలకమైంది. 

ఇప్పటి వరకు టీమిండియా తరఫున 321 మ్యాచ్‌లు ఆడిన సవిత... ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ‘ఇది గొప్ప గౌరవంగా భావిస్తున్నా. దేశ భవిష్యత్తుకు ప్రతీకలుగా నిలుస్తున్న పలువురు ప్రతిభావంతుల మధ్య చోటుదక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఇది కేవలం నాకు దక్కిన గుర్తింపు కాదు. ఇది భారత మహిళల హాకీకి దక్కిన గౌరవం. ఈ స్థాయికి చేరుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ దీనిపై హక్కు ఉంది. ఇది యువ ప్లేయర్లకు మరింత స్ఫూర్తినిస్తుందనే నమ్మకం ఉంది’ అని సవిత వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement