'సచిన్ అయినా తప్పించేవారేమో!.. ఇది నిజంగా చాలా అన్యాయం' | Mohammad Kaif Fires Indian Team Management Amid Mohammed Siraj Exclusion | Sakshi
Sakshi News home page

IND vs NZ: 'సచిన్ అయినా తప్పించేవారేమో!.. ఇది నిజంగా చాలా అన్యాయం'

Nov 21 2026 1:06 PM | Updated on Nov 21 2026 1:07 PM

Mohammad Kaif Fires Indian Team Management Amid Mohammed Siraj Exclusion

PC: BCCI/X

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుకు భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడిని పక్కన పెట్టడంపై రాజకీయ దుమారం కూడా రేగింది. విదేశీ గడ్డపై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న సిరాజ్‌ను కావాలనే పక్కన పెట్టారంటూ ఇండియన్ టీమ్ మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తొలి టెస్టు కోసం భారత పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కంబోజ్‌లకు చోటు దక్కింది. కంబోజ్, ప్రసిద్ధ్ వంటి బౌలర్లను ఎంపిక చేసినప్పటికీ, సీనియర్ పేసర్ సిరాజ్‌ను పక్కన పెట్టడాన్ని మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా టీమ్ మేనేజ్‌మెంట్ తీరుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తుది జట్టును ఖరారు చేసేటప్పుడు ప్రస్తుత జట్టు యాజమాన్యం సీనియారిటీని గానీ, గత రికార్డులను గానీ పట్టించుకోవడం లేదని కైఫ్ ఆరోపించాడు.

ఈ అంశంపై తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన కైఫ్.. "సిరాజ్‌ను తుది జట్టు నుంచి తప్పిస్తారని నేను ముందే ఊహించాను. ఎందుకంటే ప్రస్తుత టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఇది చాలా సాధారణంగా మారింది. మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను కూడా ఎలాంటి కారణాలు లేకుండా పక్కన పెట్టేస్తున్నారు. ఒకవేళ సచిన్ టెండూల్కర్ కూడా ఈ జట్టులో ఉండి రెండు, మూడు మ్యాచ్‌లలో విఫలమైతే అతడిని కూడా ప్రశ్నించేవారు. చివరికి సచిన్‌ను కూడా జట్టు నుంచి తప్పించేవారేమో" అని వ్యాఖ్యనించాడు.

"ఈ టీమ్ మేనేజ్‌మెంట్‌కు సీనియారిటీతో పెద్దగా సంబంధం లేదు. వీరి హయాంలో కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహ్మద్ షమీ పట్ల కూడా దారుణంగా వ్యవహరించారు. కనీసం అతడికి రీఎంట్రీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ మేనేజ్‌మెంట్ ఎప్పుడూ సీనియర్లకు తగిన గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు సిరాజ్ విషయంలోనూ అదే జరుగుతోంది" అని కైఫ్ విమర్శించాడు.

శ్రీలంక పర్యటనను సాకుగా చూపే అవకాశం ఉందంటూ.. "బహుశ శ్రీలంక టూర్‌లో సిరాజ్ పెద్దగా రాణించలేదనే కారణం చెబుతారేమో. కానీ అక్కడ పేసర్లకు ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేశారు. ఎందుకంటే శ్రీలంక కండిషన్స్ స్పిన్నర్లకు అనుకూలిస్తాయని మనందరికీ తెలుసు" అని కైఫ్ స్పష్టం చేశాడు.
చదవండి: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. బాబర్‌, రిజ్వాన్‌లకు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement