ఇరాన్‌తో యుద్ధంపై మార్కోరూబియో
ప్రజలు మెచ్చకున్నా.. అదే సరైన నిర్ణయమని వెల్లడి
ఫ్లోరిడా: ఇరాన్ అణ్వాయుధ ఆశల నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై యుద్ధానికి దిగారని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఇటీవలి మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర వైఫల్యంపై మార్కో నేరుగా వ్యాఖ్యానించలేదు. అయితే యుద్ధమే పార్టీ నష్టానికి కారణమని ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ సోషల్ మీడియాలో చెప్పిన విషయంపై రూబియో విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ రూపంలో ట్రంప్ ఒక అసలైన ముప్పును గుర్తించారని, ఆ దేశం అణ్వాస్త్రాలను తయారు చేయకుండా అడ్డుకున్నారని వివరించారు.
దేశం కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ తరచూ చెబుతూంటారని, దేశానికి ఎదురవుతున్న భద్రతాపరమైన ముప్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇష్టం లేకున్నా అవసరమైన చర్య కాబట్టే ఇరాన్‌పై యుద్ధం ప్రకటించారని అన్నారు. జీ–7 సదస్సుల కోసం ప్యారిస్ వెళ్లేందుకు ముందు రూబియో ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడారు. జేడీ వాన్స్ వ్యాఖ్య సరైందైనప్పటికీ ఉపాధ్యక్షుడిగా ఆయన అవసరమైన చర్యగా మరింత గట్టిగా చెప్పి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే వాళ్లు ఎప్పుడైనా ప్రపంచాన్ని పేల్చేస్తారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా గతంలో వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇరాన్ మాత్రం తాము శాంతియుత ప్రయోజనాల కోసమే అణుశక్తిని ఉపయోగిస్తున్నట్లు చెబుతూ వస్తోంది. మరోవైపు ఇరాన్ వద్ద దాదాపు 440.9 కిలోల యురేనియం ఉందని, దీన్ని 60 శాతం వరకూ శుద్ధి చేయగలిగారని అంతర్జాతీయ ఇంధన సంస్థ చెబుతోంది. ఆణ్వాయుధాల తయారీకి 90 శాతం స్వచ్ఛత అవసరమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌తో యుద్ధం అంతం చేసేందుకు ఎలాంటి మార్గం లేకుండా పోయింది. అయితే అమెరికా ఎన్నికల ఫలితాల అనంతరం ఇరుపక్షాల మధ్య చర్చలు మళ్లీ మొదలయ్యేందుకు మధ్యవర్తులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ట్రంప్ కూడా దౌత్యమార్గాల ద్వారానే సమస్యకు పరిష్కారం కావాలని కోరుకుంటున్నారని, అయితే ఇప్పటివరకూ ఇరాన్ పెడుతున్న షరతులు ఆమోదయోగ్యంగా లేవని రూబియో స్పష్టం చేశారు.


