ఆసియా ‘మేజర్‌ పవర్‌’ భారత్‌! | India 3rd biggest Asian power | Sakshi
Sakshi News home page

ఆసియా ‘మేజర్‌ పవర్‌’ భారత్‌!

Nov 24 2026 5:44 AM | Updated on Nov 24 2026 5:44 AM

India 3rd biggest Asian power

సానుకూల వృద్ధి పొందిన ఏకైక దేశంగా గుర్తింపు 

 అగ్రస్థానంలో ఉన్న చైనాతో తగ్గిన అంతరం

టాప్‌–10 దేశాల్లో అత్యధికంగా భారత్‌కు పెరిగిన స్కోర్‌

ప్రాంతీయ నాయకత్వంలో ప్రధాని మోదీ ముందుకు 

లోవీ ‘ఆసియా పవర్‌ ఇండెక్స్‌–2026’ నివేదిక వెల్లడి

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అంతేకాదు, ఈ ప్రాంతంలో రెండో అత్యంత శక్తివంతమైన నేతగా ప్రధాని మోదీ నిలిచారు. ఆ్రస్టేలియాకు చెందిన ప్రతిష్టాత్మక ‘లోవీ ఇన్‌స్టిట్యూట్‌’తాజాగా విడుదల చేసిన ‘ఆసియా పవర్‌ ఇండెక్స్‌–2026’నివేదిక ఈ విషయం వెల్లడించింది.

సూపర్‌ పవర్‌ దేశాలైన అమెరికా 78.9 పాయింట్లు, చైనా 73.6పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉండగా, 40.5 పాయింట్ల ఓవరాల్‌ స్కోర్‌తో భారత్‌ ‘మేజర్‌ పవర్‌’హోదాలో మూడో స్థానంలో ఉన్నదని నివేదిక తెలిపింది. భారత్‌కు పెరుగుతున్న దౌత్య బలం, దీర్ఘకాలిక ఆర్థిక అవకాశాలు, ప్రాంతీయ భద్రతా భాగస్వామ్యాలు ఈ ఘనతకు ప్రధాన కారణాలని లోవీ నివేదిక పేర్కొంది. జపాన్, రష్యా, ఆ్రస్టేలియా వంటి దేశాలను వెనక్కి నెట్టి ముందుకు సాగడమే కాకుండా, ఆసియాలో అగ్రస్థానంలో ఉన్న చైనాతోనూ తన పాయింట్ల అంతరాన్ని రికార్డు స్థాయిలో తగ్గించుకోవడం విశేషం.  

2018లో లోవీ ఇన్‌స్టిట్యూట్‌ ఈ సూచీని ప్రారంభించినప్పటి నుంచి ఆసియాలోని 27 దేశాలు, భూభాగాలను 131 సూచికల ఆధారంగా మదింపు చేస్తోంది. తాజా ఎడిషన్‌లో భారత్‌ 0.5 పాయింట్లు పెంచుకుని 40.5 పాయింట్లకు చేరగా, చైనా 0.1 పాయింటు కోల్పోయి 73.6 పాయింట్లకు పరిమితమైంది. దీంతో ఇరు దేశాల మధ్య అంతరం 0.6 పాయింట్లు తగ్గి, సూచీ ప్రారంభమైనప్పటి నుంచి అత్యల్ప స్థాయికి చేరింది.

టాప్‌–10 దేశాల్లో అత్యధికంగా స్కోర్‌ పెంచుకోవడంతోపాటు సానుకూల వృద్ధి (అప్‌వర్డ్‌ ట్రెండ్‌) సాధించిన ఏకైక దేశంగా భారత్‌ నిలిచింది. 2018 నుంచి 2023 వరకూ 4వ స్థానంలో ఉన్న భారత్‌... 2024లో తొలిసారి జపాన్‌ను అధిగమించి 3వ స్థానానికి చేరింది. 2025లో 40 పాయింట్ల మార్కును దాటి మేజర్‌ పవర్‌ హోదాను తిరిగి పొందింది. ఇప్పుడు వరుసగా మూడోసారి మూడో స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు జపాన్‌పై ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది.  

రెండో స్థానంలో మోదీ 
ఆసియా ప్రాంతీయ నాయకత్వ (రీజినల్‌ లీడర్‌షిప్‌) ర్యాంకింగ్స్‌లో భారత ప్రధాని మోదీ ఏకంగా మూడు స్థానాలు పైకి ఎగబాకారు. 2025లో ఐదో స్థానంలో ఉన్న మోదీ.. 2026 నాటికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తర్వాత రెండో స్థానానికి చేరుకున్నారు. ఆసియాలో భారత దౌత్య ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చూపిన సమర్థతకు లోవీ నిపుణుల సర్వేలో అధిక రేటింగ్‌
లభించింది.  

విదేశీ పెట్టుబడులకు హాట్‌స్పాట్‌గా భారత్‌... 
ప్రపంచ పెట్టుబడిదారులకు చైనా కంటే భారత్‌ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని లోవీ నివేదిక పేర్కొంది.  

