‘మాటల్లేవ్.. ఊచకోత అంటే ఇదేనేమో!’ | Tilak Varma Praise-Vaibhav-No-Words-To-Describe-Its-Absolute Carnage | Sakshi
Sakshi News home page

IND Vs UAE: ‘మాటల్లేవ్.. ఊచకోత అంటే ఇదేనేమో!’

Nov 25 2026 8:41 AM | Updated on Nov 25 2026 8:51 AM

Tilak Varma Praise-Vaibhav-No-Words-To-Describe-Its-Absolute Carnage

Photo Credit: Twitter

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026లో యూఏఈపై వైభవ్ సూర్యవంశీ ఆడిన 204 పరుగుల రికార్డు ఇన్నింగ్స్‌ను కెప్టెన్ తిలక్ వర్మ ‘అక్షరాల ఊచకోత’ (absolute carnage) అని, తాను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇదొకటని కొనియాడాడు. 

మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 250 పరుగుల లక్ష్య ఛేదనలో వైభవ్ (53 బంతుల్లో 204; 28 సిక్సర్లు, 7 ఫోర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్-ఎ జట్టు 14.2 ఓవర్లలోనే విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరింది. మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ వైభవ్ బ్యాటింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

తిలక్‌ వర్మ మాట్లాడుతూ.. "వైభవ్ ఆటను వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. అతను ఆడిన తీరు చూస్తుంటే తొలి 5 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసిపోయిందనిపించింది. ఆ తర్వాత కూడా అతను తన జోరును కొనసాగించాడు. అతని బ్యాటింగ్ అద్భుతంగా సాగింది. వైభవ్ సిక్సర్లు బాదుతున్న తీరుకు, బంతి బౌండరీ (ఫోర్) దాటినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ప్రతి బంతికి "సిక్స్ కొట్టాడా? లేదా? అని మాత్రమే చూశాము. మాకెందుకో వైభవ్ కొట్టే ఫోర్ల కన్నా సిక్సర్లపైనే ఎక్కువ ఆసక్తి కలిగింది. అందుకే అతడు సిక్స్ కొట్టిన ప్రతీసారి ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించాం.నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి.

అర్షద్ ఖాన్ అద్భుతం..
తన తొలి మ్యాచ్‌లోనే అర్షద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని ప్రదర్శన రాబోయే మ్యాచ్‌కు మాకు చాలా కీలకం. ఈ ప్రదర్శన అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. తన బౌన్సర్లతో అర్షద్ కట్టడి చేశాడు. లైన్ అండ్ లెంగ్త్‌లను మారుస్తూ అతను బౌలింగ్ చేసిన విధానం బాగా ఆకట్టుకుంది. అతను చాలా కచ్చితత్వంతోనే బౌలింగ్ చేశాడు. కాబట్టి ఈ క్రెడిట్ అతనికి కూడా దక్కుతుంది.

నా ఎడమవైపు కండరాలు పట్టేయడంతోనే రింకూ సింగ్‌ను అప్‌ది ఆర్డర్ పంపించాం. సెమీఫైనల్స్‌కు ముందు రిస్క్ ఎందుకనే నేను బ్యాటింగ్ చేయలేదు. అంతేకాకుండా గత రెండు మ్యాచ్‌ల్లో రింకూ సింగ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా రాలేదు. అతనికి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. 

సెమీఫైనల్ మ్యాచ్ గెలవడం మాకు చాలా ముఖ్యం. ఆ మ్యాచ్ కోసం మేము సిద్దంగా ఉన్నాం. ఈ మ్యాచ్‌‌తో మాకు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో ఆత్మవిశ్వాసం లభించింది. సెమీఫైనల్ కోసం ఆసక్తిగా ఉన్నాం.’’ అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇక సెమీఫైనల్లో శ్రీలంకతో భారత్‌ తలపడనుంది.

ఇదీ చదవండి: ఐపీఎల్ వేలంలోకి బెన్ స్టోక్స్‌.. బ‌రిలో సెహ్వాగ్ కుమారుడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement