PC: BCCI/X
జపాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడలు-2026లో స్వర్ణ పతకంతో సత్తా చాటిన భారత పురుషుల క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న విజేతలైన టీమిండియా ఆటగాళ్లకు అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా శనివారం జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 19 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ పసిడి పతకాన్ని ముద్దాడింది.
అభిషేక్, తిలక్ మెరుపులు
ఈ ఉత్కంఠభరిత ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 61), తిలక్ వర్మ (22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్), శివం దూబే (15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
అనంతరం 212 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. పాక్ బ్యాటర్ హసన్ నవాజ్ (51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 96) ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దీంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 192 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
విండీస్ టీ20 సిరీస్‌కు రెడీ
ఇక స్వదేశానికి చేరుకున్న భారత జట్టు 48 గంటలు తిరగకుముందే మరో కీలక పోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 అక్టోబర్ 6న లక్నో వేదికగా జరగనుంది. శ్రేయస్ సేన నేరుగా ఢిల్లీ నుంచి లక్నోకు పయనం కానుంది. కాగా ఇప్పటికే విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: WCL 2026: అంబటి రాయుడు మెరుపులు వృథా.. ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి


