‘ఇక నిర్వీర్యమే..’ ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌! | Trump Declares Iran war over after Meeting Qatar pm | Sakshi
Sakshi News home page

‘ఇక నిర్వీర్యమే..’ ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌!

Nov 10 2026 7:12 AM | Updated on Nov 10 2026 7:20 AM

Trump Declares Iran war over after Meeting Qatar pm

వాషింగ్టన్: ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. సైనికపరంగా ఇరాన్ కథ ముగిసిందని, ప్రస్తుతం మరోసారి దాడులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీతో సమావేశమైన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వీర్యం చేసే పరిష్కారం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

అణు కార్యక్రమానికి ముగింపు?
వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. సైనికపరంగా ఇరాన్ పూర్తిగా బలహీనపడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కొనసాగించడంపైనే అమెరికా దృష్టి సారించిందన్నారు. ఇరాన్‌ను చాలా వరకు నిర్వీర్యం చేశామని, అయితే అక్కడి అణు కార్యక్రమానికి శాశ్వతంగా ముగింపు పలికే మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. అవసరమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందని కూడా వ్యాఖ్యానించారు.

మిడ్‌టర్మ్ ఎన్నికల ప్రభావం..
అమెరికాలో ఇటీవల జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ ఉభయ సభల్లో మెజారిటీ కోల్పోయింది. డెమోక్రాట్లు విజయం సాధించారు. ఇరాన్‌తో ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని పలు రంగాలపై ఈ ప్రభావం పడింది. అమెరికా ప్రజల్లోనూ అసంతృప్తి పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ మరోసారి దాడులు చేస్తామన్న హెచ్చరికల విషయంలో వెనక్కి తగ్గుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఖతార్ ప్రధానితో కీలక చర్చలు..
ఖతార్ ప్రధాని అల్ థానీతో జరిగిన సమావేశంలో ఇరాన్ పరిస్థితిపై విస్తృతంగా చర్చించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ విషయాన్ని తన ట్రూత్ సోషల్ ఖాతాలో వెల్లడించారు. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ తదితర దేశాలు ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. చరిత్రలోనే అతిపెద్ద నౌకాదళ దిగ్బంధనం, ఆపరేషన్ ఐరన్ గేట్ కొనసాగింపునకు ఆయా దేశాలు మొగ్గుచూపుతున్నాయని చెప్పారు.

ఇరాన్‌ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు..
ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదన్న విషయంలో అన్ని దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ అంశంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మారితే అమెరికా సైన్యం రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉందన్నారు. అయితే ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్‌తో పాటు మధ్యప్రాచ్య దేశాలకు ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పు తొలగిపోయిందని, యుద్ధం ముగింపు దిశగా సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

మళ్లీ దాడులు జరిగే అవకాశాలు తక్కువే?
అంతకుముందు సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలోనూ ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చల్లో పురోగతి కనిపించి, బలమైన ఒప్పందం కుదిరితే మళ్లీ దాడులు జరిగే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. అయితే సైనిక చర్యలు తిరిగి ప్రారంభమైతే లక్ష్యంగా చేసుకునేందుకు 38 వంతెనలతో సహా కొన్ని ప్రాంతాలను అమెరికా సైన్యం గుర్తించిందని వెల్లడించారు.

దిగ్బంధనం కొనసాగింపు.. పరిమిత దాడులు
మరోవైపు గత వారం ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలపై అమెరికా సైన్యం కనీసం రెండుసార్లు పరిమిత దాడులు చేసింది. శనివారం అమెరికా నౌకాదళం ఓ వాణిజ్య నౌకపై కాల్పులు జరిపింది. ఇరాన్ నౌకాశ్రయాలపై విధించిన అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ఛేదించేందుకు ఆ నౌక ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది. దీంతో ట్రంప్ యుద్ధం ముగింపు దిశగా సంకేతాలు ఇస్తున్నప్పటికీ, ఇరాన్‌పై సైనిక ఒత్తిడి మాత్రం కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement