మరింత మెరుగైతేనే! | India has the potential to become a sporting power in the future | Sakshi
Sakshi News home page

మరింత మెరుగైతేనే!

Oct 5 2026 2:29 AM | Updated on Oct 5 2026 2:29 AM

India has the potential to become a sporting power in the future

భవిష్యత్‌లో భారత్‌ క్రీడా శక్తిగా ఎదిగే అవకాశం

ఆసియా క్రీడల్లో ఫర్వాలేదనిపించిన మనోళ్ల ప్రదర్శన 

అంచనాలను అందుకోని భారత షూటర్లు, అథ్లెట్లు, షట్లర్లు

పదేళ్ల తర్వాత దేశంలో అత్యున్నత క్రీడా సంబరం ఒలింపిక్స్‌ నిర్వహించాలని పట్టుదలగా ఉన్న కేంద్ర ప్రభుత్వం... అప్పటి వరకు దేశంలో క్రీడా సంస్కృతిని మరింత పెంపొందించాలని భావిస్తోంది. వచ్చే దశాబ్దకాలంలో అంతర్జాతీయ పోటీల్లో నిలకడైన ప్రదర్శనలు చేస్తూ... 2036 ఒలింపిక్స్‌ కల్లా ప్రపంచంలో టాప్‌–10 క్రీడా దేశాల్లో ఒకటిగా నిలవాలని దృఢనిశ్చయంతో ఉంది. కానీ తాజా ఆసియా క్రీడల్లో భారత్‌కు లభించిన పతకాలు, కనబరిచిన ప్రదర్శన చూస్తే మాత్రం లక్ష్యానికి చాలా దూరంలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

ఈసారి ఆసియా క్రీడల సన్నాహాల కోసం భారత క్రీడాకారులపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏకంగా రూ. 702 కోట్లు వెచ్చించింది. అందుబాటులో ఉన్న అత్యుత్తమ సౌకర్యాలు కల్పించింది. కోరుకున్న చోట శిక్షణకు పంపించింది. మేటి కోచ్‌లను సమకూర్చింది. దాంతో వరుసగా రెండోసారి పతకాల్లో భారత్‌ ‘సెంచరీ’ కొడుతుందని అందరూ భావించారు. కానీ భారత క్రీడాకారులు జపాన్‌ ఆసియా క్రీడల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారనే చెప్పాలి.

2023 ఆసియా క్రీడల్లో భారత్‌ మొత్తం 106 పతకాలు సాధించగా... ఈసారి మనకు 85 పతకాలే వచ్చాయి. క్రితంసారి కంటే 21 పతకాలు తక్కువగా వచ్చాయి. షూటర్లు, అథ్లెట్లు, షట్లర్లు అంచనాలను అందుకోలేకపోయారు. క్రితంసారి సాధించిన నాలుగో స్థానాన్ని భారత్‌  నిలబెట్టుకున్నా... భవిష్యత్‌లో ఆసియాలో టాప్‌–3లోకి రావాలంటే మాత్రం భారత్‌ తమ ప్రదర్శనకు మరింత పదును పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  –సాక్షి, క్రీడావిభాగం  

గత ఆసియా క్రీడల్లో పతకాల శతకం నమోదు చేసిన భారత్‌... తాజా ఏషియన్‌ గేమ్స్‌లో మాత్రం సెంచరీకి చేరువగా రాలేకపోయింది. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తంగా 85 పతకాలు సాధించింది. భారత్‌తోపాటు ఉజ్బెకిస్తాన్‌ కూడా 21 స్వర్ణాలు సాధించినా... రజత, కాంస్య పతకాల్లో భారత్‌దే పైచేయి కావడంతో గత నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. గత ఆసియా క్రీడలతో పోల్చుకుంటే ఈసారి మనకు 21 పతకాలు తక్కువ లభించాయి. కేవలం ఆసియా క్రీడల్లోనే కాకుండా ఒలింపిక్స్‌లోనూ పతకాల పట్టికలో చైనా, జపాన్, దక్షిణ కొరియా దూసుకెళ్తుంటే... 2036 కల్లా ప్రపంచంలోనే టాప్‌–10కు చేరాలనుకుంటున్న భారత్‌ మాత్రం ఆశించిన పురోగతి సాధించలేకపోతోంది. 

ఈసారి క్రీడల్లో మనవాళ్లు 100 పతకాల్లోపే పరిమితం కావడం వెనక ప్రధానంగా అథ్లెటిక్స్, షూటింగ్‌ వైఫల్యమే కారణంగా కనిపిస్తోంది. భారీ అంచనాల మధ్య జపాన్‌లో అడుగుపెట్టిన మన షూటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. 30 మంది షూటర్ల బృందం కేవలం 3 స్వర్ణాలు, 8 రజతాలు, 4 కాంస్యాలతో 15 పతకాలకే పరిమితమైంది. హాంగ్జౌ క్రీడల్లో మన షూటర్లు 7 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలు సాధించడంతోనే భారత్‌ సెంచరీ మార్క్‌ అందుకోగలిగింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మనూ భాకర్‌ రిక్తహస్తాలతో వెనుదిరగగా... మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో భారత్‌కు ఒక్క పతకం కూడా దక్కలేదు. ట్రాప్‌లో నీరూ ధండా మూడు పతకాలతో మెరవడం సంతృప్తినివ్వగా... హైదరాబాదీ షూటర్‌ కైనన్‌ చెనాయ్‌  ఆకట్టుకున్నాడు.  

‘పరుగు’ మందగమనం... 
ఇక అథ్లెటిక్స్‌లో కూడా భారత్‌ పతక వేట మందగించింది. పోటీలు ప్రారంభానికి ముందే స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గాయం కారణంగా ఏషియన్‌ గేమ్స్‌కు దూరం కాగా... గత రెండు ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించిన షాట్‌పుటర్‌ తజిందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌ ఈసారి వెండికే పరిమితమయ్యాడు. లాంగ్‌జంప్‌లో మురళీ శ్రీశంకర్, హైజంప్‌లో సర్వేశ్‌ కుశారే కూడా రజతాలే సాధించారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ప్రస్తుత ఆసియా చాంపియన్, క్రితంసారి రజతం నెగ్గిన ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ ఈవెంట్‌కు ముందురోజు తప్పుకోగా... పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పతకం ఆశించిన అవినాశ్‌ సాబ్లే గాయంతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

హాంగ్జౌ ఏషియన్‌ గేమ్స్‌ అథ్లెటిక్స్‌లో మనవాళ్లు 6 స్వర్ణాలతో అదరగొట్టగా... తాజా క్రీడల్లో మహిళల 4్ఠ400 మీటర్ల రిలేలో కిరణ్‌ పహల్, పూవమ్మ, ప్రాచీ, విత్యా బృందం నెగ్గిన పసిడి మాత్రమే భారత్‌కు లభించిన ఏకైక స్వర్ణం. 9 రజతాలు, 14 కాంస్యాలతో ఓవరాల్‌గా 24 పతకాలు సాధించిన మన అథ్లెట్స్‌ మరింత మెరుగవ్వాలి. ఆసియా క్రీడల సందర్భంగా క్రీడా గ్రామం లేకపోవడం... సరైన వసతి సదుపాయాలు కల్పించకపోవడం... క్రీడలకు ముందే పూర్తిస్థాయి సన్నద్ధత సాధ్యం కాకపోవడం... పోటీల వేదికకు చేరుకునేందుకు సుదూర ప్రయాణాలు, మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య కోలుకునేందుకు తగినంత సమయం లేకపోవడం ఇలా ఆటల సందర్భంగా ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ... పతకాల సంఖ్య తగ్గడం వెనక స్పష్టమైన కారణాలను మాత్రం నిజాయతీగా విశ్లేషించుకోవాల్సిన అవసరముంది. 

» ఆర్చరీలో మాత్రం మనవాళ్లు అంచనాలను అందుకున్నారు. టీనేజ్‌ సంచలనం కుంకుమ్‌ రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణం నెగ్గిన భారత ఆర్చర్‌గా రికార్డు సృష్టించగా... ఓవరాల్‌గా 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలతో మన ఆర్చర్లు 9 పతకాలతో మెరిశారు. గత ఆసియా క్రీడల్లోనూ 9 పతకాలే సాధించారు. 

» జట్టు క్రీడలైన క్రికెట్, హాకీ, కబడ్డీలో మన పురుషుల, మహిళల జట్లు బంగారు పతకాలతో భళా అనిపించాయి. పనిలోపనిగా హాకీ జట్లు 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించాయి. బాక్సర్లు 3 స్వర్ణాలు, 3 కాంస్యాలతో ఫర్వాలేదనిపించారు. 

» రెజ్లింగ్‌లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు దక్కినా... మహిళల విభాగంలో ఒక్క పతకమే రావడం నిరాశ కలిగించింది.  

» గోల్ఫ్‌లో ప్రణవి రికార్డు పసిడితో మెరవగా... వుషు, కురాశ్, మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్, సాఫ్ట్‌ టెన్నిస్, సెపక్‌తక్రా, రోయింగ్‌లో ఒక్కో పతకం దక్కింది. స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను రజతంతో ఆసియా క్రీడల్లో పతక బోణీ కొట్టింది. 

» నాలుగు దశాబ్దాలుగా తప్పక పతకం నెగ్గుతూ వస్తున్న టెన్నిస్‌లో మనవాళ్లు ఈసారి రిక్తహస్తాలతో వెనుదిరిగారు. బ్యాడ్మింటన్‌లో ఈసారి టీమ్‌ విభాగంలో కాంస్యం దక్కగా... వ్యక్తిగత విభాగంలో ఒక్క పతకం కూడా రాలేదు.  

36 ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ బరిలోకి దిగిన క్రీడాంశాలు

20 భారత్‌ పతకాలు గెలిచిన మొత్తం క్రీడాంశాలు

16 భారత్‌ ప్రాతినిధ్యం ఉన్నా ఈసారి ఒక్క పతకం సాధించని క్రీడాంశాలు (స్విమ్మింగ్, కయాకింగ్‌–కనోయింగ్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఈ–స్పోర్ట్స్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, జూడో, కరాటే, రగ్బీ, స్పోర్ట్‌ క్లైంబింగ్, సర్ఫింగ్, టెన్నిస్, తైక్వాండో, టెక్‌బాల్, వాలీబాల్‌)

4 భారత్‌కు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందించిన క్రీడాంశాలు (ఆర్చరీ, అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement