రక్షిత సంచలనం | Rakshitha Sri creates a major sensation at the Hong Kong Open | Sakshi
Sakshi News home page

రక్షిత సంచలనం

Nov 20 2026 4:00 AM | Updated on Nov 20 2026 4:00 AM

Rakshitha Sri creates a major sensation at the Hong Kong Open

ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ చెన్‌ యుఫెపై విజయం

క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్, లక్ష్య సేన్‌  

కౌలూన్‌: హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత రైజింగ్‌ స్టార్‌ రక్షిత శ్రీ పెను సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్‌ రక్షిత శ్రీ 21–18, 24–22తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, ప్రస్తుత ఆసియా చాంపియన్‌ చెన్‌ యుఫె (చైనా)పై అద్భుత విజయం సాధించింది. ‘నా కెరీర్‌లో ఇదే అతిపెద్ద విజయం. చెన్‌ యుఫె నా ఆరాధ్య క్రీడాకారిణి. ఆమెను ఓడించానంటే ఇంకా నమ్మశక్యంగా లేదు’ అని కోయంబత్తూరుకు చెందిన 19 ఏళ్ల రక్షిత శ్రీ వ్యాఖ్యానించింది.హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న రక్షిత నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో తలపడుతుంది. 

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్‌... పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో లక్ష్య సేన్‌ 21–11, 21–18తో రస్‌ముస్‌ గెమ్కే (డెన్మార్క్‌)పై... శ్రీకాంత్‌ 12–21, 21–18, 21–14తో యూ టే బిన్‌ (దక్షిణ కొరియా)పై...సాత్విక్‌–చిరాగ్‌ 21–19, 21–16తో నూర్‌ మొహమ్మద్‌ అయూబ్‌–టాన్‌ వీ కియోంగ్‌ (మలేసియా)లపై గెలిచారు. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ 20–22, 13–21తో లౌరెన్‌ లామ్‌–అలీసన్‌ లీ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అష్మిత చాలిహా 17–21, 12–21తో హినా అకెచి (జపాన్‌) చేతిలో ఓటమి పాలైంది.   

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement