PC: Twitter
సెంచూరియన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఓపెనర్ మార్క్యూస్ అకెర్‌మన్, ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ శతకాలతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 115 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసింది. మార్కో జాన్సెన్ (67 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీతో క్రీజులో ఉన్నాడు.
అంతకముందు అకెర్‌మన్ (138 బంతుల్లో 150), వియాన్ ముల్డర్ (178 బంతుల్లో 100) సెంచరీలతో మెరవగా, టోని డి జార్జి (66) అర్థసెంచరీ సాధించాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 403 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, ఖాలెద్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్, ఎబోదత్ హొస్సేన్, తౌహిద్ హృదోయ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు బంగ్లాదేశ్ సఫారీ బౌలర్ల ధాటికి 91 పరుగులకే కుప్పకూలింది.

PC: Twitter
ఆల్ టైమ్ రికార్డు బద్దలు
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఓపెనర్ అకెర్‌మన్ తన కెరీర్‌లో మొదటి ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 470 పరుగులు చేసి సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డును బద్దలుకొట్టాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన అకెర్‌మన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు పరుగులకే ఔటయ్యాడు. ఇక బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు.
అయితే ఈ మధ్యలో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్థశతకాలు, రెండు శతకాలు సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు, మూడు టెస్టులో రెండు అర్ధశతకాలు (95, 62) సాధించిన అకెర్‌మన్, బంగ్లాదేశ్‌పై కూడా తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. బంగ్లాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 157 పరుగులు చేసి తొలి సెంచరీ సాధించిన అకెర్‌మన్.. తాజాగా రెండో టెస్టులో 150 పరుగుల మార్క్ దాటాడు.
ఇలా తొలి ఆరు ఇన్నింగ్స్‌లలోనే, అకెర్‌మన్ 78.33 సగటుతో 470 పరుగులు సాధించాడు. తొలి ఆరు ఇన్నింగ్స్‌లలో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇది దక్షిణాఫ్రికాకు ఒక రికార్డు. ఇంతకుముందు, ఫాఫ్ డు ప్లెసిస్ తన తొలి ఆరు ఇన్నింగ్స్‌లలో 111.25 సగటుతో 445 పరుగులు చేసి జాతీయ రికార్డును కలిగి ఉండేవాడు.
మొత్తం మీద, ఈ జాబితాలో అకెర్‌మన్ సంయుక్తంగా ఐదవ స్థానంలో ఉన్నాడు. ఇక భారత ఆటగాడు వినోద్ కాంబ్లీ తన తొలి ఆరు టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 669 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ప్రస్తుత టెస్ట్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన తొలి ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 480 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇదీ చదవండి: యూఏఈపై వైభవ్ విస్ఫోటం