అంతర్జాతీయంగా పెట్టుబడుల రాక 
మొత్తం సూచీలో 0.7 శాతం వెయిటేజీ ఉన్న 2023–25 మూడేళ్ల విదేశీ మూలధన ప్రవాహం విభాగంలో చైనాను వెనక్కి నెట్టిన భారత్‌ అమెరికా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. చైనా ఒక స్థానం ఎగబాకి 4వ స్థానానికి చేరినప్పటికీ, భారత్‌ కంటే వెనుకబడింది. ఇండోనేసియా ఐదో స్థానానికి పడిపోయింది.

పదేళ్ల పెట్టుబడి ఆకర్షణ... 
గత దశాబ్ద కాలం (2016–25)లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో (వెయిటేజీ 0.75 శాతం)నూ అమెరికా తర్వాత భారత్‌
ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో దక్షిణ కొరియా పదో స్థానానికి ఎగబాకింది. రష్యా 12వ స్థానానికి పడిపోయింది.

సైనిక శక్తిలో భారత్‌ నంబర్‌ 1 
మొత్తం సూచీలో 3.5 శాతం (కీలకమైన) వెయిటేజీ ఉన్న ‘సైనిక శక్తి, దౌత్య వేదికలపై ప్రాతినిధ్యం’విభాగంలో భారత్‌ సత్తా చాటింది. క్రియాశీల ఆర్మీ, పారామిలిటరీ బలగాల సంఖ్య, శిక్షణ, సంసిద్ధత, సమర్థంగా వ్యవస్థీకరించిన తీరు వంటి అంశాల్లో వందకు వంద స్కోర్‌ సాధించిన ఏకైక దేశంగా ప్రపంచంలోనే నంబర్‌ 1 స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనా (85.3), రష్యా (74), అమెరికా (64.8) దేశాలను సైతం అధిగమించింది.

దౌత్య వేదికలపై ప్రాతినిధ్యం విషయానికొస్తే, భారత్‌ రెండు స్థానాలు ఎగబాకి ఇండోనేసియా, థాయ్‌లాండ్‌లతో ఉమ్మడిగా 17 చోట్ల ప్రాతినిధ్యంతో రెండో స్థానంలో నిలిచింది. 2023–24లో లోవీ ట్రాక్‌ చేసిన అంతర్జాతీయ సదస్సులు, దౌత్య కూటములు, ప్రాంతీయ సంస్థల్లో ప్రాతినిధ్యం ప్రకారం చైనా 18 చోట్ల ప్రాతినిధ్యంతో ప్రథమ స్థానంలో ఉంది. ఆ్రస్టేలియా, దక్షిణ కొరియా రెండేసి స్థానా లు కోల్పోయి ఆరో స్థానానికి పరిమితమయ్యాయి.  

ర్యాంక్‌    దేశం    స్కోర్‌
            (100కు) 
1    భారత్‌    100 
2    చైనా    85.3 
3    రష్యా    74 
4    అమెరికా    64.8 
5    ఉత్తర కొరియా    58.8 
6    పాకిస్తాన్‌    46.4 
7    దక్షిణ కొరియా    37.4 
8    ఆ్రస్టేలియా    28.9 
9    వియత్నాం    28.6

ఆర్థిక స్థిరత్వంలో భారత్‌కు మూడో స్థానం
ఇతర దేశాల ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకునే సామర్థ్యంలో భారత్‌ 68.3 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఎగుమతి ఉత్పత్తుల వైవిధ్యం, ఎగుమతి మార్కెట్ల వైవిధ్యం, అతిపెద్ద వాణిజ్య భాగస్వామిపై ఆధారపడే తీరును బట్టి దీన్ని అంచనా వేశారు. చైనా 75.3 స్కోర్‌తో ప్రథమ స్థానంలో, అమెరికా 73.5 స్కోర్‌తో ద్వితీయ స్థానంలో ఉన్నాయి.భారత్‌ తర్వాత స్థానాల్లో జపాన్‌ (62.3), దక్షిణ కొరియా (55.4), ఇండోనేసియా (50.7), ఆ్రస్టేలియా (50.4), థాయ్‌లాండ్‌ (47.7), పాకిస్తాన్‌ (47.2) ఉన్నాయి.      

యువ శ్రామిక శక్తిలో తిరుగులేని ఆధిక్యం 
జీడీపీ వృద్ధికి 2030 తర్వాత తోడ్పడే శ్రామిక వయ సు జనాభా పరిమాణం, 2025–50 మధ్య వాతావరణ మార్పులను తట్టుకుని పనిచేసే శ్రామిక శక్తి సామర్థ్యంలో 100కి 100 స్కోర్‌ సాధించిన ఏకైక దేశంగా భారత్‌ నిలిచింది. చైనా (39.6), అమెరికా (33.2) కంటే భారత్‌ (100) ఎన్నో రెట్లు ముందుండటం ‘యువ జనాభా ప్రయోజనం’(డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌) స్థాయిని చాటుతోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement